మియామీ టైటిల్ సెరెనా కైవసం
క్రీడలు
గ్రహానికి విశ్వనాథన్ ఆనంద్ పేరు ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరును ఒక చిన్న గ్రహానికి 4538 విషీ ఆనంద్ అని పెట్టినట్లు ఏప్రిల్ 1న మైనర్ ప్లానెట్ సెంటర్ తెలిపింది. ఈ గ్రహాన్ని 1998వ సంవత్సరంలో అక్టోబర్ 10న కెంజో సుజుకీ గుర్తించారు. ఇది అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలో ఉంది. సాధారణంగా కొత్తగా గుర్తించిన గ్రహాలకు వాటిని కనుగొన్న వారి పేర్లే పెడతారు. పదేళ్ల పాటు గ్రహానికి పేరు పెట్టకపోతే వేరే పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఖరారు చేస్తుంది. విశ్వనాథన్ కన్నా ముందు రోజర్ ఫెదరర్, జెస్సీ ఓవెన్స్, డొనాల్డ్ బ్రాడ్‌మెన్‌లకు ఈ గౌరవం దక్కింది.
చెన్ లాంగ్, మారిన్‌లకు మలేసియా ఓపెన్ టైటిల్స్
మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను, కరోలినా మారిన్ (స్పెయిన్) మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో లిన్ డాన్ (చైనా)ను చెన్ ఓడించాడు. భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లో జురుయ్ లీ చేతిలో ఓడిపోయింది.
మియామీ టైటిల్ సెరెనా కైవసం మియామీ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. ఫ్లోరిడాలో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్)ను ఓడించింది. సెరెనా ఎనిమిదోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. ఇది తన కెరీర్‌లో 66వ సింగిల్స్ టైటిల్. మహిళల డబుల్స్: టైటిల్‌ను భారత్‌కు చెందిన సానియా మిర్జా.. మార్టీనా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి రష్యాకు చెందిన ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నియాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్: టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ ఆండీ ముర్రేను ఓడించి గెలుచుకున్నాడు. ఇది జొకోవిచ్‌కు ఐదో మియామి మాస్టర్స్ టైటిల్.
విశ్వవిజేత మరియా
అంతర్జాతీయ మాస్టర్ మరి యా ముజిచిక్ (ఉక్రెయిన్) ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. సోచి (రష్యా)లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో నటాలియా పోగోనియా (రష్యా)ను మరియా ఓడించింది. సెమీఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్)కు కాంస్య పతకం దక్కింది.
ఐపీఎల్ చైర్మన్‌గా రాజీవ్ శుక్లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ కొత్త చైర్మన్‌గా రంజీబ్ బిస్వాల్ స్థానంలో రాజీవ్ శుక్లా ఎంపికయ్యారు. ఇందులో మాజీ ఆటగాళ్ల హోదాలో సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి ఉన్నారు.
జాతీయం
రిజర్వ్ బ్యాంకు 80వ వార్షికోత్సవం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 80వ వార్షికోత్సవం ఏప్రిల్ 2న జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పేద రైతులకు రుణాలు ఇవ్వడం, వసూలు చేసుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులను కోరారు. ఆర్థిక సమ్మిళితం సాధించేందుకు 20 ఏళ్ల మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆర్‌బీఐకి ప్రధాని సూచించారు. కీలకమైన సంఘటనలు నిర్దేశించుకొని లక్ష్యాలు ఏర్పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు.
2015-20 వాణిజ్య విధానం
2015-20 వాణిజ్య విధానాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 1న ప్రకటించారు. ఇందులోని ముఖ్యాంశాలు: వస్తు, సేవల ఎగుమతులను 2020 నాటికి 900 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యం. ఇవి 2013-14లో 465.9 బిలియన్ డాలర్లుగా ఉన్నా యి. విదేశీ వాణిజ్య విధానాన్ని ఇకపై రెండేళ్లకొకసారి సమీక్షించడం. ఇప్పటివరకు ఈ విధానంపై వార్షిక సమీక్ష జరుగుతోంది. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచడం. ఆం ధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, భీమవరం పట్టణాలను టౌన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ జాబితాలో చేర్చడం. దీంతో ఈ హోదా గల నగరాల సంఖ్య 23కు చేరుకుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని ఎగుమతి ఆధారిత యూనిట్లకు పలు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.
ఉగ్రవాద నిరోధక బిల్లుకు ఆమోదం
వివాదాస్పద గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేర నియంత్రణ బిల్లును గుజరాత్ శాసనసభ మార్చి 31న ఆమోదించింది. వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, కఠినమైన నిబంధనలతో కొత్త చట్టం అవసరమని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం బాగా పెరిగిపోవడంతో ఫోన్ సంభాషణలు కీలకమైన సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయని తెలిపింది.
సీఎంలు, సీజేల జాతీయ సదస్సు
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సదస్సు ఏప్రిల్ 5న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్గత స్వీయ మదింపు చర్యను ఏర్పాటు చేసుకోవాలని న్యాయమూర్తులను మోదీ కోరారు. వందకు పైగా ట్రైబ్యునళ్లకు అధిక నిధులు వ్యయమవుతున్నాయని, వాటి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు లో న్యాయవాద పదకోశాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
అంతర్జాతీయం
మయన్మార్‌లో శాంతి ఒప్పందం మయన్మార్‌లో జాతీయ కాల్పుల విరమణ ఒప్పందం మార్చి 31న కుదిరింది. ఈ ముసాయిదా ఒప్పందంపై ఆ దేశ అధ్యక్షుడు థీన్‌సేన్ సంతకం చేశారు. సాయుధ తిరుగుబాటు గ్రూపులతో జరిగిన ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. దేశ వ్యాప్తంగా కాల్పుల విరమణకు తోడ్పడే ఈ ముసాయిదా ఒప్పందాన్ని తిరుగుబాటు దళాల ప్రతినిధులు, సైన్యం, ప్రభుత్వం అంగీకరించాయి. ఈ శాంతి సంప్రదింపులకు ఐక్యరాజ్యసమితి పరిశీలక సంస్థగా వ్యవహరించింది.
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి విజయం
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ఆర్మీ జనరల్ మహ్మద్ బుహారీ విజయం సాధించారు. మార్చి 31న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు గుడ్‌లక్ జోనథాన్‌పై 25 లక్షల ఓట్ల మెజారిటీతో బుహారి భారీ విజయం సాధించారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా (173 మిలియన్) కలిగిన నైజీరియాలో ప్రజాస్వామ్యయుతంగా అధికార మార్పిడి జరిగింది. అవినీతి కుంభకోణాలు, ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిస్ట్‌కు చెందిన బోకోహారమ్ ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడం లాంటి వాటి వల్ల పీడీపీ ప్రజల మద్దతు కోల్పోయింది.
ఇరాన్ అణు కార్యక్రమంపై సఫలమైన చర్చలు
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఇందుకు సంబంధించిన చర్చలు స్విట్జర్లాండ్‌లోని లసానేలో ఏప్రిల్ 2న జరిగాయి. ఈ చర్చల్లో ఇరాన్‌తో పాటు ఆరు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు పాల్గొన్నాయి. రెండు వర్గాల మధ్య కుదిరిన కార్యచరణ ఒప్పందం జూన్ 30 నాటికి సమగ్రంగా పూర్తవుతుంది. ప్రస్తుత అంగీకారం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమంపై పదేళ్లు పరిమితులు ఉంటాయి. ఇందుకు బదులుగా ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను పలు దేశాలు ఎత్తివేశాయి.
ఆపరేషన్ రాహత్ సఫలం
యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ రాహత్ ద్వారా ఎయిర్ ఇండియా ఏప్రిల్ 5 నాటికి 2,300 మందిని భారత్‌కు చేర్చింది.
ఉగ్రవాదుల దాడిలో 150 మంది మృతి
కెన్యాలో ఈశాన్య ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఏప్రిల్ 2న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 150మంది విద్యార్థులు మరణించగా, 79 మంది గా య పడ్డారు. సోమాలియాకు చెందిన ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఈ దాడులకు పాల్పడింది.
రాష్ట్రీయం
నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరును అమరావతిగా ఖరారు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రిమండలి ఏప్రిల్ 1న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తూ అమరావతికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. అమరావతిని రాజధానిగా చేసుకొని 400 ఏళ్లు శాతవాహనులు పాలించారు. పంచారామాల్లో ఒకటైన అమరేశ్వరాలయం పేరుతోనే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చింది. ఇటీవల వారసత్వ నగరాల్లో కేంద్రం ఎంపిక చేసిన వాటిలో అమరావతి ఒకటి.
శ్రీసిటీలో పెప్సికో ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
పెప్సికోకు చెందిన సింగల్ లైన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏప్రిల్ 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పెప్సికో చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయితో కలిసి ప్రారంభించారు. 86 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1200 కోట్లతో చేపడుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఉత్పత్తి కేంద్రం.. దేశంలోనే ఆ సంస్థకు చెందిన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం కానుంది.
పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి
పర్వతారోహకుడు మల్లె మస్తాన్ బాబు (40) అర్జెంటినా, చీలీ మధ్యనున్న ఆండీస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బాబు ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.
నల్గొండలో సిమి ఉగ్రవాదుల కాల్చివేత
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఎంఐ-సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరిని తెలంగాణలోని నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం గ్రామంలో ఏప్రిల్ 4న పోలీసులు కాల్చి చంపారు. వీరిని మధ్యప్రదేశ్‌కు చెందిన అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్‌గా గుర్తించారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు, ఎస్సై సిద్ధయ్య మరణించారు.
గుంటూరులో స్పైసెస్ పార్క్ ప్రారంభం
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో నిర్మించిన స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల) పార్కును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 6న ప్రారంభించారు. 124 ఎకరాల్లోని ఈ పార్క్‌లో రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ 18 మంది పారిశ్రామికవేత్తలకు యూనిట్లు కేటాయించారు. ఈ పార్క్‌లో ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది.
ఏపీ 2015-20 పారిశ్రామిక విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2015-20 పారిశ్రామిక విధానాన్ని ఏప్రిల్ 1న ప్రకటించింది. మౌలిక సదుపాయాల కల్పన, అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యాంశాలు: తయారీ రంగ వృద్ధిరేటు 15 నుంచి 17 శాతానికి, పారిశ్రామిక వృద్ధిరేటు 20.7 నుంచి 25 శాతానికి పెంచడం. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా 15-20 లక్షల ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు - పరిశ్రమలకు 21 రోజుల్లోగా అనుమతులు కల్పించేందుకు సింగిల్ విండో ఏర్పాటు. పరిశ్రమల కోసం తీసుకునే భూమికి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు.
అవార్డులు
ఆఫ్రికా గ్రూపునకు ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్ పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహిస్తున్న ఆఫ్రికన్ గ్రూపు ప్రాజెక్టు ఫర్ ద స్టడీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా (పిఆర్‌ఎఇఎస్‌ఎ-ప్రయిసా)కు తొలిసారి పిల్లల సాహిత్యంలో అందజేసే ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్ దక్కింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అవార్డు
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఏప్రిల్ 5న ప్రకటించారు. ఈ అవార్డును యూఏఈ మినిస్టర్ ఆఫ్ కల్చర్ దుబాయ్‌లో ఏప్రిల్ 20న ప్రదానం చేస్తారు.