వాంఛూ కమిటీని దేనికోసం నియమించారు? | for what reason wanchoo committee appointed ? | Sakshi
Sakshi News home page

వాంఛూ కమిటీని దేనికోసం నియమించారు?

Published Mon, Sep 1 2014 10:14 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

for what  reason wanchoo committee appointed ?

భాషాప్రయుక్త రాష్ట్రాలు
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ

 
 స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశంలో  రెండు రకాల ప్రాంతాలు ఉండేవి.
 1.    నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాలు.
 2.    బ్రిటిష్ సార్వభౌమాధికారం కింద పనిచేసే సంస్థానాలు (స్వదేశీ సంస్థానాలు).
 
నాడు దేశంలో 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. బ్రిటిషర్లు ప్రకటించిన ఒప్పందం ప్రకారం 549 స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ సంస్థానాలు విలీనాన్ని వ్యతిరేకించాయి. తర్వాతి కాలంలో  విలీన ఒప్పందం ద్వారా కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమైంది. ప్రజాభిప్రాయం మేరకు జునాగఢ్  భారత్‌లో కలిసిపోయింది. ఈ విధంగా భారత్‌లో కలిసిన మొదటి, చివరి సంస్థానం ఇదే.
 
హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న సైనిక/ పోలీస్ చర్య (ఆపరేషన్ పోలో) ద్వారా విలీనం చేశారు. 1950 నాటికి రాజ్యాంగం ప్రకారం నాలుగు రకాలైన రాష్ట్రాలు అమల్లో ఉండేవి. వీటిని ఎ, బి, సి, డి పార్టులుగా వర్గీకరించారు. పార్‌‌ట-ఎలో బ్రిటిష్ పాలిత గవర్నర్ ప్రావిన్‌‌సలు ఉండేవి. వీటి సంఖ్య 9. బిలో శాసనసభ కలిగిన స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వీటి సంఖ్య 9.  పార్‌‌ట-సిలో చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఉండేవి. వీటి సంఖ్య 10. పార్‌‌ట-డిలో అండమాన్ నికోబార్ దీవులు ఉండేవి.
 
భాషా ప్రయుక్త రాష్ట్రాలు - చరిత్ర
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్య్రోద్యమ కాలం నుంచే ఉంది. మొదటిసారిగా ఈ డిమాండ్  చేసింది తెలుగువారే. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ర్టం ఒరిస్సా.
 
1913లో బాపట్లలో జరిగిన ఆంధ్రమహా సభ ప్రత్యేకాంధ్ర రాష్ర్ట ఏర్పాటు కోసం డిమాండ్ చేసింది.
     
1927లో కాంగ్రెస్ సమావేశం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ తీర్మానం చేసింది.
     
1931లో నిర్వహించిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరైన సందర్భంగా ప్రత్యేక ఆంధ్రరాష్ర్ట డిమాండ్‌ను చర్చించాలని భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు.
 
1937లో రాయలసీమ - ఆంధ్ర నాయకుల మధ్య కాశీనాథుని నాగేశ్వరరావు నివాసంలో ఒక ఒప్పందం కుదిరింది. కాశీనాథుని నివాసం పేరు శ్రీబాగ్. అందువల్ల దీన్ని ‘శ్రీబాగ్ ఒప్పందం’ అంటారు. స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భంలో మద్రాసు, ఆంధ్ర నాయకుల మధ్య తలెత్తిన వివాదాలు ప్రత్యేక ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటుకు బలమైన కారణాలుగా చెప్పవచ్చు.
 
థార్ కమిషన్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకు రాజ్యాంగ పరిషత్తు 1948 లో ఉత్తరప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.కె. థార్ నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో  (పన్నాలాల్, జగత్ నారాయణ్‌లాల్) కమిషన్‌ను నియమించింది. కేవలం భాషా ప్రాతిపదికపైన రాష్ట్రాలు ఏర్పాటు చేయడాన్ని ఈ కమిషన్ తిరస్కరించింది. పరిపాలన సౌలభ్యం ప్రాతిపదికపైనే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
 
జేవీపీ కమిటీ: థార్ కమిషన్  నివేదికకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనను విరమింప చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1948 డిసెంబర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఒక కమిటీ నియమించింది. ఇది కూడా దేశం మొత్తం మీద రాష్ట్రాల పునర్ నిర్మాణాన్ని వాయిదా వేయాలని, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని నివేదించింది. 1952 ఆగస్టు 15 నుంచి 35 రోజుల పాటు గొల్లపూడి సీతారామయ్యశాస్త్రి ప్రత్యేక ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 35 రోజుల తర్వాత ఆచార్య వినోబాభావే నిరాహార దీక్షను విరమింప చేశారు.
 
1952 అక్టోబర్ 19 నుంచి మద్రాసులో బులుసు సాంబమూర్తి గృహంలో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్రరాష్ర్ట ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష 50 రోజులు చేరుకున్న సందర్భంలో మద్రాసును సందర్శించిన జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్రరాష్ర్ట ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ, పొట్టి శ్రీరాములు తన దీక్షను కొనసాగించారు. 58వ రోజున డిసెంబర్ 15న  అమరుడయ్యారు. 1952 డిసెంబర్ 19న పార్లమెంటులో నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటును ప్రకటించారు.
 
వాంఛూ కమిటీ: ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటు విధి విధానాలను రూపొందించడానికి రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కైలాసనాథ్ వాంఛూ నాయకత్వంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ సూచన మేరకు ఆంధ్ర, రాయలసీమలోని 11 జిల్లాలతో కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ర్టం  ఏర్పాటైంది. ఎస్.ఎన్.మిశ్రా కమిటీ సూచనల మేరకు బళ్లారిని ప్రస్తుత కర్ణాటక రాష్ర్టంలో విలీనం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధానిని, ఆంధ్రలో హైకోర్టు  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టంగుటూరి ప్రకాశం సూచన ప్రకారం కర్నూలులో రాజధానిని, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు.
 
ఆంధ్రరాష్ర్టంలో..
మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం
మొదటి ఉపముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి
మొదటి గవర్నర్ -    సి.ఎమ్. త్రివేది
 హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ కోకా సుబ్బారావు
 చివరి ముఖ్యమంత్రి -బెజవాడ గోపాలరెడ్డి
 
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ  ఫజల్ అలీ కమిషన్
భాషా ప్రయుక్త ప్రాతిపదికపై ఆంధ్రరాష్ర్టం ఏర్పాటు కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ డిమాండ్ ఊపందుకుంది. దీంతో  కేంద్ర ప్రభుత్వం ఫజల్ అలీ నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో (కె.ఎం. ఫణిక్కర్, హెచ్.ఎం. కుంజ్రు) రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్‌ఆర్‌సీ)ను నియమించింది. ఈ కమిషన్ 1955 సెప్టెంబర్‌లో నివేదికను సమర్పించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సమర్థించే ‘ఒక భాష ఒక రాష్ర్టం’  డిమాండ్‌ను తిరస్కరించింది.
 
కమిషన్ చేసిన ప్రతిపాదనలు:  
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో దేశ ఐక్యతను, రక్షణను బలోపేతం చేసే చర్యలుండాలి.
భాషా, సాంస్కృతికపరమైన సజాతీయత ఉండాలి.
ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
జాతీయ అభివృద్ధితోపాటు రాష్ట్రాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

దీనికనుగుణంగా 1956లో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా  పార్లమెంటు రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం  చేసింది. అంతకుముందు ఉన్న ఎ, బి,సి పార్‌‌టల వ్యత్యాసాలను రద్దు చేసి రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించింది. ఫలితంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలతో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
 
ఆంధ్రప్రదేశ్ - అవతరణ
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రరాష్ర్టంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి  ఆంధ్రప్రదేశ్‌ను 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు. 1948లో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర సంస్థను స్థాపించారు. తెలుగుభాష మాట్లాడేవారందరినీ కలిపి ఒకే రాష్ర్టంగా ఏర్పాటు చేయాలన్నది విశాలాంధ్ర సంస్థ ప్రధా న నినాదం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయాన్ని హైదరాబాద్ రాష్ర్ట శాసనసభ అభిప్రాయానికి వదిలేశారు. శాసనసభ విశాలాంధ్రప్రదేశ్  ఏర్పాటు కోసం 103  మంది సభ్యులతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన  ఎనిమిది మంది నాయకులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీన్నే ‘పెద్దమనుషుల ఒప్పందం’ అంటారు.
 
1956  తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు
గుజరాత్ (1960): బొంబాయి రాష్ట్రాన్ని విడగొట్టి గుజరాత్‌ను 15వ  రాష్ర్టంగా ఏర్పాటు   చేశారు. బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ర్టగా పేరు మార్చారు.
 
నాగాలాండ్ (1963): అస్సాం రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి నాగా కొండ ప్రాంతాలు, ట్యూన్‌సాంగ్ ప్రాంతాలను కలిపి 16వ రాష్ర్టంగా నాగాలాండ్‌ను ఏర్పాటు చేశారు.
 
హర్యానా (1966): పంజాబ్ రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించి హిందీ మాట్లాడే ప్రాంతాన్ని 17వ రాష్ర్టంగా హర్యానాను  ఏర్పాటు చేశారు. ‘షా’ కమిషన్ సూచన మేరకు చండీఘర్‌ను ఉమ్మడి రాష్ర్ట రాజధానిగా చేసి, దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు.
 
హిమాచల్ ప్రదేశ్ (1971): పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలతో కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్‌కు రాష్ర్ట హోదాను కల్పిస్తూ 18వ రాష్ర్టంగా ఏర్పాటు చేశారు.
 
మణిపూర్ (1972): ఈశాన్య రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన మణిపూర్‌ను 19వ రాష్ర్టంగా  ఏర్పాటు చేశారు.
 
త్రిపుర (1972): కేంద్రపాలిత ప్రాంతమైన త్రిపురను 20వ రాష్ర్టంగా మార్చారు.
మేఘాలయ (1972): అస్సాంలో ఉపరాష్ర్టంగా ఉన్న మేఘాలయను 21వ రాష్ర్టంగా మార్చారు. 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా మేఘాలయకు ఉపరాష్ర్ట హోదాను కల్పించారు.
 
సిక్కిం (1975): 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను 22వ రాష్ర్టంగా ఏర్పాటు చేశారు. సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1947 వరకు ఛోగ్యాల్ అనే రాజరిక పాలన ఉండేది. బ్రిటిష్ పాలన అంతమయ్యాక ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఒక రక్షిత ప్రాంతంగా పరిపాలించారు. 1974లో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు అసోసియేట్ రాష్ర్ట ప్రతిపత్తిని కల్పిస్తూ కొత్త ప్రకరణ 2ఎను 10వ షెడ్యూల్‌లో చేర్చారు.
 
తిరిగి 1975 లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను సంపూర్ణ రాష్ర్టంగా గుర్తించారు. 1974లో చేసిన 35వ రాజ్యాంగ సవరణను రద్దు  చేసి, ప్రకరణ 2ఎను, 10వ షెడ్యూల్‌లోని ప్రత్యేకతను తొలగించారు. ప్రకరణ 371ఎఫ్ ద్వారా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రక్షణ కల్పించారు.
 
మిజోరాం (1987): కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరాంను 53వ రాజ్యాంగ సవరణ ద్వారా  23వ   రాష్ర్టంగా ఏర్పాటు చేశారు.
 
అరుణాచల్ ప్రదేశ్ (1987): కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌ను 55వ రాజ్యాంగ సవరణ  ద్వారా  24వ రాష్ర్టంగా  ఏర్పాటు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను నార్‌‌త ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (NEFA)అని  పిలిచేవారు.
 
గోవా (1987): 56వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన గోవాను 25వ రాష్ర్టంగా ఏర్పాటు చేశారు. పోర్చుగీసువారు 1961లో గోవాను భారతదేశానికి అప్పగించారు. గోవా, డయ్యూ, డామన్‌లను కలిపి   1962లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా  కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు  చేశారు.
 
1954లో ఫ్రెంచివారు పాండిచ్చేరిని అప్పగించారు. 1962లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిలో నాలుగు జిల్లాలను కలిపి (పాండిచ్చేరి, కరైకల్, మాహే, యానాం) కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
 
ఛత్తీస్‌గఢ్ : మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి ఛత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ర్టంగా 2000 నవంబర్ 1న ఏర్పాటు  చేశారు.
 
ఉత్తరాఖండ్: ఉత్తరప్రదేశ్‌ను పునర్‌వ్యవస్థీకరించి ఉత్తరాఖండ్‌ను 2000 నవంబర్ 9న 27వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 
జార్ఖండ్ : బీహార్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి జార్ఖండ్‌ను 2000 నవంబర్ 15న 28వ రాష్ర్టంగా ఏర్పాటు చేశారు.
 
తెలంగాణ (2014): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించి 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement