
ఒక ప్రాంత దేశాలన్నీ సమష్టిగా కదిలితే సాధించనిదంటూ ఏమీ ఉండదు. నేపాల్ రాజధాని కఠ్మాండూలో రెండురోజులు కొనసాగి శుక్రవారం ముగిసిన బిమ్స్‌టెక్(బే ఆఫ్ బెంగాల్ ఫర్ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఆ దిశగా కొంత ముందడుగు వేసింది. 21 ఏళ్లక్రితం మన దేశంతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లతో ‘బిస్ట్–ఈసీ’గా ఆవిర్భవించిన ఈ సంస్థ అనంతరకాలంలో నేపాల్, మయన్మార్ కూడా చేరటంతో పేరు మార్చుకుంది. బంగాళాఖాతం తీరాన ఉన్న దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు సాంకే తిక, ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాల్లో పరస్పరం సహరించుకోవటం దీని ప్రధా నోద్దేశం. ఉమ్మడి ప్రయోజనాలుండే మత్స్య పరిశ్రమ, రవాణా, కమ్యూనికేషన్లు, ఇంధనం వగైరా అంశాల్లో కూడా సమష్టిగా పనిచేయాలని ఈ దేశాలు నిర్ణయించుకున్నాయి.
అయితే ప్రాంతీయ కూటముల్లోని దేశాలు ఇరుగుపొరుగైతే ఉమ్మడి ప్రయోజనాలతోపాటు సమస్యలు కూడా ఉంటాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) ఇందువల్లే తగినంత శక్తిసామ ర్థ్యాలతో పనిచేయలేకపోతోంది. ఆ సంస్థ సభ్యదేశాలైన భారత్, పాక్‌ల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు దానికి అవరోధంగా నిలుస్తున్నాయి. బిమ్స్‌టెక్‌లో ఈ తరహా సమస్యలు పెద్దగా లేవు. మనకు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లతో సరిహద్దులున్నాయి. ఇందులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మనతో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. మయన్మార్‌లో ఇంతక్రితం సైనిక పాలకులైనా, ఇప్పుడున్న పౌర ప్రభుత్వ అధినేతలైనా సఖ్యంగానే మెలిగారు. నేపాల్‌తో పొరపొచ్చాలున్నా అవి వైషమ్యాల స్థాయికి చేరలేదు. బిమ్స్‌టెక్‌లోని ఏడు దేశాల్లోనూ 150 కోట్లమంది జనాభా ఉన్నారు. ఈ దేశాలన్నిటి స్థూల దేశీయోత్పత్తులు మూడున్నర లక్షల కోట్ల డాలర్ల పైమాటే. ఈసారి శిఖరాగ్ర సదస్సు ప్రధానంగా శాంతియుత, సుస్థిర, సంపన్నవంత బంగాళాఖాత ప్రాంతాన్ని రూపుదిద్దేం దుకు చేయాల్సిన కృషిపై చర్చించింది.
బిమ్స్‌టెక్ దేశాల్లో మన దేశం వేరే దేశాలతో పోలిస్తే ఆర్థికంగా, సైనికంగా చాలా పెద్దది. భార త్–పాక్‌ల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు సార్క్ ఎదుగుదలకూ, ఆ దేశాలమధ్య అర్ధవంతమైన సహకారానికి అవరోధంగా మారాయని ఈమధ్యకాలంలో గుర్తించిన మన దేశం బిమ్స్‌టెక్ పటి ష్టానికి ప్రయత్నించాలన్న నిర్ణయానికొచ్చింది. సార్క్‌లో తీసుకునే ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయం ప్రాతిపదికనే ఉండాలన్నది ప్రధానమైన షరతు. భారత్–పాక్‌లు రెండూ చాలా అంశాల్లో విభేదిం చుకుంటున్నాయి గనుక ఆ సంస్థలో నిర్ణయాలు తీసుకోవటం అసాధ్యంగా మారింది. ఉగ్రవాదు లకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వటం మానుకుంటే తప్ప ఆ దేశంతో ఎటువంటి చర్చలూ జరపరాదని నిర్ణయించిన పర్యవసానంగా 2016లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సదస్సు రద్దయింది. ఇలాంటి ప్రాంతీయ సహకార కూటములు ఏర్పడినప్పుడు సహజం గానే పరస్పర అవిశ్వాసం తప్పదు. నేపాల్, బంగ్లాదేశ్ సార్క్ అంకురార్పణకు ప్రయత్నించిన ప్పుడు దాన్ని మన దేశం అనుమాన దృక్కులతో చూసింది. చిన్న దేశాలన్నీ తనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయని భావించింది. భారత్–పాక్ ఉద్రిక్తతలు దీనికి తోడయ్యాయి.
నాలుగేళ్లక్రితం కఠ్మాండూలో సార్క్ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు అందులో చైనాను కూడా చేర్చుకుందామని నేపాల్ ప్రతిపాదించింది. సహజంగానే దీనికి పాకిస్తాన్ మద్దతు పలికింది. అయితే మన దేశానికి ఇది ససేమిరా ఇష్టం లేదు. చెప్పాలంటే బిమ్స్‌టెక్‌కి కూడా ఇటువంటి సమస్యలున్నాయి. ఉనికి లోకొచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్నా దానికంటూ ముసాయిదా ప్రణాళిక రూపొందలేదు. స్థూలంగా కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకుని వాటి పరిధిలో పనిచేసుకుంటూ పోవటమే కొనసాగు తోంది. సార్క్ అనుభవాల తర్వాత మన దేశం దీనికి మళ్లీ జవజీవాలు కల్పించాలని భావించ టంతో ఇప్పుడీ శిఖరాగ్ర సదస్సు సాధ్యమైంది. మొదట్లో బిమ్స్‌టెక్‌పై సంశయపడిన నేపాల్ అనంతరకాలంలో ముందు పరిశీలక హోదాలో, అనంతరం పూర్తి స్థాయి సభ్య దేశంగా చేరింది. దీనివల్ల లాభపడటం ప్రారంభించింది కూడా. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడ్డాయి. ప్రస్తుత నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఏకకాలంలో అటు చైనాతోనూ, ఇటు మనతోనూ సఖ్యత కొనసాగించి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు అగ్ర దేశాల అండ తమకుంటే అంతర్జాతీయంగా మరే దేశంపైనా ఆధారపడనవసరం లేదన్నది ఆయన ఉద్దేశం. అందుకే చైనా తలపెట్టిన భారీ ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్‌ఐ)లో నేపాల్ చేరింది. అదే సమ యంలో మన సహకారంతో రైలు, రోడ్డు ప్రాజెక్టుల్ని చేపడుతోంది.
మన ఇరుగుపొరుగు మునుపటిలా లేవు. కేవలం మనపైనే ఆధారపడే స్థితిని దాటుకుని ముందుకెళ్లాయి. ఒకదాని తర్వాత మరో దేశం చైనా ప్రభావంలో పడుతున్నాయి. అందుకే గతంతో పోలిస్తే మనం ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది. పెద్దన్నగా వ్యవహరిస్తున్నామన్న అభిప్రాయం చిన్న దేశాల్లో కలిగించకూడదు. ఇరుగు పొరుగుకు ప్రథమ ప్రాధాన్యం, ‘తూర్పు దిశగా కార్యాచరణ’ అనే రెండు లక్ష్యాలనూ సాధించటమే ధ్యేయమని బిమ్స్‌టెక్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. హిమశిఖరాలకూ, బంగాళాఖాతానికీ మధ్యనున్న దేశాలు తరచు తుఫానులు, భూకంపాల బారినపడుతున్నందున ఆ అంశాల్లో మరింత సమన్వయం, సహకారం పెరగాలన్న సూచన కూడా మెచ్చదగిందే. ఉగ్రవాదం, ఇతర అంతర్జాతీయ నేరాలకు పోత్సా హాన్నందించే దేశాలనూ, సంస్థలనూ గుర్తించి వాటిని జవాబుదారీ చేయాలని కఠ్మాండూ డిక్లరేషన్ ఏకగ్రీవంగా పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పటం, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవటం తమ ప్రధాన లక్ష్యాలని చాటింది. ఇకపై బిమ్స్‌టెక్ చురుగ్గా పనిచేస్తుందని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment