కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్‌సీపీ అండదండలు
కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్‌సీపీ అండదండలు
Published Mon, Dec 5 2016 10:59 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
- 16 ఏళ్లుగా పని చేస్తున్నా సర్కారు గుర్తించకపోవడం దారుణం
- సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం
- పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వెల్లడి
- దీక్షలకు మద్దతు
కర్నూలు సిటీ: కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ కృషి చేస్తుందని పార్టీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. వీరి సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేసేందుకు టీడీపీ సర్కారు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే జూనియర్ కాలేజీల్లో 16 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో చేపట్టిన కాంట్రాక్ట్ అధ్యాపకుల దీక్షా శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వస్తే అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు రెండున్నరేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేకపోయారన్నారు. రెగ్యులరైజేషన్ కోసం కమిటీని నియమించినా కాలం కరిగి పోతున్నా కమిటీ తీరులో ఏ మాత్రం కదలిక లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని సీఎం చంద్రబాబు ప్రచారం చేశారని, అయితే ఆయన రావడం వల్ల టీడీపీ నాయకులకు రాజకీయ ఉద్యోగం దొరికింది కాని చదువుకున్న నిరుద్యోగులకు కాదన్నారు. దీనికితోడు ఉన్న ఉద్యోగులనే విధుల నుంచి తొలగిస్తున్నారన్నారు. ఉద్యోగం ఇవ్వలేక పోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామికి బుజు పట్టిందని ఆరోపించారు. ఇచ్చిన హామీని మరిచి తప్పుడు హామీలు, మాటలతో నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరో మూడు నెలలుంటే పరీక్షలున్నాయని, ఇలాంటి సమయంలో అధ్యాపకులు రోడ్లపైకి వచ్చేందుకు కారణమైన హామీపై సీఎం స్పందించాలన్నారు.
దీక్షలకు...ఎన్జీఓలు మద్దతు
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసి, పీఆర్‌సీ అమలు చేయాలని కోరుతూ చేపట్టిన దీక్షలకు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షులు సీహెచ్.వెంగళరెడ్డి సంఘీబావం తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పి.రంగస్వామి, నవీన్‌కూమార్, సేనీత, నాగరాజు, ఈశ్వర్, కిషోర్, శ్రీరాములు, సోమేష్, కె.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement