చీకటి ఆకాశంలో చిత్రమైన విన్యాసాలతో... రంగుల హంగులతో అలరించే టపాసులు,బాణసంచా యథాప్రకారం ఈ ఏడాది దీపావళి ముందు విషాదాన్ని మోసుకొచ్చాయి.
చీకటి ఆకాశంలో చిత్రమైన విన్యాసాలతో... రంగుల హంగులతో అలరించే టపాసులు,బాణసంచా యథాప్రకారం ఈ ఏడాది దీపావళి ముందు విషాదాన్ని మోసుకొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో టపాసులు తయారుచేస్తున్న గోదాములో సోమవారం హఠాత్తుగా పేలుడు సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరంతా అట్టడుగు వర్గాలకు చెందిన నిరుపేదలు, అందునా మహిళలు కావడం యాదృచ్ఛికం కాదు. అనునిత్యం ప్రాణాలకు ముప్పు పొంచివుండే టపాసుల పరిశ్రమకు దేశంలో ఏమూల అయినా ఈ వర్గాల స్వేదమే ఇంధనం. పేలుడు ధ్వని రెండు కిలోమీటర్ల దూరానికి వినిపించిందంటే, దగ్గరలో ఉండే ఇళ్లు కూడా అదురుపాటుకు లోనయ్యాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. టపాసులు, బాణసంచా తయారీ అనేది నిప్పుతో చెలగాటమాడటం లాంటిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం జరగడానికి ఆస్కారమున్న పని అది. తగినంత అనుభవమూ, నైపుణ్యమూ లేనివారి నిర్వహణలో ఉంటే ఇక చెప్పనవసరమే లేదు. ప్రమాదాలు రాకుండా నివారించడం ఎలాగో, వచ్చినపక్షంలో ఎదుర్కొనడానికి చేయాల్సిన పనులేమిటో తెలుసుకోవడం... అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేసుకోవడం నిర్వాహకుల ప్రాథమిక విధి. వారు నిబంధనలన్నిటినీ సక్రమంగా పాటిస్తున్నారో, లేదో చూడటం... లేనట్టయితే కఠిన చర్యలు తీసుకోవడం అధికార యంత్రాంగం చేయాల్సిన పని. వాకతిప్పలో ఈ రెండూ దారి తప్పబట్టే ప్రమాదం చోటు చేసుకున్నదని అక్కడివారు చెబుతున్నారు.
టపాసుల తయారీ పరిశ్రమలోగానీ, వాటి గొడౌన్లు, దుకాణాల్లోగానీ ప్రమా దాలు కొత్తగాదు. ఏటా అవి జరుగుతూనే ఉన్నాయి. వారం క్రితం హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో ఉన్న టపాసుల గోడౌన్‌లో ఇదే తరహాలో పేలుళ్లు సంభవించి మంటలు వ్యాపించాయి. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా వీటినుంచి గుణపాఠాలు నేర్వడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. టపాసులు, బాణసంచా తయారుచేసేచోటగానీ, వాటిని నిల్వ ఉంచే గోడౌన్లలోగానీ ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాల్సివుంటుంది. ఇనుప బకెట్లు, నీరు, ఇసుక, మంటలు ఆర్పే పరికరాలు అందుబాటులో ఉండాలి. సమాచారం అందుకుని అగ్నిమాపక యంత్రాలు ప్రమాదస్థలానికి చేరేలోగా ప్రాథమిక చర్యలు తీసుకోవడానికి ఇవి అవసరం. అంతేకాదు... టపాసుల తయారీలో పనిచేసే సిబ్బందికి ప్రమాద బీమా వంటివి చేయించాలి. కానీ, ఎక్కడా ఈ నిబంధనలు అమలుకావడంలేదు. నిర్దిష్ట కాలవ్యవధిలో టపాసుల తయారీ కేంద్రాలను తనిఖీచేసి, నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో చూడాల్సిన అధికారులు ఆ పనిలో విఫలమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమల లెసైన్సులను రద్దుచేయాల్సి ఉండగా, అలాంటివి అరుదుగా మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు వాకతిప్పలో టపాసులు తయారుచేస్తున్నవారికి అందుకు అవసరమైన అనుమతులు లేవని ప్రాథమికంగా తెలుస్తున్నది. గత మార్చిలోనే లెసైన్సు గడువు ముగియగా, అది ఎందుకు కొనసాగుతున్నదన్న ఆరా స్థానికంగా ఉండే అధికారులెవరికీ రాలేదు. దురదృష్టమే మంటే, ప్రమాదం జరిగాక కూడా అందుకు సంబంధించిన స్పష్టత లేదు. ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప అన్ని అనుమతులూ ఉన్నాయని చెబుతారు. లెసైన్స్ గడువు ముగిసినా అనధికారికంగా దాన్ని నిర్వహిస్తున్నారని అధికారులంటారు. క్షణంలో పెను విధ్వంసం సృష్టించడానికి ఆస్కారమిచ్చే పరిశ్రమ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నదో ఈ ఉదంతమే రుజువు.
టపాసుల రాజధానిగా భావించే తమిళనాడులోని శివకాశిలో అడపాదడపా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 1994-2008 మధ్య జరిగిన172 ప్రమాదాలపై అక్కడి సామాజిక శాస్త్రవేత్తలు ముగ్గురు చేసిన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ ప్రమాదాల్లో 216మంది ప్రాణాలు కోల్పోగా పదులకొద్దీ మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు అందరూ బలహీనవర్గాలకు చెందినవారే. ఎక్కువ ప్రమాదాలు అజాగ్రత్తవల్లనే చోటు చేసుకోన్నాయని వారు సోదాహరణంగా వివరించారు. టపాసుల తయారీకి వినియోగించే మందుగుండుతో ఎలా వ్యవహరించాలో, ఏమేమి అందుబాటులో ఉంచుకోవాలో చాలామందికి తెలియలేదని వారి పరిశీలనలో వెల్లడైంది. టపాసుల పరిశ్రమలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. అందులో పనిచేసేవారంతా అక్కడివారే అయివుంటారు. సహజంగానే వారిలో చాలామంది చదువుకు దూరమైనవారే. కనుక ఆ పనిలో ఇమిడివుండగల ప్రమాదం గురించిన అవగాహన వారికి సరిగా ఉండదు. తాము ఎలాంటి పదార్థాలతో సహవాసం చేస్తున్నామో, దానివల్ల తమ ఆరోగ్యానికి వాటిల్లగల ముప్పేమిటో కూడా అర్ధంకాదు. అనుకోనిదేమైనా సంభవిస్తే ఏమవుతుందో కూడా తెలియదు. ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నిర్వాహకులు తక్కువ వేతనాలు చెల్లించడమే కాక, వారిని ప్రమాదకర పరిస్థితుల్లో ఉంచుతున్నారు. దేశంలో ఎక్కడ ప్రమాదం జరిగినా అందుకు దారితీసిన కారణాలను విశ్లేషించి, అలాంటివి తమ వద్ద చోటు చేసుకోకుండా ఏమి చేయాలో కార్యాచరణ రూపొందించడం ప్రభుత్వాల ధర్మం. అది మాత్రం జరగడంలేదు. మనతో పోలిస్తే చైనా టపాసుల పరిశ్రమ విస్తృతమైనది. ప్రమాదాలు జరిగినప్పుడల్లా లోపాన్ని గుర్తించడం, వాటిని మళ్లీ పునరావృతం కానీయని రీతిలో నిబంధనలు రూపొందించడం, ఉన్నవాటిని సవరించటం దాని ప్రత్యేకత. మన దగ్గర ఇలాంటి పట్టింపు లేదు. నిబంధనలు పాటించడం కంటే ఉల్లంఘించడంవల్లే జేబులు నిండే పరిస్థితి ఉండటమే ఇందుకు కారణం. వాకతిప్ప ఘటనైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్లు తెరిపించాలి. మరో ప్రమాదానికి తావీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.