నమ్మకం, విశ్వాసం వంటివి నేరమేమీ కాదు. కానీ అవి హద్దు దాటినప్పుడు, సమాజం సజావుగా సాగడానికి ఆటంకంగా మారినప్పుడు సమస్యలెదురవుతాయి. మన పాలకులు ఈ తేడాను గమనించకుండా వ్యవహరిస్తున్న తీరువల్ల ఆ సమస్యలు తలెత్తడమే కాదు...ముదిరి పాకాన పడుతున్నాయి. హర్యానాలోని హిస్సార్ జిల్లా బర్వాలాలో మంగళవారం జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని మరోసారి ధ్రువపరిచాయి. బర్వాలాలో ఆశ్రమం నిర్మించుకుని వందలాదిమంది భక్తులను అనుచరులుగా చేసుకున్న ఆథ్యాత్మిక గురువు బాబా రాంపాల్ కోర్టు ధిక్కార కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలను పాటించకపోవడం ఈ వివాదానికి మూలం. ఆయనను సోమవారంనాటికల్లా తమ ముందు హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశం అమలుకాకపోవడం, ఆ విషయంలో న్యాయమూర్తులు పోలీసులను తీవ్రంగా మందలించి మంగళవారం సాయంకాలానికల్లా హాజరుపరిచి తీరాలని గడువు విధించడం వంటి పరిణామాలతో బర్వాలా రణరంగమైంది.
రాంపాల్‌ను అరెస్టు చేయడానికొచ్చిన పోలీసులపై భక్తుల ముసుగులో ఉన్నవారు రాళ్లతో, యాసిడ్ సీసాలతో దాడికి దిగడమే కాదు...చివరకు కాల్పులకు కూడా తెగించారు. రెండువైపులా వందమందికిపైగా గాయపడ్డాక ఆశ్రమంలోకి వెళ్లి చూసిన పోలీసులకు రాంపాల్ ఆచూకీయే దొరకలేదు! గత పక్షం రోజులుగా పోలీసులకు లొంగిపోవాలని, న్యాయస్థానాన్ని గౌరవించాలని వివిధ రాజకీయ పక్షాలు ఆయనకు విన్నవించుకుంటున్నాయి. మధ్యవర్తిత్వాన్ని నెరపడానికి ప్రయత్నించాయి. ఆయన ఇప్పటికే తాను అన్నిటికీ అతీతుడననుకున్నాడు గనుక వీటినేమీ లెక్కచేయలేదు.
గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తీసుకురావడం మన పాలకులకు అలవాటయిపోయింది. బర్వాలాలో కూడా జరిగింది అదే. రాంపాల్‌పై కేసు ఈనాటిది కాదు, ఆయన చట్ట ధిక్కారమూ కొత్త కాదు. రోహ్తక్‌లో 2006లో ఆర్యసమాజ్‌కు చెందినవారితో ఆయన భక్తులు తగువుపడి ఒకరిని కాల్చిచంపి, అనేకమందిని గాయపరిచిన ఘటనలో రాంపాల్ నిందితుడు. ఆ కేసులో మరో రెండేళ్ల తర్వాత రాంపాల్‌కు బెయిల్ లభించింది. ఆ కేసుపై 2010లో విచారణ ప్రారంభమైనప్పటినుంచీ ఇంతవరకూ ఆయన కోర్టుకు హాజరుకావడంలేదు. ఇలా మొత్తం 40సార్లు ఆయన గైర్హాజరయ్యాడు. న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఆదేశాలివ్వడం తప్ప వాటిని అమలుచేసే నాథుడే ఉండటం లేదు. ఎప్పటికప్పుడు ఆయనకు ఒంట్లో బాగులేదని పోలీసులు జవాబిస్తుంటే న్యాయస్థానాలు నిస్సహాయంగా ఉండిపోయాయి. మత పెద్దలుగా, ఆథ్యాత్మికవేత్తలుగా చెప్పుకునే వారిపై ఆరోపణలొచ్చినప్పుడు నిజానికి కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వాలు తమకై తాము కదిలి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. మత విశ్వాసాలు, కులాభిమానాలు మనిషి ఔన్నత్యానికి, మంచి పనులకూ ఉపయోగపడే వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమస్యల్లా అవి అప్పుడప్పుడు హద్దు మీరుతున్నాయి. ఇందిరాగాంధీ పాలనా కాలంలో పంజాబ్‌లో అకాలీదళ్‌లో చీలిక తెచ్చేందుకు చేసిన యత్నాలు చేతులు దాటిపోయి ఉగ్రవాదానికి ఎలా అంకురార్పణ చేశాయో, పర్యవసానంగా దశాబ్దం పాటు ఎంత నెత్తురు పారిందో అందరూ చూశారు. ఇలాంటి అనుభవాలనుంచి మన రాజకీయ పార్టీలుగానీ, ప్రభుత్వాలుగానీ ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు.
రాంపాల్‌పై ఎనిమిదేళ్లుగా ఉన్న కేసులు ప్రభుత్వాలకు, పాలకులకు పట్టలేదు. ఆయన అవిచ్ఛిన్నంగా చట్టాన్ని ధిక్కరిస్తున్నా, న్యాయస్థానాలను బేఖాతరు చేస్తున్నా పట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా ఈ విషయంలో ఒకేలా వ్యవహరించాయి. ఆఖరికి రాష్ట్ర హైకోర్టు ఆయన అరెస్టుకు ఆదేశాలిస్తే...దాన్ని వమ్ముచేయడం కోసం ఆయన వేలాది మందిని సమీకరిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. రాంపాల్ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే అది తమకు లాభిస్తుందని చూశారు తప్ప చట్టబద్ధమైన పాలనను నెలకొల్పాలన్న మౌలిక సూత్రాన్ని పాలకులు మరిచిపోయారు. చిత్రమేమంటే పరిస్థితిని ఇంతవరకూ తెచ్చిన పోలీసు యంత్రాంగం ప్రసారమాధ్యమాలపై విరుచుకుపడింది. తమకిచ్చిన పరిమితులకు లోబడి పనిచేస్తున్న పాత్రికేయులపై అకారణంగా విరుచుకుపడింది. రాంపాల్ విషయంలో హర్యానాలో చాలామందికి అభ్యంతరాలున్నాయి.
ఆయన ఘర్షణ పడిన ఆర్యసమాజ్ కూడా హిందూ మత విశ్వాసాలకు దగ్గరగా ఉండేదే. 1869లో స్వామీ దయానంద సరస్వతి నెలకొల్పిన ఆ సంస్థ వేదాల ఆధిపత్యాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. మతంలో సంస్కరణలను కోరుకుంటుంది. తమ సంస్థ విషయంలో రాంపాల్ దూకుడుగా వ్యవహరించినా గత కాంగ్రెస్ సర్కారు కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణం ఆయన జాట్ కులస్తుడు కావడమేనని ఆర్యసమాజీకులు అంటారు. ఆ రాష్ట్రంలో ఖాప్ పంచాయతీలు గత కొన్నేళ్లుగా గ్రామాల్లో సృష్టిస్తున్న అరాచకాలను అరికట్టలేక పోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ స్థాయిల్లో చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థలుండగా వాటికి సమాంతరంగా ఇలాంటి ప్రైవేటు సంస్థలు తయారుకావడమూ, స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు వాటికి వంత పాడటమూ రాను రాను ఎక్కువవుతున్నది. తమ పదోన్నతులకైనా, బదిలీలకైనా ఇలాంటి సంస్థలకు గురువులుగా ఉంటున్న వారు ఉపయోగపడుతున్నారు గనుక ఉన్నతాధికారగణం కూడా వారి ముందు సాగిలపడుతున్నది. ఇలాంటి ధోరణికి ఎక్కడో అక్కడ అడ్డుక ట్ట వేయకపోతే మొత్తం చట్టబద్ధపాలనే కుప్పకూలే స్థితి ఏర్పడుతుందని బర్వాలా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ఇది పాలకుల పాపం!
Published Wed, Nov 19 2014 12:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement