తలుపులు బార్లా!
* సిద్ధాంతాలు, భావసారూప్యతలూ జాన్తానై
* ఓట్ల లెక్కలు, సీట్ల సమీకరణాలే అంతిమం
* పొత్తులపై అన్ని పార్టీలదీ అదే తీరు
మంచాల శ్రీనివాసరావు: టీడీపీ కోసం బీజేపీ... బీజేపీ కోసం టీఆర్‌ఎస్... టీఆర్‌ఎస్ కోసం కాంగ్రెస్... కాంగ్రెస్ కోసం సీపీఐ... తలుపులు తెరిచే ఉంటాయి! ఇవే కాదు; బీజేపీ - టీడీపీ కూటమి కోసం లోక్‌సత్తా... టీఆర్‌ఎస్ కోసం సీపీఎం... మజ్లిస్ కోసం కాంగ్రెస్... తలుపులు తెరిచే ఉంటాయి! అవును, తెలంగాణలోని అన్నిపార్టీల వారు ద్వారాలూ తెరిచే ఉంచుకున్నారు!! సమైక్యవాదతో విభజనవాదం... మతవాదంతో లౌకికవాదం... పెట్టుబడివాదంతో కార్మికవాదం... ప్రాంతీయవాదంతో జాతీయవాదం... వాదాలేవైతేనేం, ఆ వివాదాలేవైతేనేం, సిద్ధాంతాల రాద్ధాంతాలతోపాటు భావసారూప్యత అనే బ్రహ్మపదార్థాన్ని సైతం అటకపైపారేసి... ఓట్ల కోసం, సీట్ల కోసం ఒకరితోఒకరు కలిసి పనిచేయటానికి ఉవ్విళ్లూరుతుంటాయి... పొత్తు, సీట్ల అవగాహన, పరోక్ష సహకారం, పరిమిత ఒప్పందం... పేరు ఏదైనా సరే... పొత్తులు ఎవరి మధ్య కుదురుతాయో, ఎవరు ఎవరితో చేతులు కలుపుతారో పక్కనబెడితే ప్రస్తుతం తెలంగాణలోని ప్రధాన పార్టీల నడుమ సాగుతున్న చర్చలు, ప్రయత్నాలు, బేరాలు విద్యావంతుల్లో, మేధావుల్లో చర్చకు దారితీస్తున్నాయి...
సీట్లే పరమావధి!
ఎవరి బలమెంతో, ఎవరి భావాలను ప్రజలు ఎంతగా సమర్థిస్తున్నారో తేలాలంటే అందరూ విడివిడిగా జనంలోకి వెళ్లి తీర్పు కోరాలనే వాదనను ప్రస్తుతం అన్ని పార్టీలూ తేలి కగా కొట్టి పారేస్తున్నాయి. ప్రస్తుతం పొత్తుల చర్చల సరళిని పరిశీలిస్తే బోలెడు విశేషాలు కనిపిస్తాయి. ‘సమైక్యం’ కోసం కట్టుబడి ఉన్న సీపీఎం, టీఆర్‌ఎస్ చర్చలు జరిపాయి. కాంగ్రెస్ మజ్లిస్‌తో అవగాహన కోసం ప్రయత్నిస్తోంది. ఉద్యమకారులపై కేసులు పెట్టించిన కాంగ్రెస్ నాయకులు జేఏసీ నేతలను పిలిచి మరీ టికెట్లు ఆఫర్ చేస్తున్నారు. తెలంగాణ ద్రోహుల పార్టీగా కనిపించిన టీడీపీతో తెలంగాణవాద బీజేపీ జతకట్టే ప్రయత్నాల్లో ఉంది. కేంద్రంలో కాంగ్రెసేతర- బీజేపీయేతర ఫ్రంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపించే సీపీఐ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌తో చేతులు కలిపుతుంది. కొత్తతరం రాజకీయాల పాట పాడే లోక్‌సత్తా టీడీపీ- బీజేపీ కూటమిలో చేరటానికి తహతహలాడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్- సీపీఐ కూటమితో తలపడే సీపీఎం సీమాంధ్రలో మాత్రం సీపీఐతో పొత్తు చర్చలకు సై అంటోంది.
బేరాలు, బెదిరింపులు, మైండ్‌గేమ్స్!
రాజకీయాల్లో సాఫల్యాన్నీ సీట్ల లెక్కల్లోనే చూసే అలవాటున్న పార్టీలు ప్రస్తుతం అనుకూల పార్టీని పొత్తుకు అంగీకరింపజేయటానికి, ఎక్కువ సీట్లు పొందటానికి వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి. బేరాలు, బెదిరింపులు, మైండ్‌గేమ్స్ అన్నీ ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తూ లేదు, విలీనం లేదంటూ బయటికి ప్రకటించే టీఆర్‌ఎస్... మరోవైపు బీజేపీ తమవైపు చూస్తోందని, తాము అడిగినన్ని సీట్లు ఇస్తే పొత్తుకు సరేనంటూ ఢిల్లీ హైకమాండ్‌తో టచ్‌లో ఉంటుంది. తమకు సీఎం పదవి వదిలేస్తే ఎక్కు వ ఎంపీ స్థానాలు ఇవ్వటానికి రెడీ అంటూ కబురు పెడుతుంది. కాదంటే ఒంటరిపోరాటమేనంటూ బెదిరిస్తోంది. టీడీపీతో ఒకవైపు చర్చలు జరుపుతూనే బీజేపీ... టీఆర్‌ఎస్ తమతో టచ్‌లోఉందనీ, వారితో వెళ్తే తమకు లాభమని చూపిస్తూ ఎక్కువ స్థానాల కోసం బేరాలాడుతుంది.
12 సీట్లు కావాలని అడిగే సీపీఐ... తాము అడిగిన స్థానాలు ఇస్తే 4 సీట్లు తగ్గించుకోవటానికి సై అంటోంది. జిల్లాల్లో తమ కు పరోక్షంగా మద్దతు ఇస్తే, హైదరాబాద్‌లో మజ్లిస్‌పై బలహీన అభ్యర్థులను నిలబెడతామంటూ కాంగ్రెస్ అవగాహన కోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజనయ్యాక ఇంకా మీరేంటి, మేమేంటి అంటూ సీపీఎం టీఆర్‌ఎస్‌తో మంతనాలాడుతోంది. మల్కాజిగిరి మాకు వదిలేయండి, మీరు చెప్పినట్లు పొత్తు పెట్టుకుంటామంటూ లోక్‌సత్తా టీడీపీ- బీజేపీ కూటమికి ఆఫర్ ఇస్తోంది. ఎందుకైనా మంచిదని అన్ని పార్టీలూ తొలి జాబితాలను ప్రకటించటానికి సిద్ధపడి, ‘స్నేహధ ర్మం’ అవసరాలను బట్టి ప్రకటించవచ్చులే అనుకుని మలి జాబితాలను వాయిదా వేస్తున్నాయి. సగటు తెలంగాణవాసి ఏం ఆలోచిస్తున్నాడో తేలేది మాత్రం మే 16 నాడే!!