సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు ఎలా? | How to get more marks in Civils prelims of History part? | Sakshi
Sakshi News home page

సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులుఎలా?

Published Fri, Jul 25 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

How to get more marks in Civils prelims of History part?

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ప్రశ్న: సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి సారించాలి?     
 - ఎస్.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.ఆర్.నగర్   
 
సివిల్స్ ప్రిలిమ్స్ చరిత్రలో ప్రాచీన భారతదేశం నుంచి మూడు నుంచి ఐదు  ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాచీన పురావస్తు ప్రాంతాలు, బయటపడిన కట్టడాలు, పరికరాలు, సింధూ నాగరికత, ఆర్యులు, మత ఉద్యమాలు, మౌర్యుల పరిపాలనాంశాలు, గుప్తుల సాంస్కృతిక సేవలు లాంటి అంశాలపై దృష్టి సారించాలి.  మధ్య యుగంలో సూఫీ, భక్తి ఉద్యమకారుల ప్రభావం, ఢిల్లీ సుల్తానులు, మొగల్ చక్రవర్తుల సాహిత్య, సాంస్కృతిక సేవ, విజయనగర - బహమనీ రాజ్యాల ప్రభావం, దక్షిణ భారతంలో చోళ, పాండ్య రాజ్యాల ఆర్థిక, శిల్పకళా రంగాలు, దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు, వారి రచనల్లోని అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం, సామాజిక సంస్కరణోద్యమాలు, స్వాతంత్య్రోద్యమంలోని దశలు, స్వాతంత్య్రం అనంతర పరిస్థితులపై పట్టు సాధించాలి. గత మూడు నుంచి నాలుగేళ్ల పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థం అవుతుంది. ఉదాహరణకు 2008 సివిల్స్‌లో అడిగిన కింది ప్రశ్నను గమనించండి.
 
 ప్రశ్న: కిందివాటిని జతపర్చండి.
     LIST - 1             LIST - 2
       సూఫీమతం       నాయకులు
     ఎ) చిస్తీ సిల్‌సిలా    1) షేక్ అహ్మద్  షేర్‌హింద్
     బి) నక్షబంది సిల్‌సిలా    2) షేక్ బహ్రూద్దీన్ జకారియా
     సి) ఖాద్రీ సిల్‌సిలా    3) షేక్ హమీదుద్దీన్
     డి) సౌహాద్రి సిల్‌సిలా     4) సయ్యద్ ముక్దుమ్ మహ్మద్ గిలానీ
 1) ఎ-3, బి-4, సి-1, డి-2
 2) ఎ-1, బి-4, సి-3, డి-2
 3) ఎ-3, బి-1, సి-4, డి-2
 4) ఎ-1, బి-3, సి-4, డి-2
 సమాధానం: 3
 
 1857 సిపాయిల తిరుగుబాటును ‘నాగరికత- అనాగరికతల’ తిరుగుబాటుగా పేర్కొన్న వారు ఎవరు? 1869లో కార్ల్‌మార్క్స్ ఈ తిరుగుబాటును ఏమని  వ్యాఖ్యానించాడు? లాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అదేవిధంగా గాంధీయుగం నుంచి  గాంధీ వ్యక్తిత్వం, పోరాట పద్ధతులు, సత్యాగ్రహం + అహింస ప్రాధాన్యత, 1942 క్విట్ ఇండియాలో ‘డూ ఆర్ డై’ అని ఎందుకు పిలుపునిచ్చారు?, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడటానికి కారణాలు, గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
 
 ఈ సమాచారమంతా ప్రామాణిక పాఠ్య పుస్తకాల్లో లభిస్తుంది. చదువుతున్నప్పుడే అర్థం చేసుకున్న అంశాలను నోట్స్‌గా రాసుకోవాలి. అప్పుడే సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన కలుగుతుంది. సివిల్ సర్వీసెస్; కాలేజ్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించిన నెట్/స్లెట్ గత పరీక్షల ప్రశ్నపత్రాల్లోంచి 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పాత విషయాలే కాకుండా, నూతన, సమకాలీన, సాంస్కృతిక పరమైన అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమినరీ పరీక్ష జ్ఞానానికి సంబంధించిందే తప్ప, సబ్జెక్టుకు సంబంధించింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేవలం వడపోత (ఎలిమినేట్) చేయడానికి నిర్వహించేది మాత్రమే.
 
 ఇన్‌పుట్స్: డాక్టర్ పి.మురళి,
 సీనియర్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్,
 హైదరాబాద్.
 
 జనరల్ నాలెడ్‌‌జ: అంతరిక్ష రంగంలో మైలురాళ్లు
 -    మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం - స్పుత్నిక్ -1 (1957లో రష్యా ప్రయోగించింది)
 -    అంతరిక్షంలోకి పంపిన కుక్కపిల్ల పేరు -లైకా (1957, స్పుత్నిక్-2 నౌక ద్వారా)
 -    అంతరిక్షంలోకి అమెరికా పంపిన మొదటి ఉపగ్రహం-ఎక్స్‌ప్లోరర్ (1958 అమెరికా)
 -    నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)ను ఏర్పాటు చేసిన సం॥
 -    మొదటి అంతరిక్ష యాత్రికుడు-యూరి గగారిన్, రష్యా (1961లో వోస్తోక్-1 అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించాడు)
 
 మన జాతీయ పతాకం
 -    తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య (విజయవాడ) రూపొందించిన జాతీయ పతాక నమూనాను ప్రదర్శించారు.
 -    3:2 (పొడవు: వెడల్పు) నిడివిగల జాతీయ పతాకంలో కాషాయం రంగు- ధైర్యానికి, త్యాగానికి; తెలుపు రంగు - శాంతి, సత్యానికి; ఆకుపచ్చ రంగు - విశ్వాసానికి చిహ్నాలుగా గుర్తించారు.
 -    పతాకం మధ్యలో తెలుపు రంగుపై మొదట మహాత్మాగాంధీ సూచించిన చరఖా ఉండేది. తరువాత దీని స్థానంలో ముదురు నీలిరంగు (నేవీ బ్లూ)లో గల అశోకుని ధర్మచక్రం ఎంచుకున్నారు. దీన్ని సారనాథ్‌లోని అశోక స్తంభం నుంచి గ్రహించారు. ఈ అశోక చక్రం ప్రాచీన సంస్కృతికి చిహ్నం.
 -    జాతీయ పతాకాన్ని 1947, జూలై 22న ఆమోదించారు.
 -    జాతీయ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగురవేయడానికి వీలుగా జనవరి 26, 2002 నుంచి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా - 2002’ అమల్లోకి వచ్చింది.
 
 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17)
 -    {పధాన లక్ష్యం: వేగవంతమైన, సుస్థిర, మరింత సమ్మిళిత వృద్ధి.
     వృద్ధి లక్ష్యాలు - సగటు వార్షిక వృద్ధి:
 -    ఆర్థిక వ్యవస్థ: 8 శాతం
 -    వ్యవసాయ రంగం: 4 శాతం
 -    పారిశ్రామిక రంగం: 9 శాతం
 -    సేవా రంగం: 10 శాతం
 -    ఇతర లక్ష్యాలు/అంచనాలు: స్థూల దేశీయోత్పత్తిలో పెట్టుబడి 37 శాతం, స్థూల దేశీయోత్పత్తిలో పొదుపు 34.2 శాతం.
 -    వనరులు: రూ. 80,50,123 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement