కంప్యూటర్ల చికిత్సకు.. నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్!
కంప్యూటర్.. నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో కార్యకలాపాలు సజావుగా సాగడానికి కావాల్సిన ప్రధాన సాధనం. ప్రపంచవ్యాప్తంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అన్ని రకాల కమ్యూనికేషన్ దీనిద్వారానే సాగుతున్నాయి. కంప్యూటర్లు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. దీన్నే నెట్‌వర్క్ అంటారు. ఇందులో లోపాలు తలెత్తితే అపారమైన నష్టం జరుగుతుంది. లక్షలాది మంది జీవితాలు ప్రభావితమవుతాయి. కాబట్టి అవి సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. నెట్‌వర్క్‌లో లోపాలు ఏర్పడి కంప్యూటర్లు మొరాయిస్తే సరిచేసే నిపుణులే.. కంప్యూటర్ నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్స్. ప్రస్తుతం దేశవిదేశాల్లో అత్యధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్న రంగం ఇదే. కంప్యూటర్లు కనిపించని కార్యాలయమే లేదనడం అతిశయోక్తి కాదు. అందుకనుగుణంగా నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. వీరికి రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలు స్వాగతం పలుకుతున్నాయి.
అవకాశాలు.. కోకొల్లలు
నెట్‌వర్క్ నిపుణులు కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సొంతంగా నెట్‌వర్క్‌ను డిజైన్ చేయాలి. అవసరాన్ని బట్టి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను సృష్టించాలి. బ్యాంక్‌లు, మ్యానుఫ్యాక్చరింగ్, మీడియా సంస్థల్లో భారీసంఖ్యలో కంప్యూటర్లుంటాయి. వీటి నెట్‌వర్క్ సక్రమంగా ఉండేలా చూడడానికి నిపుణులను నియమిస్తున్నారు. నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్స్‌కు హెచ్‌సీఎల్, విప్రో వంటి ఔట్‌సోర్సింగ్ కంపెనీల్లో కొలువులున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నెట్‌వర్క్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయొచ్చు. క్వాలిటీ అస్యూరెన్స్/టెస్టింగ్ ఆఫ్ నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, రీసెర్చ్ ఇన్ నెట్‌వర్కింగ్‌లో సేవలందించొచ్చు. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వీరి అవసరం అధికంగా ఉంది. 100 కంప్యూటర్లు ప్రతి ఉన్న కార్యాలయంలో నెట్‌వర్క్ నిపుణులు ఉండడం తప్పనిసరి.
కావాల్సిన స్కిల్స్: కంప్యూటర్ నెట్‌వర్క్ నిపుణులకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణి అవసరం. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నేర్పు తప్పనిసరి. తమ రంగానికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.
అర్హతలు: కంప్యూటర్ నెట్‌వర్క్ నిపుణులుగా మారాలంటే.. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్) కోర్సు చదవాలి. కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా కంప్యూటర్ నెట్‌వర్క్ నిపుణుడిగా మారొచ్చు. దీర్ఘకాలంలో ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఎంటెక్ వంటి కోర్సులు పూర్తిచేయడం మంచిది. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఉన్నాయి.
వేతనాలు: ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తిచేసిన నెట్‌వర్క్ ప్రొఫెషనల్‌కు ప్రారంభంలో నెలకు రూ.40 వేల వేతనం అందుతుంది. బీసీఏ/బీఎస్సీ చదివి ఏడాదిపాటు నెట్‌వర్క్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ పొందితే ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం అందుకోవచ్చు. సర్టిఫైడ్ కోర్సులు చదివితే రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం లభిస్తుంది. రెండు మూడేళ్ల పని అనుభవం ఉన్న నెట్‌వర్క్ నిపుణులకు బహుళజాతి సంస్థల్లో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వేతన ప్యాకేజీ దక్కుతుంది. ఈ రంగంలో సీనియారిటీ, పనితీరును బట్టి జీతభత్యాలుంటాయి.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఏ ఉస్మానియా యూనివర్సిటీ; వెబ్‌సైట్: www.osmania.ac.in
ఏ జేఎన్‌టీయూ-హైదరాబాద్; వెబ్‌సైట్: www.jntuh.ac.in
ఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)-వరంగల్
వెబ్‌సైట్: www.nitw.ac.in
ఏ బిట్స్-పిలానీ; వెబ్‌సైట్: www.bitspilani.ac.in
ఏ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్
వెబ్‌సైట్స్: www.iitb.ac.in, www.iitd.ac.in,
www.iitm.ac.in, www.iitk.ac.in
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
డీఎస్సీ పరీక్షలో ‘మూలకాల వర్గీకరణ’ పాఠ్యాంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చే
అవకాశం ఉంది?
- ఎ.సంయుక్త, అవంతినగర్
గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ‘మూలకాల వర్గీకరణ’ పాఠ్యాంశం నుంచి సగటున 2 బిట్లు అడిగారు. ఈసారి కూడా కనీసం రెండు ప్రశ్నలు రావొచ్చు. ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా పరమాణు ధర్మాలు - వాటి క్రమం పీరియడ్‌లలో, గ్రూపుల్లో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పరిశీలించాలి. విస్తృత ఆవర్తన పట్టికను ఏయే ధర్మం ఆధారంగా వర్గీకరించారో తెలుసుకోవాలి.
జడవాయువులు, ప్రాతినిధ్య మూలకాలు, పరివర్తన మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు, వాటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలపై పట్టు సాధించాలి. పరమాణు పరిమాణం, అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ అఫినిటీల ప్రమాణాలు, అత్యధిక, అత్యల్ప పరమాణు పరిమాణం, రుణ విద్యుదాత్మకతల మూలకాలను గుర్తుంచుకోవాలి. ఆవర్తన పట్టికను ఏయే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారో తెలుసుకోవాలి. లాంథనైడ్‌స, ఆక్టినైడ్‌సపై దృష్టి సారించాలి.
ఇన్‌పుట్స్: ఎ.వి.సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ
పోటీ పరీక్షల్లో ‘భారతదేశ పర్వతాలు, కనుమలు’ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
- ముత్యాల నవనీత, కంచన్ బాగ్
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రధానంగా వింధ్య, సాత్పురా, ఆరావళి పర్వతాలు, వీటిలో ఎత్తయిన శిఖరాలు; పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఇవి కలిసే ప్రదేశం, వీటిలోని శిలలు; మాల్వా పీఠభూమి; ద్వీపకల్ప పీఠభూమిలో జీవజాలం... తదితరాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు గమనించవచ్చు. ఉదాహరణకు ‘తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి?’ అని అడిగారు. ఈ ప్రశ్న సులభమైందే అయినా చాలామంది తప్పులు చేశారు. దీనికి కారణం క్షుణ్నంగా అవగాహన పెంపొందించుకోకపోవడమే. ఈ టాపిక్‌లో అనేక అంశాల మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వీటిని చదివేటప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపం పటాన్ని ముందుంచుకొని, ఒక అంశానికి, మరొక అంశానికి సంబంధాన్ని గుర్తుంచుకుంటూ పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయాలి. పోటీ తీవ్రత పెరుగుతుండడంతో ఇవే అంశాలపై కఠినమైన ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది.
ఉదా: 1) పశ్చిమ కనుమలు ఏయే ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి?
2) వింధ్య పర్వతాల సరిహద్దులు ఏవి?
గంగా- సింధూ మైదానంలో ఉన్న భూస్వరూపాల్లోని ఉపరితల వ్యత్యాసాలైన భాబర్, టెరాయ్, భంగర్, ఖాదర్ మొదలైన వాటిపై కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వీటన్నింటినీ ప్రత్యేక దృష్టితో చదవాలి.
ఇన్‌పుట్స్: ముల్కల రమేశ్, సీనియర్ ఫ్యాకల్టీ
త్వరలో కేంబ్రిడ్జి-ఇండియా సీనియర్ ఫెలోషిప్
నూతన రంగాల్లో భారత విద్యార్థుల భాగస్వామ్యంతో పరిశోధనలు కొనసా గిస్తామని యునెటైడ్ కింగ్‌డమ్(యూకే)లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ లెస్‌జెక్ బోరిసీవిజ్ తెలిపారు. ప్రతిభావంతులను ప్రోత్సహిం చేందుకు త్వరలో కేంబ్రిడ్జి-ఇండియా సీనియర్ ఫెలోషిప్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ ఫెలోషిప్ పొందడా నికి పోస్ట్ డాక్టోరల్ లెవల్ కంటే పైస్థాయి లోని స్కాలర్స్ అర్హులని పేర్కొన్నారు. ఎంపికైనవారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధనలు చేయొచ్చన్నారు. ప్రస్తుతం భారత్‌తో కలిసి 270 ప్రాజెక్ట్‌లు చేపట్టామని అన్నారు. ప్లాంట్ సైన్స్, ఫుడ్ సెక్యూరిటీ, నానో సైన్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ వంటి కొత్త రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నా మన్నారు. తమ వర్సిటీలో ప్రస్తుతం 250 మందికిపైగా భారత విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారని, కొన్నేళ్లుగా ఈ సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత్‌లో కేంబ్రిడ్జి వర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలను బోరిసీవిజ్ తోసిపుచ్చారు.
నేషనల్ జియోఫిజికల్
రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌జీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్
అర్హతలు: మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. రీసెర్చ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
వయోపరిమితి: 35 ఏళ్లకు మించకూడదు
టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు: బీఎస్సీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/జియాలజీ)తోపాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా..
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి, పోస్టు ద్వారా పంపించాలి.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 17
హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 24
వెబ్‌సైట్: www.ngri.org.in
బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంబీఏ
బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ (జనరల్)
స్పెషలైజేషన్: హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్
సీట్ల సంఖ్య: 46
ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
సీట్ల సంఖ్య: 46
ఎంపిక: అకడమిక్ మెరిట్, క్యాట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31
వెబ్‌సైట్: http://bhu.ac.in/
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్
సీట్ల సంఖ్య: 103
విభాగాలు: ఏరోనాటికల్, ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్, కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇండస్ట్రియల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఇంజనీరింగ్.
కాలపరిమితి: ఏడాది
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్‌షిప్
సీట్ల సంఖ్య: 35
విభాగాలు: అకౌంట్స్ అండ్ ఆడిటింగ్, బిల్డింగ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ టెక్నిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆఫీస్ మేనేజ్‌మెంట్, ఆఫీస్ స్టెనోగ్రఫీ, పర్చేజింగ్ అండ్ స్టోర్ కీపింగ్.
కాలపరిమితి: ఏడాది
అర్హతలు: ఇంటర్ (వొకేషనల్ గ్రూప్) లేదా తత్సమానం.
వయసు: 23 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16
వెబ్‌సైట్: www.hal-india.com