హంద్రీ-నీవాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
రొద్దం : హంద్రీ-నీవా పనుల పూర్తిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మడకశిర బ్రాంచ్ కెనాల్ (ఎంబీసీ) పనులు రెండు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం వారు మండలంలోని బొక్సంపల్లి వద్ద ఎంబీసీ ఎల్–6 పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. రెండు నెలల క్రితం తాము ఈ పనులు చూశామని, అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రమూ పురోగతి లేదని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే పెనుకొండ ప్రాంతానికి నీరివ్వడానికి పాలకులు శ్రద్ధ చూపడం లేదని స్పష్టమవుతోందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఽకృషి వల్లే గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు.
అయితే..సీఎం చంద్రబాబు, జిల్లా మంత్రులు తామే నీరు తెచ్చామంటూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీ-నీవా ద్వారా వచ్చిన ప్రతి నీటి బొట్టు వైఎస్సార్ పుణ్యమేనని పునరుద్ఘాటించారు. ‘హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొడలు కొట్టి డిసెంబర్‌లో హిందూపురానికి నీటిని తీసుకువస్తామని, పెనుకొండకు నీరిస్తామని చెప్పారు. జిల్లా మంత్రులు మడకశిరకు వెళ్లి అక్కడికి నీటిని తీసుకొస్తామన్నారు. అయితే ఇప్పటికీ కాలువ పనులే పూర్తి చేసిన పాపానపోలేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్ త్వరతిగతిన పూర్తిచేస్తే కాలువ పక్కనున్న రొద్దం, సోమందేపల్లి చెరువులకు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తారన్న భయంతోనే ఇక్కడ పనులు వేగవంతంగా చేయడం లేదు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికీ కనీసం గుంతలు కూడా పూర్తిగా నిండలేదు. ఆరో పంప్‌హౌస్ పని కూడా పూర్తి కాలేద’ని వివరించారు.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గొల్లపల్లి రిజర్వాయర్‌లో 1.9 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలన్నారు. ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని మండిపడ్డారు. బుక్కపట్నం సభలో చంద్రబాబు 1,200 చెరువులకు నీరు ఇస్తానని చెప్పారని, కాలువ పనులు పూర్తి చేయకనే ఎక్కడి నుంచి నీరు ఇస్తావయ్యా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, పెనుకొండ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, పెనుకొండ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సాయికృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిపి శ్రీనివాసులు, లక్ష్మినారాయణరెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, వాల్మీకీ చంద్రశేఖర్, మంజుస్వామి, కాటిమ తిమ్మారెడ్డి, బీటీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.