ట్రాక్టర్ ఢీకొని కార్మికుడి మృతి
ట్రాక్టర్ ఢీకొని కార్మికుడి మృతి
Published Sat, May 27 2017 10:11 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
మరొకరికి తీవ్రగాయాలు
వి.సావరం(రాయవరం) : ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చేందుకు వెళ్తున్న బట్టీ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. బట్టీ నుంచి రోడ్డుపైకి మరొకరి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఉందుర్తి సత్యనారాయణ (50) అనే బట్టీ కార్మికుడు మృతి చెందగా, మోర్త మహేష్ అనే మరో కార్మికుడు తీవ్రగాయాల పాలైన ఘటన శనివారం మండలంలోని వి.సావరం గ్రామ శివార్లలో చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
అమలాపురం మండలం సామంకుర్రుకు చెందిన ఉందుర్తి సత్యనారాయణ, మండలంలోని పసలపూడికి చెందిన మోర్త మహేష్‌లు కుటుంబ సభ్యులతో పనిచేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకునేందుకు మహేష్, సత్యనారాయణ కలిసి మోటార్‌సైకిల్‌పై రాయవరం బయలుదేరాడు. బట్టీకి కొద్ది అడుగుల దూరంలోనే వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను రాయవరం నుంచి వెదురుపాక వైపుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, గాయాలపాలైన మహేష్‌ను 108 వాహనంపై రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మృతుడు సత్యనారాయణ రెండేళ్లుగా బట్టీలో పనిచేస్తున్నాడు. సత్యనారాయణ భార్య మరియమ్మతో బట్టీలో పనిచేసుకుంటుండగా, కుమారుడు, కుమార్తె వారి స్వగ్రామంలో నివశిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్సై వెలుగుల సురేష్ సంఘటనా స్థలికి వచ్చి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు.
దేవుడా ఎంతపనిచేశావు..
సరుకులు తెస్తానని చెప్పిన నా భర్తను నీ దగ్గరకే తీసుకుని పోయావా..దేవుడా ఎంత పని చేశావంటూ మృతుడు భార్య మరియమ్మ బోరున విలపించింది. బయటకు వెళ్లక పోయినా ప్రాణాలు దక్కి ఉండేవని, ఎంతపని జరిగిందంటూ ఆమె పెట్టిన రోదన మిన్నంటాయి.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’..
మట్టిని రవాణా చేస్తున్న ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న తీరుపై ఈ నెల 25న ‘సాక్షి’లో ‘మట్టి వాహనాల జోరు..ప్రజల బేజారు’ అంటూ ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. మట్టి ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని కథనంలో ప్రస్తావించిన విషయం పాఠకులకు విదితమే.
Advertisement