చెప్పే మాటలకూ, చేసే చేష్టలకూ పొంతన లేనప్పుడు ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నవారినైనా సమాజం సహించదు. తీర్పరి స్థానంలో ఉన్నవారు తుంటరులని తేలితే ఊరుకోదు. కనుకనే తెహెల్కా పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ ప్రజలముందు దోషిగా నిలబడవలసివచ్చింది. ఒకప్పుడు రాజకీయ నాయకుల అవినీతిని, వారిలో కొందరి హంతకస్వభావాన్ని ‘స్టింగ్ ఆపరేషన్’లద్వారా బయటపెట్టి పెనుసంచలనం కలిగించిన పాత్రికేయుడు తరుణ్ తేజ్‌పాల్. ప్రగతిశీల భావాలున్న వ్యక్తిగా పేరున్నవాడు. కానీ, నైతిక విలువలకు సంబంధించి తనకు వేరే ప్రమాణాలున్నాయని తన ప్రవర్తనతో ఆయన నిరూపించాడు. పక్షం రోజుల క్రితం తెహెల్కా ఆధ్వర్యంలో గోవాలో జరిగిన ‘థింక్‌ఫెస్ట్’ సమయంలో తనపై ఆయన లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆ పత్రికలో పనిచేసే మహిళా జర్నలిస్టు ఆరోపించారు.
ఈ విషయమై ఆ యువతి పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురికి ఫిర్యాదుచేశాక తన ప్రవర్తన ‘దురదృష్టకరమైనద’ని, అందుకు ప్రాయశ్చిత్తంగా ఆరునెలలపాటు పత్రికలో తనకున్న పదవినుంచి తప్పుకుంటున్నానని తరుణ్ ప్రకటించారు. బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. బహుశా ఆమె ధైర్యంగా ముందుకు రానట్టయితే ఆ ‘పశ్చాత్తాప’ ప్రకటనతో, ఆ బేషరతు క్షమాపణతో అంతా ముగిసి పోయేదేమో! ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నిత్యం కొనసాగే వేధింపుల జాబితాలో చేరిపోయేదేమో! కానీ, ఆమె అందరిలాంటి యువతి కాదు...జరిగిన ఘటనను కేవలం ‘పరిస్థితులను సరిగా బేరీజు వేసుకోలేని స్థితి’లో ఉన్న వ్యక్తి వల్ల సంభవించిన దురదృష్టకర ఘటనగా ఆమె భావించలేదు. సదస్సు సందర్భంగా బసచేసిన హోటల్‌లో తనను లిఫ్ట్‌లోకి నెట్టడమేకాక... ప్రతిఘటించినందుకు లిఫ్టును మధ్యలోనే కాసేపు నిలిచిపోయేలా చేశారని, మరుసటిరోజునా ఈ తంతు కొనసాగిందని ఆమె చెప్పారు. తరుణ్ తేజ్‌పాల్ క్షమాపణతో తాను సంతృప్తిచెందానన్న షోమా చౌధురి వాదనను తోసిపుచ్చారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన వ్యక్తి ఆ పదవిలో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని మహిళా న్యాయవాది ఒకరు తెహెల్కా ఘటనకు కొద్ది రోజులముందే వెల్లడించారు.
ఆయనవద్ద తనకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని అటుతర్వాత మరో మహిళా న్యాయవాది చెప్పారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమనదగ్గ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి పదవిలో ఉంటూ ఆయన ప్రవర్తించిన తీరుపై చర్చ జరుగుతున్నప్పుడే తేజ్‌పాల్ వ్యవహారం వెల్లడైంది. వీరిలో ఒకరు న్యాయమూర్తి స్థానంలో ఉండగా, రెండోవారు అలాంటి పనినే మీడియా ద్వారా చేస్తున్న వ్యక్తి. స్త్రీ-పురుష సమానత్వం విషయంలో భారత్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని ఈమధ్యే ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) నివేదిక వెల్లడించింది. సమానత్వం విషయంలో అఫ్ఘానిస్థాన్ మినహా మన సమీప దేశాలన్నిటితో పోల్చినా మనం చాలా వెనకబడి ఉన్నామని ఆ నివేదిక హెచ్చరించింది. విద్య, ఆరోగ్యం, ఆదాయం వంటి అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు ఇక్కడ ఎంతగానో వెనకబడి ఉన్నారని నివేదిక చెబుతోంది. జాబితాలో మన స్థానం 132 కాగా... శ్రీలంక నుంచి పాకిస్థాన్ వరకూ ఇంతకన్నా మెరుగైన స్థానాల్లో ఉండి మనల్ని వెక్కిరిస్తున్నాయి. ఆడపిల్లకు అమ్మ కడుపులో ఉన్నప్పటినుంచి మొదలయ్యే వివక్ష ఎదిగేకొద్దీ రకరకాల రూపాల్లో తారసపడుతోంది. నిత్యం వెల్లడవుతున్న అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలు ఈ వివక్ష వికృతరూపం తీసుకుంటున్న వైనాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ దుస్థితిని చక్కదిద్దడానికి అటు న్యాయవ్యవస్థ, ఇటు మీడియా చేయాల్సింది ఎంతో ఉంది. ఆ పని సాగుతున్నది కూడా. కానీ, అందులో భాగంగా ఉండేవారే ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే పర్యవసానాలు ఏమిటన్న ఆందోళన కలుగుతుంది.
నిరుడు డిసెంబర్‌లో నిర్భయ ఉదంతం జరిగాక దేశవ్యాప్తంగా సాగిన ఆందోళనలు, అనంతరం అమల్లోకి వచ్చిన నిర్భయ చట్టం మహిళల్లో ఎంతగానో చైతన్యాన్ని కలిగించాయి. కనుకనే మొన్న మహిళా న్యాయవాదులైనా, ఇప్పుడు మహిళా జర్నలిస్టు అయినా ధైర్యాన్ని ప్రదర్శించగలిగారు. అయితే, షోమా చౌధురి స్పందనే పేలవంగా ఉంది. ఆమె సుప్రసిద్ధ పాత్రికేయురాలు. స్వయంగా స్త్రీవాద భావాలు కలిగిన వ్యక్తి. కానీ, ఈ ఘటనను సంస్థ అంతర్గత వ్యవహారంగా చూపడానికి ఆమె మొదట చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేర పూరిత చర్యల్లో బాధితురాలు క్షమించినంత మాత్రాన జరిగిన నేరం సమసి పోదన్న ప్రాథమిక అంశాన్ని ఆమె పరిగణనలోకి తీసుకోలేదు.
గత వారం రోజులుగా బీజేపీ ఈ తరహా వాదననే వినిపించింది. గుజరాత్‌లో ఒక యువతిపై చట్టవిరుద్ధంగా పోలీసు బలగాలతో నిఘా పెట్టి, వెన్నాడారని వెల్లడైనప్పుడు ఆమె తండ్రే అలా చేయమన్నాడని చెప్పి చేతులు దులుపుకునేందుకు చూసింది. ఇప్పుడు బీజేపీ వాదనకూ, షోమా చెప్పినదానికీ తేడా ఏముంది? మహిళను గౌరవిస్తున్నామని, ఆరాధిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా వారిని న్యూనత పరచడం, వారి శక్తిసామర్ధ్యాలను తక్కువచేసి చూడటమనే అధమ సంస్కృతి సమాజంలోని అన్ని పొరల్లోనూ అలుముకుంది. కనబడే వివక్షనూ, హింసనూ ఎదుర్కోవడం ఒక ఎత్తయితే, ప్రచ్ఛన్నంగా అల్లుకుపోయిన ఇలాంటి ధోరణులను రూపుమాపడం మరో ఎత్తు. ఇందుకు కృషి చేయాల్సినవారే ఆ ధోరణులకు బానిసలు కావడం, రక్షకులే రాకాసుల్లా మారడం మన దేశంలో నెలకొన్న దురదృష్టకరమైన స్థితి. తెహెల్కా ఘటన తర్వాతనైనా అందరూ మేల్కొనాలి. పనిచేసే స్థలాల్లో మహిళలను మనుషులుగా గుర్తించే సంస్కృతిని, వారు ఆత్మగౌరవంతో మసిలే పరిస్థితులను కల్పించాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.