
అరుణ్... అమరీందర్ ... ఓ అమృతసర్
అది నిరంతరం తుపాకీ మోతలతో దద్దరిల్లే భారతపాక్ సరిహద్దు నియోజకవర్గం. తమాషా ఏమిటంటే ఇప్పుడు సరిహద్దుల్లో కాదు... నియోజకవర్గంలోనే రాజకీయ యుద్ధవాతావరణం నెలకొంది. ఆ నియోజకవర్గమే సిక్కులకు అతి పవిత్రమైన అమృతసర్ లోకసభ నియోజకవర్గం.
సిక్కు రాజకీయాలకు, ముఖ్యంగా అకాలీ రాజకీయాలకు సింబాలిక్ కేంద్రమైన అమృతసర్ లో గత రెండు సార్లు గా సిక్కు ఎంపీగా గెలుస్తూ ఉన్నారు. కానీ ఆయన అకాలీ దళ్ ఎంపీ కాదు. ఆయన అకాలీల మద్దతుతో గెలిచిన బిజెపి ఎంపీ నవజోత్ సింగ్ సిద్దు. ఈ సారి మాత్రం సిద్ధు క్రికెట్ లో బిజీగా ఉన్నారు తప్ప రాజకీయాల్లో కాదు.
అమృతసర్ నియోజవర్గం ఈ సారి వార్తల్లోకెక్కడానికి ప్రధాన కారణం బిజెపి రాజ్యసభ పక్ష నేత అరుణ్ జైట్లీ ఇక్కడనుంచి పోటీ చేయడమే. అరుణ్ జైట్లీ ఇప్పటి వరకూ రాజ్య సభ రూట్లోనుంచే ఎన్నికవుతూ వచ్చారు. లోకసభకు పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, పటియాలా మహారాజు అమరీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరే కాక ఆప్ తరఫున డా. దల్జీత్ సింగ్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ప్రధానపోటీ జైట్లీ, అమరీందర్ ల మధ్యే ఉంటుందన్నది సుస్పష్టం.
అమరీందర్ సూటి విమర్శల స్పెషలిస్ట్. కానీ జైట్లీ రాజకీయాల్లోనూ, లాయర్ గానూ ఉద్దండ పిండం. అందుకే ఇద్దరి మధ్యా మాటల తూటాలు తెగపేలి, రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపుచెక్కతో నేనొకటిస్తా అన్నట్టు వాగ్వాదాలు జరుగుతున్నాయి.
అసలు అరుణ్ జైట్లీ లోకల్ కాదని, స్థానికేతరుడని అమరీందర్ అస్త్రం సంధిస్తే, నేను కనీసం ఇండియన్ ని, మీ అధినేత్రి ఏ దేశం నుంచి వచ్చిందని జైట్లీ మరో బాణం విసిరారు. 'నేను లోకల్ కాను సరే. మరి నువ్వూ పటియాలా వాడివే కదా.' అంటూ అమరీందర్ ను ఎత్తిపొడిచారు. 'అసలు మీరిద్దరూ నాన్ లోకల్. నేనొక్కడినే లోకల్' అంటున్నారు ఆప్ అభ్యర్థి.
వాగా అటారీలు మూగబోయేలా కొనసాగుతున్న ఈ రాజకయ రచ్చతో అమృత్ సర్ ఇప్పుడు అదిరిపోతోంది.