
పశ్చిమగోదావరి , నిడమర్రు:ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం ఉపయోగకరం. కార్డులు చిన్న చిన్న తప్పులుంటే సరిచేసుకునే విషయంలో అశ్రద్ధ చేయవద్దు. అత్యవసరమైనప్పుడు ఆదరాబాదరగా మార్చుకునేందుకు ఇటీవల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిలో ఆధార్ తీసుకునే సమయంలో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఒకటి.. దీంతో ఆధార్‌లో పేరు మార్చుకోవాలన్నా, తప్పులు సరిచేసుకోవాలన్నా మీ మొబైల్‌కే నాలుగు అంకెల ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీ సమర్పించాకే మీ పేరు మారుతుంది. అయితే మీ ఇంటి వద్ద కూర్చొని ఆన్‌లైన్‌లో ఆధార్ వెబ్‌సైట్‌లో మొబైల్ నంబరు మార్చటం తెలుసుకుందాం..
మార్చేందుకు రెండు పద్ధతులు
♦ ఆన్‌లైన్‌లో.. మీరు ఇంతకు ముందే మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఉంటే నాలుగు అంకెల ఓటీపీ పనిచేస్తుంది.
♦ ఆఫ్‌లైన్‌లో.. ఒకవేళ మీరు మొదటిసారి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకుంటే లేదా మునుపటి నమోదు చేసిన మొబైల్ నంబర్ వాడుకలో లేని సందర్భంలో ఇది వర్తిస్తుంది. మార్చుకునేందుకు ఆధార్ కేంద్రం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
♦ ఆధార్ స్వీయ నవీకరణ–సేవ పోర్టల్
♦ https://ssup.uidai.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, అలానే కింద బాక్స్‌లో పేర్కొ న్న ధ్రువీకరణ నంబర్‌ను నమోదు చేయాలి.
♦ ఓటీపీ బాక్స్ కింద కనిపిస్తుంది. అక్కడ మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
♦ కొత్తగా మీ వివరాలు నమోదు చేసుకోవడానికి కొత్త పేజీలోకి తీసుకెళుతుంది.
♦ అక్కడ మీ పేరు, లింగం, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఈ–మెయిల్ ఐడీలను నమోదు చేయవచ్చు.
♦ వివరాలు మొత్తం నమోదు చేసిన తర్వాత కొత్త మొబైల్ నంబరును నమోదు చేసి అప్‌డేట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
♦ ఇది మీ కొత్త సంఖ్యను ప్రదర్శించే కొత్త పేజీకి తీసుకెళుతుంది. దీంతో మీరు ఆధార్‌కు అనుసంధానం చేసిన మొబైల్ సంఖ్యను మార్చుకున్నట్టే.
ఆధార్ కేంద్రం ద్వారా
మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ అప్‌డేట్/కరెక్షన్ ఫారంను పూరించి సమర్పించండి. మీ మొబైల్ నంబర్‌ని అప్‌డేట్ చేయడానికి పది రోజుల సమయం పడుతుంది. ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్ మిస్ అయినా ఆధార్ కేంద్రం వద్దకు వెళ్లాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment