విద్వేషంపై కొరడా! | At last it may effect to angry of words | Sakshi
Sakshi News home page

విద్వేషంపై కొరడా!

Published Fri, Mar 14 2014 1:29 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

At last it may effect to angry of words

సంపాదకీయం: మాటనేది ఒక వ్యక్తి సంస్కారాన్ని, పరిపక్వతను పట్టి ఇస్తుంది. వ్యక్తులుగా తాత్కాలిక ఆవేశానికో, ఆగ్రహానికో లోనై మాట్లాడే మాటలు అలాంటివారికే అంతిమంగా నష్టం కలిగిస్తాయి. కానీ, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు వివేకం మరిచి విద్వేషం కలిగించే మాటలు మాట్లాడితే అది మొత్తం సమాజాన్నే ఇబ్బందుల్లోకి నెడుతుంది. అమాయకుల ప్రాణాలకు ముప్పుతెస్తుంది. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా నాయకులు చేసే ప్రసంగాలవల్ల అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది. ఎన్నికలు వస్తున్నా యంటే అందరూ భయపడేది ఇలాంటి ప్రసంగాల గురించే. సాధారణ పరిస్థితుల్లో సవ్యంగా ఉన్నట్టు కనబడేవారు ఎన్నికల సమయంలో పరిధులు మరచి ప్రవర్తిస్తుంటారు. ఎవరినైనా ఏమైనా అనే హక్కు తమ సొంతమని భావిస్తుంటారు. అందుకు దీటుగా సమాధానమివ్వడం కోసం ప్రత్యర్థులు కూడా తమ నోటికి పనిచెబుతారు.
 
 ఈ ధోరణులను అరికట్టడానికి ఏంచేయాలో సూచించమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లా కమిషన్‌ను బుధవారం కోరింది. అంతేకాదు... నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు వారి ఆధ్వర్యంలో ఉండే సంస్థల, పార్టీల గుర్తింపును రద్దుచేయాలా అనే అంశాన్ని కూడా పరిశీలించి చెప్పాలని ఆదేశించింది. ఇలాంటి ప్రసంగాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది. అంతేకాదు... ఆ బాపతు నాయకులపై వెనువెంటనే చట్టప్రకారం చ ర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ నాయకులైనా, సంఘాలకు నాయకత్వంవహిస్తున్నవారైనా, మత సంస్థలకు చెందినవారైనా ఈ తరహా ప్రసంగాలు చేసినప్పుడు చర్యకు వెనకాడవద్దని కోరింది.
 
  మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. ఏ పౌరుడైనా తన భావాలను ప్రచారం చేసుకునే హక్కును ఇచ్చింది. అయితే, దీనికి తగిన హద్దులనూ నిర్ణయించింది. ఆ కట్టుదాటినప్పుడు ఏంచేయాలో సీఆర్‌పీసీలోని వివిధ సెక్షన్లు చెబుతున్నాయి. వివిధ కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టేలా ఉండే మాటలు మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చునని అంటున్నాయి. అయితే, ఏది హద్దుమీరిన మాటో, ఎలాంటి రచన విద్వేషపూరితమైనదవుతుందో సీఆర్‌పీసీ కూడా స్పష్టంగా చెప్పలేదు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని భావించినప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి బాధ్యులుగా భావించినవారిపై కేసులు పెడుతుంటారు. అయితే, నిజంగా ఉద్రేకాలను రెచ్చగొట్టే, విద్వేషాన్ని నూరిపోసే రచనలు, ప్రసంగాలు ఇలాంటి సెక్షన్ల కారణంగా ఆగుతున్నాయా? లేదనే చెప్పాలి. ఆ వంకన భిన్నాభిప్రాయాలనూ, విమర్శలనూ అణచివేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఏది రెచ్చగొట్టే ప్రసంగం... ఏది రెచ్చగొట్టే రచన అనేది న్యాయస్థానాల విచక్షణే నిర్ణయిస్తున్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన సూచనలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
 
 దేశంలో ఎన్నికల వేడి పెరిగాక నాయకుల పరస్పర దూషణల పర్వం పెరిగింది. ఏ ఛానెల్ పెడితే ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని హడలెత్తిపోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈమధ్య బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఉద్దేశించి ‘నపుంసకుడు’ అనే పదాన్ని వినియోగించి అల్లరిపడ్డారు. ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ  పదిరోజులక్రితం దాఖలైన పిటిషన్‌పై ఆదేశాలివ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఇప్పుడు లా కమిషన్‌కిచ్చిన ఆదేశాల ఉద్దేశం వేరు.
 
 విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం లక్షణాన్ని చెప్పి, ఎలాంటి అంశాలు దాని పరిధిలోకి వస్తాయో నిర్ణయించడంవల్ల, దానికి అనుగుణంగా చట్టం రూపొం దించడంవల్ల భవిష్యత్తులో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. స్వప్రయోజనాలను ఆశించి, రాజకీయ లబ్ధిపొందడానికి చిత్తంవచ్చినట్టు మాట్లాడే... రెచ్చగొట్టే నాయకులను ఇప్పుడున్న సీఆర్‌పీసీ నిబంధనలు ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రజాసమూహాలను మతం పేరుతో, కులంపేరుతో విడగొట్టి, విద్వేషాలను నూరిపోసేవారు సురక్షితంగా,దర్జాగా ఉంటుంటే ఆ మారణహోమాల్లో సామాన్యులే సమిధలవుతున్నారు. పార్టీ కావొచ్చు...మతంపేరిట వెలసిన మరేదైనా సంస్థ కావొచ్చు...బాహాటంగా ప్రజలమధ్య చిచ్చుపెడుతున్నా పోలీసులు నిస్సహాయులుగా మిగులుతున్నారు. అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాలను ఆశించి ఇలాంటివారిని చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.
 
 భిన్న జాతులు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న మన దేశంలో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తే ఏమవుతుందో దేశ విభజన కాలంనాటినుంచి నిన్నమొన్నటి ముజఫర్‌నగర్ అల్లర్ల వరకూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం అలాంటి వ్యక్తులపైనా, నాయకులపైనా చర్యలు తీసుకోవడంతోపాటు పార్టీలనూ, సంస్థలనూ నిషేధించే అవకాశం ఉంటుంది. పైగా విద్వేషపూరిత ప్రసంగంమంటే ఏమిటో చెప్పాలనడంవల్ల చట్టానికి స్పష్టత ఉంటుంది. అది దోషులను నేరుగా తాకుతుంది. అలాంటపుడు చర్యలు తీసుకోవడం, నేరాన్ని నిరూపించడం సులభమవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా నిర్దిష్టమైన, స్పష్టమైన చట్టం రూపొంది... స్వార్ధ రాజకీయనేతలను అదుపు చేయగలిగితే అంతకన్నా కావల్సిందేముంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement