ఆరోపణలపై విచారణకు సిద్ధం: జేపీ
అనురాగ్ కేజ్రీవాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వెల్లడి
హైదరాబాద్: అనురాగ్ కేజ్రీవాల్‌పై స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో.. లోక్‌సత్తా పార్టీ మీద వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్‌ది క్షమార్హం కాని ప్రవర్తన అని పేర్కొంటూ.. అందుకుగాను ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించామని వెల్లడించారు.
లోక్‌సత్తాపార్టీ ఇంత బాధ్యతాయుతంగా స్పందించినా మీడియాలో ఒక వర్గం, చానళ్లు లోక్‌సత్తా ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించాయంటూ జేపీ తప్పుపట్టారు. ఇదిలా ఉండగా లోక్‌సత్తా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర శ్రీవాస్తవ ఆదివారం ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించిన అనురాగ్ కేజ్రీవాల్‌ను తక్షణం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్టు తెలిపారు. పార్టీ ఢిల్లీ శాఖ కమిటీని రద్దు చేసి.. కొత్తగా ఐదుగురు సభ్యులతో తాత్కాలిక ప్యానల్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.