భూమిపై మొదట్లో వాతావరణం ఉండేది కాదా?
ఇప్పటికి సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం మన భూగోళం రూపొందిందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. భూమిపై మొదట్లో వాతావరణం ఉండేది కాదని, అది ఆవిర్భవించాక సుమారు 250 కోట్ల ఏళ్ల తర్వాత కానీ దానిపై వాతావరణం ఏర్పడలేదని చెబుతున్నారు. భూమి రూపొందినప్పుడు మొదట్లో అది కరిగిన రూపంలో వేడి శిలాద్రవంతో నిండి ఉండేది. ఆ తర్వాత భూగోళం క్రమేణా చల్లబడుతూ, దాని లోపలి భాగంలో తప్పించి పైభాగంలో ఉండే భాగమంతా చల్లబడి గట్టిపడింది.
అయితే లోపలి భాగం చాలా వేడి ద్రవంతో నిండి ఉన్నందువల్ల, దాని నుంచి వేడి వాయువులు నిరంతరం పై పొరలను చీల్చుకుని బయటకు ఎగజిమ్మేవి. ఈ వాయువుల్లో మిథేన్, కార్బన్‌డైఆక్సైడ్, నీటి ఆవిరి, అమ్మోనియా వంటి పదార్థాలు పెద్ద మొత్తంలో ఉండేవి. ఇవి క్రమంగా చల్లబడి ద్రవ స్థితిలోకి మారేవి. వాటిలోని నీటి ఆవిరి చల్లబడి నీరుగా మారడంతో క్రమంగా మహా సముద్రాలు అవతరించాయి.
ఇలా ఏర్పడిన భూ వాతావరణంలో మొదట్లో ఆక్సిజన్, నత్రజని ఉండేవి కాదు. బ్లూ- గ్రీన్ ఆల్గే అనే మొట్టమొదటి జీవరాశి బాగా అభివృద్ధి చెందాక మాత్రమే వాతావరణంలో ఆ వాయువుల ఉనికి మొదలైంది. ఈ జీవులు కిరణజన్య సంయోగక్రియలో భాగంగా వాతావరణంలోని కార్బన్‌డై ఆక్సైడ్‌ని ఉపయోగించుకుంటూ ఆ ప్రక్రియలో భాగంగా ఆక్సిజన్‌ను గాల్లోకి వదిలిపెట్టేవి. అలా క్రమేణా కొన్ని కోట్ల ఏళ్లకు భూగోళంపై వాతావరణం జీవులకు అనుకూలంగా మారింది.