ఎన్‌కౌంటర్ల హోరు! | Encounters | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్ల హోరు!

Published Thu, Apr 9 2015 1:48 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ఎన్‌కౌంటర్ల హోరు! - Sakshi

ఎన్‌కౌంటర్ల హోరు!

సంపాదకీయం
 అయిదారు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేలుతున్న తుపాకులు... ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా కొన్నేళ్లపాటు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో గత బుధవారం రాత్రి బస్టాండ్‌లో పోలీసులు తనిఖీ చేస్తున్న సందర్భంలో ఉన్నట్టుండి ఇద్దరు ఉగ్రవాదులు ఒక కానిస్టేబుల్‌నూ, హోంగార్డునూ కాల్చిచంపింది మొదలు చోటుచేసుకున్న ఘటనల పరంపర ప్రజలను కలవరపరిచింది. ఇంతలోనే మంగళవారం రెండు రాష్ట్రాల్లోనూ మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయి. నల్లగొండ-వరంగల్ జిల్లా సరిహద్దుల్లో జాతీయ రహ దారిపై ఉగ్రవాది వికారుద్దీన్, అతని గ్యాంగ్ సభ్యులు అయిదుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో రెండు ఎన్‌కౌంటర్లు సంభవించాయి. ఎర్రచందనం చెట్లను నరికేందుకు స్మగ్లర్లు తమిళనాడు నుంచి తీసుకొచ్చినట్టు చెబుతున్న 20 మంది కూలీలు ఈ ఎన్‌కౌంటర్లలో మరణించారు.

 ఉగ్రవాదుల ఆగడాలనుగానీ... శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను విచక్షణారహితంగా నరికేస్తున్న స్మగ్లర్ల కార్యకలాపాలనుగానీ ఎవరూ సమర్థించరు. చట్టవిరుద్ధమైన ఇలాంటి వాటిని ఏ ప్రభుత్వమూ చూస్తూ ఊరుకోలేదు. నల్లగొండ జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన విషాదం అంతా ఇంతా కాదు. తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను కాల్చిచంపడమే కాదు... ఆ దారిన పోతున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలు మరిచిపోక మునుపే ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో చనిపోయిన వికారుద్దీన్ గ్యాంగ్ గతంలో మారణాయుధాలతో సాగించిన దోపిడీలు, దాడులు అందరికీ తెలుసు. ఆ కేసుల్లో వారు చివరకు పట్టుబడి జైలుకెళ్లారు. అక్కడ కూడా జైలు సిబ్బందిపై దాడులు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నవారు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న శక్తులను చట్టబద్ధంగా శిక్షించాలని కోరుకుంటారు తప్ప పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకోరు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారు. వారి ప్రాణాలకు ముప్పు కలగకుండా చూసుకోవాల్సింది ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు సిబ్బందే. ఏదో వంకతో వ్యాన్‌ను ఆపించి ఉగ్రవాదులు పారిపోవడానికి ప్రయత్నిం చారని, ఈ క్రమంలో తమ వద్దనుంచి వికారుద్దీన్ తుపాకి గుంజుకోవడానికి ప్రయత్నించగా మిగిలిన నలుగురూ తిరగబడ్డారని పోలీసుల కథనం. అప్పుడు జరిగిన కాల్పుల్లో వారు మరణించారని పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో ఉగ్రవాదులందరూ వ్యాన్‌లోనే ఉన్నారు. వారి చేతులకు సంకెళ్లు న్నాయి. పోలీసుల కథనం నిజమే అనుకున్నా... వ్యాన్‌లో ఉన్నవారిని, అందునా సంకెళ్లతో ఉన్నవారిని ప్రాణాలు తీయకుండా అదుపు చేయడం అసాధ్యమా? 17 మంది పోలీసు సిబ్బంది ఉండికూడా ఇలా చేయలేకపోయారంటే అది వారి అసమర్థతే అవుతుంది. అసలు జరిగిందేమిటో చెప్పడానికి పోలీసుల కథనం తప్ప మరే ఆధారమూ లేకపోవడంవల్ల ఈ ఉదంతం సంశయాలను పెంచింది.

 శేషాచలం అడవుల్లో చోటుచేసుకున్న రెండు ఎన్‌కౌంటర్ల విషయంలోనూ ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన రెండు ప్రదేశాల పేర్లే చిత్రంగా ఉన్నాయనుకుంటే పోలీసుల కథనాలు అంతకన్నా విచిత్రంగా ఉన్నాయి. ఒకటి సచ్చినోడి బండ. అక్కడ 11 మంది కూలీలు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. రెండోది చీకటీగల కోన. ఆ ప్రాంతంలో 9మంది కూలీలు చనిపోయారు. తమపై 100 మందికిపైగా కూలీలు గొడ్డళ్లతో, రాళ్లతో దాడి చేశారని... ఆ క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయని పోలీసుల కథనం. దుంగలను మోసుకుపోయే కూలీలు గొడ్డళ్లతో, రాళ్లతో తిరగబడటం...వారినుంచి ‘ఆత్మరక్షణ’ చేసుకోవడానికి కాల్పులు జరపడం ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు కాల్పుల్లో ఒకరో, ఇద్దరో నేలకొరిగాక చుట్టూ ఎవరైనా మిగులుతారా? మృతదేహాలవద్ద దుంగలు పడివున్నాయి తప్ప మరెక్కడా లేవు. అంటే... పారిపోయిన 80 మంది దుంగలతో పరారైనట్టా? ఆ అటవీ ప్రాంతంలో దుంగలు పట్టుకుని పరుగులె త్తడం సాధ్యమేనా? పైగా మృతుల వద్ద లభించిన దుంగలన్నిటిపైనా పెయింట్ గుర్తులుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. స్వాధీనమైన దుంగలపై అటవీ సిబ్బంది ఈ గుర్తులువేస్తారు. నరికి తీసుకెళ్తున్న దుంగలపైకి ఈ గుర్తులెలా వ చ్చాయో అధికారులే చెప్పాలి. ఆ ప్రాంతాల్లో దొరికినవి మూడు గొడ్డళ్లు, రెండు నాటు తుపాకులు! ఇవన్నీ ఎన్‌కౌంటర్ల బూటకత్వాన్ని తెలిపినంతగా...పోలీసు కథనాల నిజాయితీని చాటడం లేదు. తమిళనాడు నుంచి వచ్చినవారికి ఆ రాత్రి అడవుల్లో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు కొందరు అమాత్యులు. వారంతా స్మగ్లర్ల తరఫున చందనం చెట్లు నరకడానికి వెళ్లినవారే అయినా...ఆ కారణంతో వారిని కాల్చిచంపేయవచ్చా?

 ఈ ఎన్‌కౌంటర్ మృతులంతా తమిళనాడువారు కావడంతో ఏపీ బస్సులపై అక్కడ దాడులు జరిగాయి. నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. 20 మంది మరణించే స్థాయిలో రెండు ఎన్‌కౌంటర్ ఉదంతాలు జరిగాయని మాత్రమే కాదు... పొరుగు రాష్ట్రంలో అవి సృష్టించిన ఉద్రిక్తతలను గమనించాకైనా ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతను గుర్తించి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సింది. ఎన్‌కౌంటర్లపై వస్తున్న సంశయాలను నివృత్తిచేసేందుకు తగిన విచారణ జరుపుతామని చెప్పాల్సింది. మౌనంవహించడంవల్ల మరిన్ని అనుమానాలు పెరగడం తప్ప జరిగేదేమీ ఉండదు. ఇరు రాష్ట్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతులు కరుడుగట్టిన నేరస్తులే అనుకున్నా వారిని చట్టం విధించిన పరిమితులకు లోబడి శిక్షించాలి తప్ప వేరేవిధంగా కాదు. వ్యవస్థలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటేనే సమాజంలో ఆ తరహా భావనలు వెల్లివిరుస్తాయి. లేనట్టయితే సమాజమూ బండబారుతుంది. అప్పుడు మిగిలేది ఆటవిక న్యాయమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement