టీడీపీ, బీజేపీల మధ్య పొడిచిన పొత్తు!
సదాశివపేట, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు విషయంలో కొలిక్కి రావాల్సి ఉంది. ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన నాయకులు మంగళ, బుధవారాల్లో సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ తీసుకోగా అభ్యర్థిని కూడా ప్రకటించారు. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలుండగా ఇందులో ఏడు సీట్లు కావాలని బీజేపీ కోరుతుంది. పెద్దాపూర్, నిజాంపూర్, వెల్టూర్, వెంకటాపూర్, కంభాలపల్లి, బాబిల్‌గామ్, నందికంది లేదా మద్దికుంట ఎంపీటీసీ స్థానాలను తమకు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల కోఆర్డినేటర్ హరీష్‌కుమార్, జిల్లా నాయకుడు కోవూరి సంగమేశ్వర్ టీడీపీ నాయకులను కోరారు. ఏడు స్థానాలు కాకుండా ఐదింటితో సరిపెట్టుకోవాలని బీజేపీ నాయకులకు టీడీపీ నేతలు సూచించారు.
చివరకు ఐదు లేదా ఆరు స్థానాలు బీజేపీకి ఇచ్చి మిగతా స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం వరకు స్పష్టత వస్తుందన్నారు. పొత్తుల ఇరు పార్టీలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎంపీపీ పీఠాన్ని ఎవరు తీసుకోవాలి అనే విషయమై మరోమారు చర్చిస్తామని ఆయన తెలిపారు.