రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను గవర్నర్లుగా నియమిం చడమే ఉత్తమమని చాన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు వ్యక్తంచేసిన అభిప్రా యాన్ని పెడచెవినబెట్టిన పర్యవసానంగా మరోసారి గవర్నర్ల వ్యవస్థ రచ్చకెక్కింది. అధికార పగ్గాలు చేపట్టిన నెల్లాళ్లలోనే ఎన్‌డీఏ ప్రభుత్వం జూలు విదిల్చి యూపీఏ హయాంలో నియమితులైన గవ ర్నర్లకు నిష్ర్కమించాలంటూ సంకేతాలు పంపింది. ఈ సంకేతాలను అందుకుని మర్యాదగా రాజీనామాలు సమర్పించింది ఇప్పటికైతే యూపీ గవర్నర్ బీఎల్ జోషి ఒక్కరు మాత్రమే. మిగిలిన వారంతా ‘చెప్పదగినవారు’ చెబితే తప్పుకుంటామని, లిఖితపూర్వ కంగా ఇస్తే తప్పుకుంటామని లౌక్యం ప్రదర్శిస్తున్నారు. మరో రకంగా చెప్పాలంటే వారు కేంద్రంతో ఘర్షణకు సిద్ధపడుతున్నారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అయినంతగా మరేదీ కాలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజ్‌భవన్‌లను బ్రాంచ్ ఆఫీసులుగా మార్చడం, కేంద్రం ఏజెంట్లుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం తప్ప గవర్నర్లు చేస్తున్నదేమీ లేదన్న విమర్శలు తరచు వినబడుతుంటాయి. రాజ్యాంగాన్ని చూపించి, రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయాలను ఉటంకించి గవర్నర్ల వ్యవస్థకుండే పవిత్రతను ఎంతైనా చెప్పవచ్చు. కానీ ఆచరణకొచ్చేసరికి అవి కలికానికి కూడా కనబడకపోవడంవల్లే ఈ దుస్థితి. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులై 35 ఏళ్ల వయసు నిండివుండటం, ఆదాయం లభించే ఏ పదవిలోనూ లేకపోవడం, ఏ చట్టసభలోనూ సభ్యుడుకాకపోవడం గవర్నర్‌గా నియామకానికి ప్రాథమిక అర్హతలు. కానీ, ఈ అర్హతల ప్రాతిపదికనే గవ ర్నర్‌గా నియమితులైనవారు ఇన్ని దశాబ్దాల్లో ఎవరైనా ఉన్నారా? తమ నాయకశ్రేణిలో అసంతృప్తులుగా ఉన్నవారిని చల్లార్చడానికో, అవసరార్ధం కీలక పదవులనుంచి తప్పించినవారికి పునరావాసం కోసమో, సీబీఐవంటి సంస్థలకు డెరైక్టర్లుగా పనిచేస్తూ తమ తాబేదార్లుగా వ్యవహరించి రిటైరైనవారికో గవర్నర్ పదవుల్ని కట్టబెట్టడం కేంద్రంలో ఉండే అధికార పక్షానికి రివాజైంది. రోశయ్య, షీలా దీక్షిత్, హెచ్.ఆర్. భరద్వాజ్, జేబీ పట్నాయక్, మార్గరెట్ ఆల్వా, కమలాబేణీవాల్... ఇలా అందరూ సీఎంలుగా, కేంద్రమంత్రులుగా పనిచేసి పునరావాసంలో భాగంగా గవర్నర్లయి నవారే. తమను నియమించినవారి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టినవారు ఇందులో చాలామంది ఉన్నారు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ గవర్నర్ల నియామకానికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. ఆ పదవికి ఎంపికయ్యే వ్యక్తులు ప్రముఖులు లేదా ఏదో ఒక రంగంలో నిష్ణాతులు అయివుండాలని, రాజకీ యాలకు సంబంధం ఉండరాదని అభిప్రాయపడింది. యూపీఏ సర్కారు నియమించిన వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషన్ సైతం ఇలాంటి సూచనలే ఇచ్చింది. ఎస్‌ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు కూడా రాజకీయ నేతలకు గవర్నర్ పదవులు పునరావాసంగా మారవద్దని సూచించింది. ఇందరు ఇన్నివిధాల చెప్పినా గవర్నర్ల వ్యవస్థ ఏ కొంచెమైనా మారింది లేదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని చూపించి, నైతికతను ఏకరువుపెట్టి ఎన్‌డీఏ సర్కారును తప్పుబట్టేవారు దీన్ని గుర్తించవలసి ఉంది. ఇష్టానుసారంగా గవర్నర్ పదవులు పంచిపెట్టే సంప్రదాయం కొనసాగుతున్నప్పుడు ఇలా తీసేయడంలో తప్పున్నదని ఎవరూ భావించలేరు.
కేంద్రంలో అధికారపక్షం మారగానే గవర్నర్లపై కొరడా ఝళి పించడం సర్వసాధారణమైంది. 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పతనమయ్యాక అధికారంలోకొచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం తొలి సారి గవర్నర్ల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అంతకు ముందు ఇలాంటి సంప్రదాయం లేదు గనుక కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా, పద్ధతిప్రకారం వ్యవహరించిందని అనలేం. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటం అదే ప్రథమం. జనతా ప్రభుత్వం నెలకొల్పిన సంప్రదాయాన్ని కేంద్రంలో అధికారంలో కొచ్చిన ప్రతి ప్రభుత్వమూ అనుసరించింది. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతక్రితం ఎన్‌డీఏ సర్కారు నియమించిన గవర్నర్లు విష్ణుకాంత్ శాస్త్రి(యూపీ), కైలాసపతి మిశ్రా(గుజరాత్), బాబూ పరమానంద్(హర్యానా), కేదార్‌నాథ్ సాహ్ని(గోవా)లను తొలగించింది. ఈ తొలగింపును సవాలుచేస్తూ బీపీ సింఘాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రాజ్యాంగ ధర్మాసనం 2010లో తీర్పు వెలువరించింది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటు లేదా ఉద్యోగి కాదని...
ప్రభుత్వం మారగానే గవర్నర్‌ను తొలగించడం చెల్లదని స్పష్టంచేసింది. తమ విధానాలకూ లేదా సిద్ధాంతాలకూ అనుగు ణంగా లేరన్న కారణంతో తొలగించడం కుదరదని రాజ్యాంగంలోని 156(1) అధికరణాన్ని ఉటంకిస్తూ చెప్పింది. తొలగించవలసివచ్చిన పక్షంలో అందుకు ప్రత్యేకమైన, తప్పనిసరి పరిస్థితులుండాలని నొక్కి చెప్పింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న గవర్నర్లు తమది రాజ్యాంగబద్ధమైన పదవి అంటున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ నియామకానికి ఎలాంటి కొలమానాలూ పాటించనప్పుడు... అధికా రంలో ఉన్నవారికి సన్నిహితులు కావడమే పదవికి ఏకైక అర్హత అయి నప్పుడు తొలగించడంలోనూ అలాంటివే పని చేస్తాయని వారు గుర్తించాలి. గవర్నర్ పదవిపై చర్చ వచ్చింది గనుక కనీసం ఇప్పుడైనా రాజకీయేతర వ్యక్తులను నియమించగలిగితే ఎన్‌డీఏ సర్కారు ఒక కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పినట్టవుతుంది. కానీ, వర్తమాన రాజ కీయ పరిస్థితుల్లో అలాంటి పరిణామాన్ని ఆశించడం కష్టమే.
గవర్నర్ల ‘తిరుగుబాటు’
Published Thu, Jun 19 2014 12:15 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement