కారణాలేమైనా కావొచ్చు... తరచు వార్తల్లో ఉండటం గుజరాత్‌కు రివాజుగా మారింది. దశాబ్దకాలంనుంచీ ఇదే పరిస్థితి. 2002లో అక్కడ సాగిన మారణకాండ, అటుతర్వాత సాగిన ఎన్‌కౌంటర్లు వగైరాలపై విచారణలు, దర్యాప్తులు ఇప్పటికీ ఎడతెగని సీరియల్‌లా నడుస్తూనే ఉన్నాయి. ఈ పరంపరలో మరో అంకానికి తెరలేచింది. 2004లో 19ఏళ్ల యువతి ఇష్రాత్ జహాన్, మరో ముగ్గురు యువకులు మరణించిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ సీనియర్ అధికారి రాజిందర్ కుమార్‌ను, ఆ విభాగానికే చెందిన మరో ముగ్గురు అధికారులనూ ముద్దాయిగా చేరుస్తూ సీబీఐ అనుబంధ చార్జిషీటు దాఖలుచేసింది. సర్వీసులో ఉన్న ముగ్గురు అధికారుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించి ముందస్తు అనుమతి తీసు కోవాలా, వద్దా అనే అంశంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని చెప్పేలో గానే సీబీఐ ఈ చార్జిషీటు దాఖలుచేసింది. ‘నా హృదయం ఈ నిర్ణయం వద్దని చెప్పినా... మనసు మాత్రం చేయకతప్పదన్నది’అని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను నిందితులను చేర్చాల్సిరావడం ఆయనకు బాధాకరమే అనిపించిందట! ఈ సందర్భంగానే రంజిత్‌సిన్హా మరో కీలక వ్యాఖ్య చేశారు. ‘గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అనుచరుడు అమిత్‌షాను కూడా ముద్దాయిగా చేర్చివుంటే యూపీఏ సర్కారు సంతోషించేదేమో...కానీ, మేం సాక్ష్యాధారాలనుబట్టే అన్నీ చేశాం’అని ఆయనన్నారు.
ఒక కేసులో కూలంకషంగా దర్యాప్తు చేసి, అందులో కొందరిని ముద్దాయిలుగా నిర్ధారించాక సీబీఐ డెరైక్టరంతటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యకరమే. కానీ, ఈ కేసుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికే చెందిన రెండు కీలక సంస్థలు పరస్పరం తలపడుతున్నాయి. అందులో ఒకటి సీబీఐ కాగా, రెండోది ఇంటెలిజెన్స్ బ్యూరో. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఈ ఎన్‌కౌంటర్ బూటకమని చెప్పడంతో ఆగిపోలేదు. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన సమాచారం ఎవరిచ్చారు... అది వారికి ఎలా వచ్చిందన్న కూపీ లాగింది. సరిగ్గా అక్కడే ఐబీకి చిర్రెత్తుకొస్తున్నది. గుజరాత్ హైకోర్టు అడిగిందేమిటి? సీబీఐ శోధిస్తున్నదేమిటని దర్యాప్తు దశలోనే నిలదీసింది. ఇది సరికాదని కేంద్ర హోంమంత్రి నుంచి ప్రధాని వరకూ చాలామంది దగ్గర చెప్పింది. కానీ, ఏ కారణం చేతనో రంజిత్‌సిన్హా వదల్లేదు. ఇష్రాత్ జహాన్, మరో ముగ్గురు యువకులూ ఉగ్రవాదులనీ... వారు నరేంద్ర మోడీని హతమార్చడానికి కుట్రపన్ని అహ్మదాబాద్ దిశగా వస్తున్నారనీ సమాచారం అందించిన రాజిందర్ కుమార్‌ను కూడా ముద్దాయిని చేశారు. ఐబీకి స్పెషల్ డెరైక్టర్‌గా ఉండగా రాజిందర్‌పై అభియోగం మోపితే బాగుండదనుకున్నారేమో... ఆయన రిటైర య్యేదాకా వేచివుండి చార్జిషీటు దాఖలుచేశారు. ఎన్‌కౌంటర్ల కథకు ఆద్యులెవరోగానీ... స్థలకాలాదులు, వ్యక్తులు మినహా ఆ కథలో లేశమాత్రమైనా మార్పుం డదు. గుజరాత్‌లో ఉగ్రవాదులు, ఇతర రాష్ట్రాల్లో నక్సలైట్లు, కొన్నిచోట్ల దోపిడీదొంగలు, గంధపు చెక్కల స్మగ్లర్లు ఈ ఎన్‌కౌంటర్లలో మరణిస్తారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న విభాగాలకూ, వారికి సాయపడుతున్న గూఢచార విభాగాలకూ తగిన జవాబుదారీతనం కొరవడటంవల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నది పౌరహక్కుల సంఘాల ఆరోపణ. 2002-07 మధ్య గుజరాత్‌లో సాగిన 22 బూటకపు ఎన్‌కౌంటర్ ఘటనలపై విచారణ జరిపించాలని పౌరసమాజ ప్రతినిధులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తే అందులో కనీసం అయిదు ఎన్‌కౌంటర్లు రాజిందర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసినవే.
ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ సాగించిన దర్యాప్తు అంతా రాజకీయ ఒత్తిళ్లతో సాగిందని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ ఆరోపిస్తున్నా అందులో జవాబులేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. మృతులందరూ లష్కరే తొయిబా ఉగ్రవాదులనీ, వారు పాకిస్థాన్ పౌరులనీ పోలీసులు చెప్పినా ఇష్రాత్ ముంబైకి చెందిన యువతిగా, మరో యువకుడు కేరళకు చెందినవాడుగా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు ఎవరన్నది తేలకపోయినా, వారి మృతదేహాలవద్ద లభించిన పాకిస్థాన్ గుర్తింపు కార్డులు ఫోర్జరీవని రుజువైంది. మున్సిఫ్ మేజిస్ట్రేట్ నిర్వహించిన దర్యాప్తులోనూ, అటు తర్వాత గుజరాత్ హైకోర్టు నియమించిన సిట్ దర్యాప్తులోనూ ఈ ఎన్‌కౌంటర్ బూటకమని నిర్ధారించారు. కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా, పరిస్థితులు పట్టి ఇస్తున్న ఆధారాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ హత్యేనని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే ఐపీఎస్ అధికారులు డీజీ వంజారా, పీపీ పాండే, గిరిష్ సింఘాల్‌లాంటివారు నిందితులుగా ఉన్నారు. ఈ కేసు సాకుతో సీబీఐ తమను వేధిస్తున్నదనీ, తమ విభాగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర క్రీడకు అది తెరలేపిందని నిరుడు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఐబీ చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం ఆరోపించారు. ఇది దేశభద్రతకు చేటు తెస్తుందని కూడా హెచ్చరించారు. తమకు వివిధ వర్గాలనుంచి అందే సమాచారాన్ని వేర్వేరు విభాగాలకు పంపడం రివాజని, దాన్లో కూడా కుట్ర కోణాన్ని చూస్తే ఎలా అన్నది ఐబీ అభ్యంతరం. అసలు గూఢచార విభాగాలైనా, సీబీఐలాంటి సంస్థలైనా నిర్దిష్టమైన చట్టాలకు, నిబంధనలకు లోబడి పారదర్శకంగా పనిచేస్తే ఏ సమస్యలూ రావు. తాము ఏదంటే అది నడుస్తున్నదన్న ధీమాతో, అడిగేవారు లేరన్న ధైర్యంతో వ్యవహరించడంవల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలోనైనా ఆయా విభాగాల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. వ్యక్తులైనా, సంస్థలైనా చట్టబాహ్యతకు పాల్పడకుండా తగిన కట్టుదిట్టాలు చేయాలి.
ఒక ఎన్‌కౌంటర్... ఎన్నో ప్రశ్నలు!
Published Sun, Feb 9 2014 12:18 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement