- ఆలసత్వం వహిస్తే సహించేది లేదు
- అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
- వాడివేడిగా మండల పరిషత్ సమావేశం
బూర్గంపాడు:‘మీకు పనిచేతగాకపోతే వెళ్లిపోండి.. ఎవర్ని బద్నాం చేయటానికి పని చేస్తున్నారు... హరితహారాన్ని అభాసుపాలు చేయొద్దు.. ఫొటోలకు ఫోజులిస్తే సరిపోదు.. దేనికీ సరైనా సమాచారముండదు... అధికారుల మధ్య సమన్వయం ఉండదు... ఎవరికీ బాధ్యత లేదు’ అంటూ మండల అధికారులపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో మండల అధికారుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా మండలంలో 2.67 లక్షల మొక్కలు నాటాలనే ప్రభుత్వ లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోందన్నారు. ఇప్పటికి 50వేల మొక్కలు నాటామని చెబుతున్న అధికారులు... ఏ గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారనే నివేదికలు కూడా లేని పరిస్థితుల్లో పని చేస్తున్నారన్నారు. కనీసం 25శాతం లక్ష్యాన్ని కూడా చేరువకాలేని స్థితిలో మండల అధికారులున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఎంపీడీఓ, ఈజీఎస్ ఏపీఓల అలసత్వంతోనే ఈ పరిస్థితి అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు హరితహారాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఐటీసీలాంటి కార్పొరేట్ సంస్థ ఉంటే హరితహారంలో ఎందుకు భాగస్వామ్యం చేయలేదని అధికారులను ప్రశ్నించారు.
స్థానిక ప్రజాప్రతినిధులంటే లెక్కలేదు, సర్వసభ్యసమావేశాలంటే లెక్కలేదని అధికారులతీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ.. కనీసం స్థానికంగా జరిగే అధికారిక కార్యక్రమాలకు కూడా తమని పిలవటం లేదని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ మారుపాక నగేష్, జెడ్పీటీసీ బట్టా విజయ్‌గాంధీ, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, వైస్ ఎంపీపీ కొనకంచి బసంతీదేవి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు.