జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో పని చేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది తమ పద్ధతులను మార్చుకోకపోతే వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని కడప–కర్నూలు రేంజి డీఐజీ రవికుమార్ హెచ్చరించారు.
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో పని చేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది తమ పద్ధతులను మార్చుకోకపోతే వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని కడప–కర్నూలు రేంజి డీఐజీ రవికుమార్ హెచ్చరించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని డీఎస్పీలు, కడపలోని సీఐలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు ఇప్పటికైనా క్రమశిక్షణగా విధులు నిర్వర్తించాలన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి స్టేషన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఏవైనా మరమ్మతు పనులకు నిధులు అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించి నిధులను మంజూరు చేయాలని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ డీఐజీని కోరారు. కార్యక్రమంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు అశోక్‌కుమార్, రాజేంద్ర, పూజిత నీలం, లోసారి సుధాకర్, బి.శ్రీనివాసులు, వాసుదేవన్, రామకృష్ణయ్య, సర్కార్, నాగేశ్వరరెడ్డి, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు పాల్గొన్నారు.