
తూర్పుగోదావరి, కాకినాడ: ప్రభుత్వం నిర్మించిన రహదారిని ప్రైవేటు సైన్యంతో దౌర్జన్యంగా ధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సోదరుడు, ఆయన కుమారుడితోపాటు కొంతమంది వ్యక్తులు బహిరంగంగా పంచాయతీ నిధులతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేసిన తీరు చూస్తుంటే ఇక్కడ ప్రభుత్వ పాలన నడుస్తుందో, ప్రైవేటు పాలన నడుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం కాకినాడ మహాలక్ష్మినగర ప్రాంతాన్ని కన్నబాబు, పార్టీ నేతలు సందర్శించారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలోని భూమిని, ధ్వంసం చేసిన రహదారిని పరిశీలించారు. అనంతరం కన్నబాబు విలేకర్లతో మాట్లాడుతూ కనుచూపు మేరలోని సముద్రం వరకు ఉన్న భూమి అంతా తనదేనంటూ టీడీపీ ఎమ్మెల్యే బహిరంగంగా కబ్జాకు ప్రయత్నిస్తున్నా సంబంధిత రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఆక్రమణలో భాగంగా అడ్డువచ్చిన పేదల ఇళ్లను, రోడ్లను తొలగించేందుకు సైతం టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వభూమికి తప్పుడు రికార్డులు సృష్టించి కైంకర్యం చేసేందుకు కొండబాబు, ఆయన బంధువులు చేస్తున్న యత్నాలను తక్షణమే రెవెన్యూ యాంత్రాంగం అడ్డుకోవాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేసినా సరైన స్పందన లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యనారాయణ, ఆయన కుమారుడు వనమాడి ఉమాశంకర్‌లపై మొక్కుబడిగా కేసునమోదు చేసి బెయిల్‌బుల్ సెక్షన్లు వేశారని, ఇలాగైతే ఇక ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుందని కన్నబాబు ప్రశ్నించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఇందిరమ్మ పథకంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, అది ప్రైవేటు భూమి అయితే అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కన్నబాబు నిలదీశారు.
ఈ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినా ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ తరఫున గట్టిగా పోరాడతామని కన్నబాబు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం తారకరామానగర్ ప్రాంతంలో మూడు ఎకరాల భూమి విషయంలో ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారన్నారు. కన్నబాబు వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బలగం ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు కర్ణాసుల సీతారామాంజనేయులు, సరబాబు, శివబుజ్జి, గోపిశెట్టిబాబి, ముమ్మిడి శ్రీను, పైడియ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment