మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. కౌంటింగ్ కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న కౌంటింగ్ చేపట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ పురపాలక సంఘం ఓట్ల లెక్కింపునకు 7టేబుళ్లు, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ పురపాలక సంఘాలు, దేవరకొండ, హుజూర్‌నగర్ నగర పంచాయతీలకు 5 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల కౌంటింగ్‌ను నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ దగ్గర ఉన్న డాన్ బోస్కో స్కూల్‌లో నిర్వహిస్తారు.
ప్రతి పురపాలక సంఘానికి ఒక ఒక ఆర్‌డీఓను ఎన్నికల అబ్జర్వర్‌గా కలెక్టర్ నియమించారు. నల్లగొండకు ట్రైనీ ఐఏఎస్ సత్యనారాయణ, కోదాడకు అదనపు జేసీ వెంకట్రావు, హుజూర్‌నగర్‌కు జేడీఏ నర్సింహారావును అబ్జర్వర్లుగా నియమించారు. మిగతా వాటికి ఆయా పరిధిలో ఉన్న ఆర్‌డీఓలు అబ్జర్వరులుగా వ్యవహరించనున్నారు. నల్లగొండ పురపాలక సంఘానికి సంబంధించి 7టేబుళ్లలో ఏడు వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. మితగా వాటిలో 5 టేబుళ్లలో ఒకేసారి 5 వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టడానికి నిర్ణయించారు. ఒక వార్డులో ఉన్న పోలింగ్ కేంద్రాలు దాదాపు 10 నుంచి 15 నిమిషాలలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక టేబులుకు ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. కౌంటింగ్‌ను జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ పర్యవేక్షంచనున్నారు.
ఉదయం 7.30 గంటలకు మొదట కౌంటింగ్ చేపట్టే వార్డుల సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంల ఓట్లను లెక్కించడానికి ప్రణాళిక తయారు చేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే సమయంలో కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు ఒక ఏజంటును లోపలికి అనుమతిస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు సమయంలో ఒక ఏజంటును మాత్రమే లోపలికి అనుమతి ఇస్తారు. వార్డుల ఫలితాలను ప్రకటించడానికి మైకులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్కూల్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఒక్కో మున్సిపాలిటీ వారిగా టెంట్‌లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల లోపు మొత్తం కౌంటింగ్ పూర్తి కానుంది.
ఏర్పాట్లు చేస్తున్నాం : వేణుగోపాల్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కమిషనర్
కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్‌కు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్న డాన్‌బోస్కో స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యర్థులతో పాటు వచ్చే వారి కోసం కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కేంద్రం వద్ద బారీకేడ్లు, తాగునీటి సౌకర్యం ఇతర అన్ని వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టాం. పనులు చురుగ్గా సాగుతున్నాయి.