కుంభకోణం ముసురుకున్న అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందం ఎట్టకేలకు రద్దయింది. ఈ ఒప్పందంలో రూ.362 కోట్లు చేతులు మారాయని దాదాపు రెండేళ్ల క్రితమే ఇటలీ మీడియా వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. అయినా ఒప్పందం రద్దు చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఇంత సమయం తీసుకున్నది. మొదటగా స్కాం బయటపడినప్పుడు ఇక్కడ చడీ చప్పుడూ లేదు. అందుకు భిన్నంగా ఇటలీ ప్రభుత్వం వెనువెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. చివరకు నిరుడు ఫిబ్రవరిలో హెలికాప్టర్ల సంస్థ ఫిన్‌మెకానికా సంస్థ చైర్మన్ గిసెప్పీ ఓర్సీని, ఆ సంస్థ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని అరెస్టుచేశాక మన ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా జరిగిన ఈ పరిణామంతో అప్రమత్తమై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు... ఒప్పందాన్ని తాత్కాలికంగా స్తంభింపజేస్తున్నామనీ, సీబీఐ దర్యాప్తు పూర్తయిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పార్లమెంటులో ఎంతో రభస జరిగితే తప్ప, కనీసం ఒకటి రెండు రోజులు అది వాయిదాల్లో గడిచిపోతే తప్ప స్పందించని సర్కారు తనంత తానుగానే, ఎవరూ కోరకుండానే అగస్టా స్కాంపై చురుగ్గా స్పందించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికింకా దర్యాప్తు పూర్తికాకపోయినా గత కొన్ని నెలలుగా సాగుతున్న పరిణామాలు ఒప్పందం రద్దుకు దోహదపడ్డాయి. వాస్తవానికి ఈ కేసులో సీబీఐ ఇంకా ఎలాంటి అరెస్టులూ చేయలేదు. కోర్టుకు చార్జిషీటు కూడా సమర్పించలేదు. ఈ స్కాంలో వైమానిక దళ ప్రధానాధికారి ఎస్‌పీ త్యాగి పాత్ర ఉన్నదని ఆరోపణలు రావడం, ఆయన సన్నిహిత బంధువులిద్దరికి దీనితో నేరుగా సంబంధం ఉన్నదని కథనాలు వెలువడటం సంచలనం కలిగించింది.
రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యంత ప్రముఖులు వినియోగించడానికి ఉద్దేశించిన ఈ హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియ ఆద్యంతమూ అనుమానాలను రేకెత్తించేదిగానే ఉంది. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగింది. కాగ్ నివేదిక వీటన్నిటినీ ఏకరువుపెట్టింది. రూ.793 కోట్లతో డజను హెలికాప్టర్లను కొనాలని తొలుత నిర్ణయించగా, ఒప్పంద సంప్రదింపుల కమిటీ దాన్ని రూ.4,877 కోట్లకు పెంచడాన్ని ఎత్తిచూపింది. చివరకు అగస్టా సంస్థ వాటిని తాము రూ. 3,966 కోట్లకే ఇస్తామని చెప్పడాన్ని ప్రస్తావించింది. ఒప్పందం కుదిరే సమయానికి అది రూ.3,660 కోట్లు కావడంలో నాటకీయత దాగుంది. రూ. 4,877 కోట్ల వ్యయం అనుకున్నది కాస్తా ఒక్కసారిగా రూ.1,200 కోట్లు తగ్గిపోవడంవల్ల ఎవరి అనుమానపు దృక్కులూ తమపై పడవని దళారులు భావించి ఉంటారు. ఈ ముసుగులో సరిగ్గా అగస్టాకు సరిపడేలా నిబంధనలు మార్చారు. తొలుత 19,685 అడుగుల ఎత్తు ఎగిరేలా ఉన్న నిబంధనలు కాస్తా 15,000 అడుగులకు దిగొచ్చాయి. ఇక సామర్ధ్య పరీక్షల విషయంలో కూడా అగస్టాకు ఎక్కడలేని వెసులుబాటూ ఇచ్చారు. ఒకపక్క అగస్టాతో పోటీపడ్డ అమెరికా సంస్థ సికోర్‌స్కీ తమ హెలికాప్టర్ల విషయంలో అవసరమైన సామర్ధ్య పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని చెప్పగా అగస్టా మాత్రం తమదింకా అభివృద్ధి దశలోనే ఉన్నదంటూ నాన్చింది. చివరకు ఆ సంస్థ అప్పటికే ఉత్పత్తి చేస్తున్న మరో హెలికాప్టర్ పనితీరును చూసి అభివృద్ధి దశలో ఉన్న హెలికాప్టర్‌కు అంగీకారం తెలిపారన్నది కాగ్ అభియోగం. పైగా, ఆ హెలికాప్టర్ మన వాతావరణంలో ఎలా పనిచేస్తున్నదో చూడాలన్న ఆలోచన తట్టలేదు. వీవీఐపీల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్ కొనుగోలులో కూడా ఇంత అజాగ్రత్తను ప్రదర్శించడం వింత గొలుపుతుంది.
పోటీలో ఇద్దరున్నప్పుడు ఇద్దరికీ సమాన స్థాయిలో నిబంధనలు విధించి, సామర్థ్యాన్ని పరీక్షించవలసి ఉండగా ఒకరి విషయంలో ఇంతటి విశాల దృక్పథం కనబరచడం ఎన్నో అనుమానాలను రేకెత్తించి ఉండాల్సింది. రక్షణమంత్రిగా సచ్చీలుడుగా పేరున్న ఏకే ఆంటోనీ ఉండగానే ఇది ఇలా సాగిపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. రక్షణ కొనుగోళ్లలో స్కాంలు జరగడానికి వీల్లేదన్న దృఢ సంకల్పంతోనే నిజాయితీపరుడిగా పేరున్న ఆంటోనీకి ఆ పదవిని అప్పగించామని కాంగ్రెస్ పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ, ఆచరణకొచ్చేసరికి దళారుల రాజ్యమే సాగిందని అర్ధమవుతుంది. వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆరితేరిన దళారులు ఆంటోనీని మాయ చేయడంలో విజయం సాధించారనుకున్నా... ఇటలీలో స్కాం సంగతి వెల్లడైన పది నెలలకుగానీ ఇక్కడ కదలిక లేదేమన్న అనుమానం తలెత్తుతుంది. ఆ సంస్థ చైర్మన్, సీఈఓలు అరెస్టయ్యేవరకూ ప్రభుత్వం చర్యలకు ఎందుకు దిగలేదని అడిగితే ఈ కాలమంతా తాము స్కాం ఆనుపానులు తెలుసుకోవడానికి ప్రయత్నించామని ఆంటోనీ చెప్పారు. సమస్త యంత్రాంగమూ అందుబాటులో ఉన్న ప్రభుత్వం అందుకు పది నెలల వ్యవధి తీసుకోవడం ఆశ్చర్యకరమే. ఇలాంటి అంశాలను సీబీఐ ఎంతవరకూ పరిగణనలోకి తీసుకున్నదో తెలియదు. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే మూడు హెలికాప్టర్లు మన వైమానిక దళానికి చేరాయి. ఒప్పందాన్ని స్తంభింపజేసినట్టు మన దేశం ప్రకటించడంతో తాము మధ్యవర్తిత్వానికి వెళ్తున్నట్టు ఫిన్‌మెకానికా గత అక్టోబర్‌లో తెలిపింది. తదుపరి చర్యగా మన ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. ఈ చర్యవల్ల ఇటలీ సంస్థకు నష్టపరిహారం చెల్లించవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అంటే దళారులు భోంచేసిన రూ.360 కోట్లకు ఇది అదనమన్నమాట. అసలు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో పాటిస్తున్న గోప్యత ఇలాంటి స్కాంలకు ఆస్కారమిస్తున్నది. 2 జీ స్కాం మొదలుకొని నిన్నమొన్నటి బొగ్గు స్కాం వరకూ పారదర్శకత లేమివల్లే సమస్యలు తలెత్తుతున్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ, యూపీఏ సర్కారు ఆ దిశగా దృష్టిపెట్టడంలేదు. అందువల్లే ప్రతిచోటా స్కాంలు ప్రత్యక్షమవుతున్నాయి.ఇకనైనా ఒప్పంద ప్రక్రియలో లొసుగులకు ఆస్కారమీయని విధానాన్ని రూపొందించాలి. అప్పుడు మాత్రమే పరిస్థితి చక్కబడుతుంది.
అగస్టా చెప్పే గుణపాఠం!
Published Wed, Jan 1 2014 11:41 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement