ఎంపీటీసీలకోసం నేతల పాట్లు | candidates struggle for mptc seat | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీలకోసం నేతల పాట్లు

Published Fri, Apr 4 2014 12:17 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

candidates struggle for mptc seat

 జహీరాబాద్, న్యూస్‌లైన్:  ప్రాదేశిక పోరులో చిత్రవిచిత్ర పొత్తులు కుదిరాయి. పార్టీల అధిష్టానాలతో సంబంధం లేకుండా ఆయా పార్టీల నేతలు మిగతా పార్టీల వారితో పొత్తుపెట్టుకుని వారి తరఫున ప్రచారం చేస్తున్నారు. నిప్పు, ఉప్పులా ఆయా పార్టీల అధిష్టానాలు నడుచుకుంటుంటే లోకల్‌లో మాత్రం ఆ పార్టీల జెండాలను ఒకేకర్రకు కట్టి నేతలంతా ప్రచారం హోరెత్తిస్తున్నారు. దీంతో ఓటర్లు అయోమయంలో పడిపోయారు. విచిత్ర పొత్తుల నేపథ్యంలో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేక పోతున్నారు.

 గెలిపే లక్ష్యంగా పొత్తు
 జహీరాబాద్ మండలంలో 28 ఎంపీటీసీ పదవులకు గాను కాంగ్రెస్ పార్టీ మొత్తం స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపింది. టీడీపీ మాత్రం 24 స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టింది. ధనాసిరి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ, బీజేపీలు కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిని ఢీకొట్టేందుకు ఆయా పార్టీలు ఏకమయ్యాయి. శేఖాపూర్‌లో మాత్రం కాంగ్రెస్‌కు పోటీగా ఎంఐఎం రంగంలో ఉంది. అక్కడ టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఎంఐఎం అభ్యర్థిని బలపరుస్తున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆయా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ మ ద్దతుదారుడిని ఓడించారు.

 దీంతో ఆ పార్టీలు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే విధానంతో ముం దుకు సాగుతున్నారు. జాడీమల్కాపూర్‌లో సై తం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇక్కడి ఎంపీటీసీ పదవికి గాను కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ టీడీపీ అభ్యర్థి మద్దతు తెలుపుతోంది. ఇక హోతి(కె), పస్తాపూర్ గ్రామాల్లో మాత్రం టీడీపీ తమ అభ్యర్థులను పోటీలో నిలపలేదు. అయితే ఆయా గ్రా మాల్లోని రెండు ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులకు మద్దతునిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు బలమైన అభ్యర్థులు కావడంతో కాంగ్రెస్ పార్టీని చిత్తు చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ, టీ ఆర్‌ఎస్‌లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

 జెడ్పీటీసీకి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి
 ఎంపీటీసీ స్థానాలకు మాత్రం సంయుక్తంగా అభ్యర్థులను నిలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం జెడ్పీటీసీ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. జాడీమల్కాపూర్‌లో ఎంపీటీసి అభ్యర్థికి టీఆర్‌ఎస్ మద్దతునిస్తోంది. అయితే జెడ్పీటీసీ పదవికి వచ్చే వరకు మాత్రం ఆయా పార్టీల ఓట్లు చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. హోతి(కె), పస్తాపూర్ గ్రామాల్లో మాత్రం టీడీపీ, టీఆర్‌ఎస్‌లు స్వతంత్ర అభ్యర్థులకు మద్దతునిస్తున్నా, జెడ్పీటీసీ విషయంలో గందర గోళ పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ అభ్యర్థులు మాత్రం జెడ్పీటీసీ ఓటును ఎవరికి వేయాలో బహిరంగంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 దీంతో టీడీపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు మాత్రం విడివిడిగా వెళ్లి ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధనాసిరి గ్రామంలో ఎంపీటీసీ పదవి కోసంటీఆర్‌ఎస్ అభ్యర్థికి టీడీపీ మద్దతు తెలుపుతోంది. అందులో భాగంగానే టీడీపీ నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే జెడ్పీటీసీ విషయానికొచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థికే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రచారం చేసుకోలేని పరిస్థితి టీడీపీ నేతలకు ఏర్పడింది. ఇలా ఆయా పార్టీల ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు కార్యకర్తలు సైతం జెడ్పీటీసీకి మద్దతు విషయంలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

 దీంతో ఓటర్లు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఆయా పార్టీల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందేమోనని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement