
బాబు డబుల్ గేమ్ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గిరిజనుడు నిమ్మక జయరాజ్‌పై చంద్రబాబు చిన్న చూపు చూశారా? ఆయనేం చేయలేరనే సస్పెండ్ చేశారా? తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కెంబూరి రామ్మోహనరావును చూసి భయపడ్డారా? ఆయనపై చర్యలు తీసుకుంటే ఆ సామాజిక వర్గం తిరగబడుతుందని భయాందోళన చెందారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టీడీపీ రెబల్స్‌గా నామినేషన్ వేసిన వారిపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించారు. కాకపోతే, ఇందులో వివక్ష చూపించారు. జిల్లాలో ఇక్కడ ఇద్దరు రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో ఒకరు నిమ్మక జయరాజ్, మరొకరు కెంబూరి రామ్మోహనరావు. అయితే, వీరిలో జయరాజ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోగా కెంబూరి రామ్మోహనరావుపై ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో టీడీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గిరిజనుడని జయరాజ్‌పై చర్యలు తీసుకున్నారని, బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కెంబూరి రామ్మోహనరావుపై చర్యలు తీసుకోలేదన్న వాదన విన్పిస్తోంది. నిజమైన గిరిజనులకు చంద్రబాబు అన్యాయం చేస్తూనే వస్తున్నారు.
పదేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న మాజీ ఎంపీ డీవీజీ శంకరరావుకు మొండి చేయి చూపారు. ఐదేళ్లుగా సాలూరు ఎమ్మెల్యే టిక్కెట్‌పై ఆశలు పెట్టుకుని పనిచేసిన గుమ్మడి సంధ్యారాణిని కాదని, కుల వివాదంతో ఇబ్బందిపడ్డ ఆర్.పి.భంజ్‌దేవ్‌ను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చి టిక్కెట్ ఇచ్చారు. దీంతో అయిష్టంగా సంధ్యారాణి అరకు పార్లమెంట్‌కు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఉన్న మరో ఎస్టీ రిజర్వు స్థానమైన కురుపాంలో పదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న గిరిజన నేత నిమ్మక జయరాజ్‌కు చంద్రబాబు అన్యాయం చేశారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు టిక్కెట్ ఇచ్చారు. థాట్రాజ్‌కు కులవివాదం ఉన్నా అవేవి చంద్రబాబు పట్టించుకోలేదు.
ఇక, చీపురుపల్లిలో స్థానికం గా ఉన్న వారిని కాదని, తనకు ప్రత్యర్థిగా ఉన్న కిమిడి మృణాళినికి టిక్కెట్ ఇచ్చారన్న ఆగ్రహంతో కెంబూరి రామ్మోహనరావు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. అయితే, వీరిద్దరిని బుజ్జగించేం దుకు జిల్లా నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్సీ ఇతరత్రా పదవులు ఇస్తామని ప్రలోభాలు పెట్టింది. చంద్రబాబునాయుడు సైతం నేరుగా మాట్లాడారు. అనేక ఆశలు చూపిం చారు. అసలు అధికారంలోకి వచ్చేదెక్కడ? అదే లేనప్పుడు పదవులెక్కడొస్తాయి? ఎందుకొచ్చిన మోసపూరిత హామీలు అని రెబల్ అభ్యర్థులు తిరస్కరించారు. రాజీకీ రాకపోవడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా తలొగ్గలేదు.
ఒకరిపైనే వేటు..
ఎంతకీ దారికి రాకపోవడంతో టీడీపీ అధినేత రెబల్స్‌పై చర్యలకు ఉపక్రమించారు. కాకపోతే, చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపారు. ఎటువంటి ఒత్తిడి ఉండదని, ప్రభావం చూపలేరన్న ఉద్దేశంతో గిరిజనుడైన నిమ్మక జయరాజ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, చీపురుపల్లిలో రెబల్‌గా బరిలో ఉన్న కెంబూరి రామ్మోహనరావుపై చర్యలు తీసుకోలేదు. దీనికంతటికీ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడమే కారణమని తెలుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకుంటే ఆ సామాజిక వర్గం తిరగబడుతుందన్న భయంతో వెనుకడుగువేసినట్టు తెలుస్తోంది.
మండిపడుతున్న గిరిజన వర్గాలు
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై గిరిజన వర్గాలు మండిపడుతున్నాయి. మొన్న డీవీజీ శంకరరావు, నేడు నిమ్మక జయరాజ్‌కు అన్యాయం చేసి పలు అభియోగాలు, ఆరోపణలు ఉన్న నేతలకు టిక్కెట్లు ఇచ్చి మోసగించారని, ఈ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశాయి. ఈమేరకు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.