ముచ్చుమర్రికి ఆద్యుడు వైఎస్‌ఆర్
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసినట్లు గొప్పగా చెప్పుకోవడం కాదు.. ఈ పథకానికి ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే విషయం తెలుసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు.
ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సూటి ప్రశ్న
- సభలో మాట్లాడుతుంటే మైక్ కట్ చేయిస్తారా అంటూ మండిపాటు
- వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు సినిమా డైలాగులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే..
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఐజయ్య ఆగ్రహం
నెహ్రూనగర్(పగిడ్యాల): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసినట్లు గొప్పగా చెప్పుకోవడం కాదు.. ఈ పథకానికి ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే విషయం తెలుసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే వై.ఐజయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు. సోమవారం నెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా పాల్గొన్న తనకు బహిరంగ సమావేశంలో మాట్లాడటానికి అవకాశం కల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన అపర భగీరథుడు అని చెప్పగానే మైక్ కట్ చేయించి అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. చివరి దాకా మాట్లాడకుండా మధ్యలోనే మైక్ లాగేసుకుని తనను అవమాన పరిచేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉండి తనను ఈ మీటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం లేదని ఓ దళిత ఎమ్మెల్యేని అవమానించారన్నారు.
ప్రొటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం వచ్చినందువల్లే సమావేశానికి హజరయ్యానని.. ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇచ్చేలా ముఖ్యమంత్రే వ్యవహరిస్తే కింది స్థాయి అధికారులు ఎలా పాటిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ఎవరు చేపట్టారని కాదు.. ఎవరు ముగించారన్నది ముఖ్యమని పోకిరి సినిమా డైలాగులను వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 2007 ఆగస్టులో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు వ్యయం చేసి 90 శాతం పనులు పూర్తి చేయించారని.. మిగిలిన రూ.75 కోట్ల పనిని పూర్తి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు పట్టిందని విమర్శించారు. రూ.1500 కోట్ల వ్యయంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో పూర్తి చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతలను పూర్తి చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం చేయడంతోనే ముఖ్యమంత్రికి రాయలసీమపై ఎంతో ప్రేమ ఉందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. వైఎస్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమంలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు విజ్ఞత అనిపించుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రమౌళి, మహబూబ్ బాషా, చాంద్‌బాషా, శేఖర్, రాజు, పి. మధు, శ్రీను, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.