ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా సత్తా.. | Anurag Kejriwal Of Loksatta Party Cought On Sting operation | Sakshi
Sakshi News home page

ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా సత్తా..

Published Sun, Apr 13 2014 1:31 AM | Last Updated on Sat, Mar 9 2019 3:05 PM

ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా సత్తా.. - Sakshi

ఏం కావాలన్నా చేసి పెడతా..ఇదీ మా సత్తా..

రూ. 35 కోట్ల మొత్తానికి అనురాగ్ కేజ్రీవాల్ ఒప్పందం
 కార్పొరేట్ సంస్థ ప్రతినిధులుగా ఓ చానల్ పాత్రికేయుల బేరాలు
 మోడీ ప్రభుత్వంలో జేపీ మంత్రి కావటం ఖాయమన్న అనురాగ్
 ఆయన శాఖలో ఏ పని కావాలన్నా చేస్తామంటూ ‘గ్యారంటీ’
 జేపీ ‘నో కరప్షన్’ నీతి పాఠాలు యువత కోసమేనని వ్యాఖ్యలు
 ఆంధ్రాలో 5 ఎంపీ, 20 అసెంబ్లీ సీట్లు, ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్లకు మొత్తం రూ. 35 కోట్లు పార్టీకి ఇవ్వాలని ఒప్పందం
 ‘ఆపరేషన్ లోక్‌సభ’ స్టింగ్ ఆపరేషన్‌ను బయటపెట్టిన న్యూస్ ఎక్స్‌ప్రెస్.. వీడియో దృశ్యాల ప్రసారంతో లోక్‌సత్తాలో కలకలం
 హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన అనురాగ్.. జేపీతో భేటీ
 అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని జేపీ వెల్లడి
 
 
 ‘‘మోడీ గెలవడం గ్యారంటీ.. 99 శాతం జేపీ మంత్రి కావడం ఖాయం. ఆయన పేరు లిస్ట్‌లో ఉంది. జేపీ మంత్రి అయ్యారనుకోండి.. ఆయన శాఖకు సంబంధించి మీకు ఏ రకమైన ప్రయోజనం కావాలన్నా చేస్తాం. మీ కంపెనీ షార్ట్ లిస్ట్ అయితే ఎలాంటి లెసైన్స్ ఇచ్చేందుకు ప్రమోట్ చేస్తాం. ప్రతి పనికీ ఓ బడ్జెట్ ఉంటుంది. మీరు 2జీ లాంటి స్కాం చేయాలంటే ఆయన చేయడు. మీరు నా చేతుల్లో ఒక లాజికల్ పేపర్ ఉంచారనుకోండి.. జేపీ హామీ ఇస్తారు.. నేను జేపీతో చెప్తాను.. మన వాళ్లకు సాయం చేయాలి అని’’
 
 ‘‘జేపీ గురించి అందరికీ తెలుసు.. టీవీలో మీరు వినే ఉంటారు.. ‘నో కరప్షన్ - నో కరప్షన్’ అనే ఆయన నినాదాన్ని. ‘మీరిలా నీతి పాట పాడితే ఎలా కుదురుతుంది సార్..?’ అని నేను ప్రశ్నిస్తే.. ‘అనురాగ్! నేను యువతకు చెప్తున్నా.. మూర్ఖులు కాకండి అని. అయినా నేను డబ్బు ఇవ్వకుండా ఒక లెసైన్స్ కోసం వారం రోజులు లైన్‌లో నిలబడతానా?’ అని ఆయన బదులిచ్చారు...’’
 
 ‘‘కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఏదైనా పాలసీ వస్తే.. మీరు లాజికల్ పాయింట్ ఇస్తే మేము వ్యతిరేకిస్తాం.. పార్లమెంటులో గొడవ చేయించాలి.. లేదా పాలసీకి వ్యతిరేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఏదైనా సాధ్యం.. మీకు ఏ అవసరం వచ్చినా లెటర్ ఇప్పించగలను. దోపిడీలు చేయించలేము.. కానీ జేబులు కత్తిరిస్తాం...’’
 
 ‘‘ఢిల్లీలో 70 అసెంబ్లీ సీట్ల కోసం రూ. 20 లక్షల చొప్పున కావాలి. అంటే రూ. 14 కోట్లు అవుతుంది. మొత్తం రూ. 25 కోట్లు మా పార్టీ కోసం ఇవ్వాలి. ఆంధ్రాలో 5 పార్లమెంటు సీట్లకు రూ. 70 లక్షల చొప్పున రూ. 3.5 కోట్లు, కనీసం 20 ఎమ్మెల్యే సీట్ల కోసం రూ. 20 లక్షలు చొప్పున రూ. 4 కోట్లు ఇవ్వండి. మొత్తం 32.5 కోట్లు అవుతుంది. రౌండ్ ఫిగర్ రూ. 35 కోట్లు ఇవ్వండి...’’
 
 లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ ‘కార్పొరేట్ సంస్థల’ ప్రతినిధులతో నెరపిన ‘బేరసారా’ల్లో సంభాషణలివి! ప్రముఖ హిందీ వార్తా చానల్ ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తాజా స్టింగ్ ఆపరేషన్‌లో లోక్‌సత్తా నేత ఇలా ఒప్పందం చేసుకుని దొరికిపోయారు. ఆయనను పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్ సస్పెండ్ చేశారు. తాను సరదాగా మాట్లాడిన మాటలను రహస్యంగా చిత్రీకరించారని, పూర్తి సంభాషణలను ప్రసారం చేయకుండా, తమకు అనుకూలంగా కత్తిరించి ప్రసారం చేశారని అనురాగ్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
 
 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్ కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో మంత్రి అవటం ఖాయమని.. ఆయన మంత్రిత్వశాఖలో కార్పొరేట్ సంస్థలకు ఏ పని కావాలన్నా చేసిపెడతామని.. అందుకోసం ఎన్నికల్లో తమ పార్టీకి రూ. 35 కోట్లు ఇవ్వాలని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ మాట్లాడిన దృశ్యాలు స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడటం కలకలం రేపుతోంది.
 
 రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్.. ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణకు, అవినీతి నిర్మూలనకు ఒక ఉద్యమ సంస్థగా ప్రారంభించిన లోక్‌సత్తాను గత ఎన్నికలకు ముందు లోక్‌సత్తా పార్టీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి జేపీ పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలవటమూ విదితమే. తాజా ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో లోక్‌సత్తా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుండటం.. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి జేపీ పోటీ చేస్తుండటం తెలిసిందే. అయితే..ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు సంబంధించి చిన్న పార్టీలు, డమ్మీ అభ్యర్థుల పా త్ర, కార్పొరేట్ సంస్థలతో చీకటి ఒప్పందాలు తదితర అం శాలపై ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తాజాగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ‘ఆపరేషన్ లోక్‌సభ’ పేరుతో వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీడియో దృశ్యాలను ఆ చానల్ శనివారం ప్రసారం చేసింది.
 
 ఇందులో లోక్‌సత్తా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ చేసుకున్న ‘ఒప్పందాన్ని’ కూడా బయటపెట్టింది. ఓ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులుగా చెప్పుకుని పరిచయం చేసుకున్న తమ చానల్ పాత్రికేయులు.. కార్పొరేట్ వర్గాలకు సహాయం చేస్తామంటే ఎన్నికల నిధులు సమకూరుస్తామని లోక్‌సత్తా పార్టీ నేతను సంప్రదించగా ఆయన బుట్టలోపడ్డారని పేర్కొంది. జేపీతో చెప్పి ఏ పని కావాలన్నా చేయిస్తానని ‘గ్యారంటీ’ ఇచ్చారని.. ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేయిస్తానని చెప్తున్న దృశ్యాలను చూపింది. అలాగే.. ‘‘ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే నేను సీఎం అవుతా.. ఇక్కడ కూడా మీరు ఏం చెప్తే అది చేయగలను... ఎన్నికల్లో ఓట్లను చీల్చేందుకు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధం.. దక్షిణ ఢిల్లీ, ఆర్‌కే పురం, కొత్త ఢిల్లీ.. సీట్లూ నా చేతిలోనే ఉన్నాయి’’ అని కూడా అనురాగ్ కేజ్రీవాల్ చెప్తున్న దృశ్యాలనూ ప్రసారం చేసింది. ఇందుకు ప్రతిఫలంగా.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లకు, ఆంధ్రప్రదేశ్‌లోని 5 పార్లమెంటు, 20 అసెంబ్లీ స్థానాలకు మొత్తం రూ. 35 కోట్లు తమ పార్టీకి ఇవ్వాలని ఖర్చు అవుతుందని అనురాగ్ కేజ్రీవాల్ డీల్ చేసుకున్న వీడియో దృశ్యాలను ఆ చానల్ చూపింది.
 
 ఆయనను సస్పెండ్ చేశాం: జేపీ
 
 న్యూస్ ఎక్స్‌ప్రెస్ స్టింగ్ ఆపరేషన్ లోక్‌సత్తా పార్టీలో కలకలం సృష్టించింది. అనురాగ్ కేజ్రీవాల్ శనివారం ఉదయం హడావుడిగా హైదరాబాద్ చేరుకుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో సమావేశమయ్యారు. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. జయప్రకాష్ నారాయణ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరులు ‘స్టింగ్ ఆపరేషన్’ గురించి ప్రస్తావించగా.. మొదట దీని గురించి ఏమీ తెలియదని అంటూనే, ఆ కొద్దిసేపటికే అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అనురాగ్ క్రేజీవాల్ డబ్బులు వసూలు చేశారంటున్నారని అడిగిన ప్రశ్నకు.. ‘ఆయన డబ్బులు వసూలు చేశారా?’ అంటూ సదరు విలేకరిని జేపీ రెట్టించారు. ‘‘జేపీ ఎన్నికలలో గెలవడానికి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తే మీకు తెలియదా? అంతా విచిత్రంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. పార్టీకి నిధుల సేకరణ చెక్కుల రూపంలో జరుగుతుందని.. పార్టీ విరాళాలకు సంబంధించిన వివరాలను ఎవరైనా పరిశీలించుకోవచ్చని బదులిచ్చారు.
 
 సంభాషణలు కత్తిరించారు: అనురాగ్ కేజ్రీవాల్
 
 కార్పొరేట్ సంస్థ ప్రతినిధులుగా వచ్చిన వారు తమ పార్టీకి ఫైనాన్స్ చేస్తామన్నారని, అయితే లోక్‌సత్తా పెద్ద పార్టీ కాదని, అయినా తమ పార్టీకి ఎందుకు ఫైనాన్స్ చేయాలనుకుంటున్నారని, మద్దతు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని తాను వారిని అడిగానని అనురాగ్ కేజ్రీవాల్ ‘సాక్షి’తో ఫోన్‌లో పేర్కొన్నారు. స్టింగ్ ఆపరేషన్‌పై వివరణ కోసం ‘సాక్షి’ సంప్రదించినపుడు.. మీడియా ప్రతినిధులు తమ మధ్య జరిగిన పూర్తి సంభాషణలు లేకుండా, వారికి అవసరమయ్యే విధంగా కత్తిరించి, మార్పుచేర్పులు చేసి ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. సరదాగా మాట్లాడిన వాటిని కూడా రహస్యంగా చిత్రీకరించి ప్రసారం చేశారని వాపోయారు. పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానన్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో అనురాగ్ క్రేజీవాల్ మాట్లాడిన మాటలను ఎడిట్ చేశారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఆరోపించారు. అనురాగ్ క్రేజీవాల్ తమ పార్టీ బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి అని, ఆయనపై ఇప్పుడు ఆరోపణలు రావడం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
 
 డమ్మీ అభ్యర్థుల దందాపై ‘స్టింగ్’
 
 న్యూస్ ఎక్స్‌ప్రెస్ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్ పార్టీలకు దడపుట్టిస్తోంది. ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే ఈ చానల్‌కు చెందిన బృందం అనేక అవతారాలు ఎత్తి ‘ఆపరేషన్ లోక్‌సభ’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది. ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులు కొందరు గెలవడానికి పోటీచేస్తే.. కొందరు ఓడిపోవడానికి పోటీచేస్తారని, మరికొందరు ప్రత్యర్థి ఓట్లను చీల్చేందుకు పోటీచేస్తారని, ఇంకొందరు ప్రధాన అభ్యర్థికి డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని.. వీరిని పోటీచేయించే వారు తెర వెనక ఉంటారని.. ఈ మొత్తం ‘మ్యాచ్ ఫిక్సింగ్’లలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయని ఈ స్టింగ్ ఆపరేషన్ కథనాల సారాంశం. ఇందులో పలు పార్టీల నేతలు ప్రత్యర్థుల ఓట్లను ఎలా చీల్చారో వారితోనే టీవీ చానల్ చెప్పించింది.
 
 బలమైన ప్రత్యర్థి ఉన్న చోట ఆ ప్రత్యర్థి పేరును పోలిన వారిని డమ్మీలుగా నిలబెట్టిన వైనాన్ని టీవీ కథనం వివరించింది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ నేత అశుతోష్ నిలిచిన చోట అదే పేరుతో మరో అభ్యర్థిని నిలబెట్టడం, హేమామాలిని నిలుచున్న చోట అదే పేరు ఉన్న మరికొందరు అభ్యర్థులను నిలబెట్టడం వంటి చర్యలు వెల్లడయ్యాయి. అలాగే బీఎస్పీ కూడా రాజస్థాన్‌లో ప్రత్యర్థులకు సంబంధించి డ మ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఈ కథనాలు ఆరోపించాయి. తాజా స్టింగ్ ఆపరేషన్‌లో లోక్‌సత్తా పార్టీతో పాటు, రాష్ట్రీయ లోక్‌దళ్ వంటి వాటితో పాటు.. వంచిత్ సమాజ్ ఇన్సాఫ్ పార్టీ, నయాదౌర్ పార్టీ వంటి చిన్నాచితకా పార్టీల పాత్రను, కొందరు పెద్ద పార్టీల అభ్యర్థుల ధన లోలతను స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement