నెల్సన్ మండేలా అస్తమయం | Nelson Mandela dies in Johannesburg | Sakshi
Sakshi News home page

నెల్సన్ మండేలా అస్తమయం

Published Thu, Dec 12 2013 3:44 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Nelson Mandela dies in Johannesburg

 ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు


 
 జాతీయం
 
 పృధ్వీ-2 పరీక్ష విజయవంతం
 ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే పృధ్వీ-2 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డిసెంబర్ 3న పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణి 250 కి.మీ నుంచి 350 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 350 కిలోల అణ్వాయుధాలను మోసుకుపోగలదు. దీన్ని 2003లో సైన్యంలో చేర్చారు. దీన్ని ధనుష్ పేరుతో నౌకాదళానికి కూడా అందించారు.
 
 అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం
 అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం దక్కింది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అవినీతి దేశాల జాబితాలో సోమాలియా అత్యంత అవినీతి దేశంగా మొదటి స్థానంలో ఉంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 177 దేశాల జాబితాను డిసెంబర్ 3న విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి.
 
 0-100 స్కేలులో 0 స్థానంలో ఉంటే అత్యంత అవినీతి దేశంగా, 100వ స్థానంలో ఉంటే అత్యంత నీతివంతమైన దేశంగా పరిగణిస్తారు. భారత్‌కు 36 పాయింట్లు దక్కాయి. డెన్మార్క్, న్యూజిలాండ్‌లకు 91 పాయింట్లు లభించాయి. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, సింగపూర్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు తక్కువ అవినీతి దేశాలుగా మంచి స్థానంలో ఉన్నాయి. చైనా 80వ స్థానంలోనూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లు 72వ స్థానంలోనూ, రష్యా 127, పాకిస్థాన్ 127వ స్థానంలోనూ ఉన్నాయి.
 
 శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్
 ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్‌ను వార్దా - ఔరంగాబాద్ మధ్య 1200 కె.వి లైన్ నెలకొల్పనున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 400 కి.మీ. ప్రస్తుతం 400 కె.వి లైన్ పనిచేస్తోంది. వచ్చే రెండేళ్లలో దీని సామర్థ్యాన్ని 1200 కె.వికి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పెంచనుంది. అల్ట్రా హై వోల్టేజి (యుహెచ్‌వీ) విధానాలను ఈ లైన్ ఏర్పాటులో వినియోగిస్తారు. ప్రస్తుతం చైనా వాణిజ్యపరంగా 1100 కె.వి లైన్‌ను ఉపయోగిస్తోంది.
 
 ఉత్తమ వ్యాపార దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం
 ప్రపంచంలో వ్యాపారానికి ఉత్తమ దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 5న విడుదల చేసింది. 148 దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం దక్కింది. ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌కు రెండో స్థానం, హాంగ్‌కాంగ్‌కు మూడో స్థానం లభించాయి. ఆస్తి హక్కులు, కొత్తదనం, పన్నులు, సాంకేతికత, అవినీతి, స్వేచ్ఛ (వ్యక్తిగత, వ్యాపార, ద్రవ్యపరమైన), జాప్యం, పెట్టుబడిదారు రక్షణ, స్టాక్ మార్కెట్ పనితీరు వంటి 11 అంశాలపై ఆధారపడి ర్యాంకులు కేటాయించారు.
 
 సీఐసీగా సుష్మా సింగ్
 కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సుష్మా సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధూ పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో సుష్మ బాధ్యతలు చేపట్టారు. ఆమెను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, కేంద్ర న్యాయశాఖ మంత్రితో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సుష్మా 2009, సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
 ఏపీలో తయారీ జోన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌లో మూడు జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం డిసెంబర్ 4న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి కోసం భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల చేసేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. ఈ మూడు జోన్లను చిత్తూరు, ప్రకాశం, మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాకు రూ.43,000 కోట్లు, చిత్తూరుకు రూ.31,000 కోట్లు, ప్రకాశంకు రూ.43000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఒక్కో జోన్‌కు 5000 హెక్టార్ల భూమిని కేటాయించారు.
 
 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి నదీ జలాలు, సహజ వనరుల పంపకాలు, హైదరాబాద్‌లో శాంతిభద్రతల వరకు అనేక అంశాలను పొందుపరిచారు.
 విభజనతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటాయి. 119 మంది శాసనసభ సభ్యులు, 40 మంది శాసనమండలి సభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు.
 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటాయి.
 కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది శాసనసభ సభ్యులు, 50 మంది శాసనమండలి సభ్యులు, 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.
 కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది.
కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి గవర్నర్ ఉంటాడు.
 హైదరాబాద్ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ప్రస్తుతమున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధి ప్రాంతం ఉమ్మడి రాజధాని ప్రాంతమవుతుంది.
కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజుల్లోగా ఈ నిపుణుల కమిటీ సిఫారసులు చేస్తుంది.
కృష్ణా, గోదావరి నదుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రెండు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తారు.
కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేతృత్వంలోని సర్వోన్నత మండలి ఈ బోర్డులను పర్యవేక్షిస్తుంది.  ఐదేళ్ల కాలపరిమితికి మించకుండా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలతోపాటు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కూడా ఉమ్మడిగా అందరికీ ఒకేలా వర్తిస్తుంది.
371డీ రెండు రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను ప్రోత్సాహకాలు కల్పిస్తారు.
 
 పులిచింతల ప్రాజెక్టు ప్రారంభం
 కృష్ణానదిపై నిర్మించిన డాక్టర్ కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 7న ప్రారంభించారు. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కృష్ణా డెల్టా ఆయకట్టు భూముల స్థిరీకరణకు తోడ్పడుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13.88 ల క్షల ఎకరాలకు నీరందుతుంది. 45.77 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1831 కోట్లు వ్యయమైంది.
 
 ఈ ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. డ్యామ్ స్పిల్ వే 18.50 మీటర్లు  ్ఠ 17.00 మీటర్ల 24 రేడియల్ గేట్లతో దేశంలోనే అత్యంత భారీగా నిర్మితమైంది. దీన్ని గుంటూరు జిల్లాలో అచ్చంపేట మండలంలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఎగువన, నాగార్జునసాగర్‌కు దిగువన నిర్మించారు. 2004, అక్టోబర్ 15న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా నిర్మాణం మొదలుపెట్టిన తొలి ప్రాజెక్ట్.
 
 క్షిపణిని ప్రయోగించిన ఎల్‌సీఏ
 తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) నుంచి ప్రయోగించిన క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరీక్షను గోవా తీరం నుంచి డిసెంబర్ 7న చేపట్టారు. తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్ నిర్వహించిన క్షిపణి ప్రయోగం మరో ప్రధాన ఘట్టం. దీంతో వైమానిక దళంలో తేజస్‌ను చేర్చేందుకు వీలవుతుంది. దీన్ని బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హెచ్‌ఏఎల్ కలిసి అభివృద్ధి చేశాయి.
 
 
 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
 ఐదు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన ఎన్నికల ఫలితాలు..
 మధ్యప్రదేశ్ (మొత్తం సీట్లు -230): ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 165, కాంగ్రెస్‌కు 58, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి.
 ఛత్తీస్‌గఢ్ (మొత్తం సీట్లు -90): ఇక్కడ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నాయకత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిం ది. బీజేపీకి 49,కాంగ్రెస్‌కు 39, ఇతరులకు 2 స్థానాలు లభించాయి.
 రాజస్థాన్ (మొత్తం సీట్లు -200): అధికార కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 162, కాంగ్రెస్ 21, ఇతరులు 16 స్థానాలు దక్కించుకున్నారు.
 ఢిల్లీ (మొత్తం సీట్లు - 70): ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ పూర్తిగా రాలేదు. మూడు దఫాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
 మిజోరాం (మొత్తం సీట్లు-40): ముఖ్యమంత్రి లాలా థన్‌హవ్లా నేతృత్వంలో అధికార కాంగ్రెస్ పార్టీ 33 సీట్లు దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) 5 స్థానాలు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఒక స్థానంలో విజయంలో సాధించాయి.
 
 
 అంతర్జాతీయం
 
 ఆసియా కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహం
 దక్షిణాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు టెలివిజన్, కేబుల్ టీవీ సేవలు అందించేందుకు తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టింది. భారత్, చైనాలకు కూడా ఈ ఉపగ్రహ సేవలు అందుతాయి. ఈ రాకెట్ ద్వారా ఎస్.ఇ.ఎస్-8 అనే 3.2 టన్నుల ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కేప్ కేనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 4న ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని భూమి కంటే పైన స్థిర కక్ష్యలో ఉంచి ఉపయోగించుకుంటారు.
 
 నెల్సన్ మండేలా అస్తమయం
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95) జోహెన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 5న మరణించారు. మండేలా దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలనను అంతమొందించారు. అల్ప సంఖ్యాకులైన శ్వేత జాతీయుల పాలనలో తీవ్ర వివక్షకు గురైన నల్లజాతి ప్రజల విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో ఆయన 27 ఏళ్ల జైలు జీవితం గడిపారు.
 
 మండేలా 1918, జూలై 18న జన్మించారు. 1943లో ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ)లో చేరారు. 1960, మార్చిలో ప్రభుత్వం ఏఎన్‌సీని నిషేధించడంతో 1961 డిసెంబర్‌లో మండేలా చీఫ్ కమాండర్‌గా ఏఎన్‌సీ సాయుధ దళం ఏర్పడింది. ప్రభుత్వం 1962లో మండేలాను బంధించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 1964లో జీవిత ఖైదుకు గురయ్యారు. 27 ఏళ్లపాటు రాబెన్ ఐలాండ్ జైలులో దుర్భర జీవితం గడిపారు. 1990, ఫిబ్రవరి 11న జైలు నుంచి విడుదలయ్యారు.
 
 1991లో ఏఎన్‌సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993లో మండేలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994, ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అన్ని జాతులు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. జాతి వివక్షకు తెరపడింది. 1994, మే 10న దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా మండేలా ఎన్నికయ్యారు. ఐదేళ్ల తర్వాత 1999లో స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 2004లో ప్రజా జీవితం నుంచి విరమించుకున్నారు. 1990లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతితో భారత ప్రభుత్వం మండేలాను సత్కరించింది.
 
 
 క్రీడలు
 ధోనీకి ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు -2013
 భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2013 సంవత్సరానికి ఐసీసీకి చెందిన ఎల్‌జీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికయ్యాడు. సచిన్ (2010) తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారత క్రికెటర్ ధోని. 2011లో, 2012లో రెండుసార్లు ఈ అవార్డు శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు దక్కింది. ఐసీసీ వెబ్‌సైట్, ట్విట్టర్ ద్వారా జరిగిన ఓటింగ్‌లో రెండు లక్షల మంది విజేతను ఎంపిక చేశారు.
 
 కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
 దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 8న ముగిసిన కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 16 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 13 రజతాలు, 11 కాంస్య పతకాలతోపాటు మొత్తం 38 పతకాలు భారత్‌కు దక్కాయి. పురుషుల ఫ్రీ స్టైల్, గ్రీక్-రోమన్ స్టైల్ టీం చాంపియన్‌షిప్ భారత్‌కు లభించాయి. మహిళా విభాగంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement