15 నుంచి ఓటర్ స్లిప్పుల జారీ
తనిఖీల్లో దొరికిన మొత్తం రూ. 92.58 కోట్లు
69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండి స్వాధీనం
రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలకు గాను 267 మంది రంగంలో మిగిలారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1682 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శనివారం వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీ వరకు ఓటర్ల సంఖ్య 2,81,66,266గా ఉందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో 3.63 కోట్ల మందితో కలిపి రాష్ట్రం మొత్తం మీద 6.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నందున, 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వానికి తెరపడుతుందన్నారు. 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాల్లో రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలవుతుందని, వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. ఓటరు స్లిప్పులను ఓటర్‌కు లేదా వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని, అందువల్ల ఈ వారం పాటు ఇళ్లలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వాటిలో పోలింగ్ కేంద్రం సంఖ్య, ప్రాంతం, పోలింగ్ సమయం ముద్రించి ఉంటుందని వివరించారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చీరలు, ఇతర సామగ్రి పంపిణీకి సంబంధించి కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నోటా గుర్తు విషయంలో హైకోర్టు ఆదేశాలపై ఈసీకి నివేదించామని, వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భన్వర్‌లాల్ తెలిపారు.
దేశంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నగదు తరలిస్తున్న వారి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటి వరకు 92.58 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అలాగే 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండితోపాటు 3.48 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డబ్బును కోర్టుకు అప్పగించి, ఆదాయపన్ను శాఖకూ సమాచారమిస్తున్నామన్నారు. సరైన ఆధారాలను చూపించి డబ్బును తిరిగి పొందవచ్చని, అలాగే ఆదాయపన్ను శాఖకు సరైన వివరాలు ఇవ్వలేనిపక్షంలో వారు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రానికి 400 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, వాటిని నక్సల్ ప్రభావిత, ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వినియోగించనున్నామని చెప్పారు.
మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ ఎక్కువ
నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం 39 మంది ఎంపీ అభ్యర్థులు, 554 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల నుంచి అత్యధికంగా 30 మంది చొప్పున, నాగర్‌కర్నూలుకు అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్(8), పెద్దపల్లి(17), కరీంనగర్(17), నిజామాబాద్(16), జహీరాబాద్(10), మెదక్(13), మల్కాజిగిరి(30), సికింద్రాబాద్(30), హైదరాబాద్(16), చేవెళ్ల(16), మహబూబ్‌నగర్(10), నాగర్‌కర్నూల్(6), నల్లగొండ(9), భువనగిరి(13), వరంగల్(12), మహబూబాబాద్(17), ఖమ్మం ఎంపీ
స్థానానికి 27 మంది రంగంలో ఉన్నారు.
ఆందోల్ అసెంబ్లీ స్థానానికి ఐదుగురే..: మెదక్ జిల్లా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురే రంగంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఖమ్మం అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 25 మంది చొప్పున పోటీలో ఉన్నారు. కాగా జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్‌లో 10 స్థానాలకు 124 మంది, నిజామాబాద్‌లో 9 సీట్లకు 101 మంది, కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాలకు 168 మంది, మెదక్‌లో పది స్థానాలకు 105 మంది, రంగారెడ్డిలో 14 స్థానాలకు 284 మంది, హైదరాబాద్‌లో 15 స్థానాలకు 298 మంది, మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలకు 144 మంది, నల్లగొండలోని 12 స్థానాల్లో 161 మంది, వరంగల్‌లో 12 నియోజకవర్గాలకు 154 మంది, ఖమ్మంలో పది స్థానాలకు 143 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.