మేనిఫెస్టోలు మార్చినట్టు.. ఓటర్లను ఏమార్చగలరా! | Chandrababu naidu not fulfill his promise | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టోలు మార్చినట్టు.. ఓటర్లను ఏమార్చగలరా!

Published Sun, Apr 6 2014 11:22 PM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

మేనిఫెస్టోలు మార్చినట్టు.. ఓటర్లను ఏమార్చగలరా! - Sakshi

మేనిఫెస్టోలు మార్చినట్టు.. ఓటర్లను ఏమార్చగలరా!

ఎన్నికల మేనిఫెస్టో... అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు రాజకీయ పార్టీల ప్రధాన సాధనం.

ఎన్నికల మేనిఫెస్టో... అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు రాజకీయ పార్టీల ప్రధాన సాధనం. ఒక ఎన్నికల్లో చెప్పింది మరో ఎన్నికల్లో చెప్పకుండా ఎడాపెడా వాగ్దానాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలకు అర్థాన్నే మార్చేశారు. హామీల చిట్టానే మేనిఫెస్టోగా మార్చిన ఘనత ఆయనది. ఆయన గతంలో ఇచ్చిన హామీలు ప్రస్తుతం సోదిలోకే రావు. ప్రస్తుతం ఇస్తున్న హామీలకు భవిష్యత్తులో ఎలాంటి భరోసా ఉండదు.  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలను, తాజాగా 2014 ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోతో పోల్చి చూస్తే అసలు సంగతి ఇట్టే అర్థమవుతుంది...
 
 పోలంపల్లి ఆంజనేయులు/ కె.జి.రాఘవేంద్రరెడ్డి: వ్యవసాయానికి పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తానని 2009 మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానని అంటున్నారు. అధికారంలోకి రాకముందే హామీని బుట్టదాఖలు చేసిన బాబు... రేపు అధికారంలోకి పొరపాటున వస్తే ఉచిత విద్యుత్ గతి ఏమిటనే రైతాంగం ఆందోళన చెందుతోంది.

* వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే మొదట్లో హేళన చేసిన బాబు, తీరా అమలు చేసిన తర్వాత అసలు విషయం బయటపెట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, లేదంటే అమలు చేసేవాడినని సెలవిచ్చారు. ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులూ కరెంటు బిల్లులు కట్టని రైతులపై కేసులు పెట్టారు. కరెంటు చార్జీలను తగ్గించమంటే బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలను హార్స్‌పవర్ (హెచ్‌పీ)కి రూ.50 నుంచి 250కు పెంచారు.
 నగదు బదిలీ ఏమైందో..?
 
* ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదాయంలో నిరుపేద, పేద, మధ్యతరగతి వర్గాలకు వాటా కల్పించడమే ‘నగదు బదిలీ’ అని గొప్పగా 2009 మేనిఫెస్టోలో బాబు బృందం నిర్వచించింది. ఈ పథకం కింద కుటుంబ మహిళా పెద్ద పేరుమీద బ్యాంకు ఖాతా తెరచి ప్రతి నెలా నిరుపేదలకు 2 వేలు, పేదలకు రూ.1500, మధ్యతరగతికి వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తామని ఇందులో ప్రకటించారు. ఈ ‘సర్వరోగ నివారిణి’కి తాజా మేనిఫెస్టోలో స్థానం దక్కలేదు.

‘ఛార్జీల’ బాదుడు మరిచారా?
 చేనేత వర్గాలు, ప్రార్థనా మందిరాలు, కులవృత్తులు, వీధి దీపాలకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని తాజాగా బాబు ప్రకటించారు. వాస్తవానికి బాబు హయాంలో 9 ఏళ్లల్లో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. తన గత చరిత్ర ఘనతను ఏ‘మారుస్తూ’ కొత్త హామీలతో మభ్య పెట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.

జనతా వస్త్రాలు మళ్లీ గుర్తొచ్చాయి...!
 తక్కువ ధరకే చేనేత వస్త్రాల సరఫరా కోసం జనతా వస్త్రాల పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఆయనకు వెన్నుపోటు పొడవడంతో పాటు ఈ పథకాన్ని కూడా బాబు ఎత్తివేశారు. తాజాగా మళ్లీ జనతా వస్త్రాల పథకాన్ని ప్రస్తావిస్తున్నారు.

 ‘బెల్ట్’ తీస్తారట...
1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లో నిషేధాన్ని ఎత్తేయడమే కాకుండా, ఊరూరా బెల్టు షాపులను ఏర్పాటు చేశారు.అలాంటిది, ఇప్పుడు బెల్టు షాపులను రద్దు చేస్తానని నమ్మబలుకుతున్నారు.

పింఛను హామీ నమ్మేదెలా..
వృద్ధులకు, వికలాంగులకు పింఛను మొత్తాన్ని పెంచుతానని బాబు అంటున్నారు. బాబు హయాంలో నెలకు కేవలం 75 రూపాయలు మాత్రమే పింఛను ఇచ్చేవారు.కొత్త పింఛను రావాృంటే ఎవరో ఒకరు చనిపోతే కానీ వచ్చేది కాదు. వైఎస్ హయాంలోనే పింఛను మొత్తం రూ.500కు పెరిగింది. అధికారంలో ఉండగా, వారి బాధలను పట్టించుకోని బాబు ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేస్తానని ప్రకటిస్తే నమ్మేదెవరు?  
 

కొత్త వ్యవసాయ కనెక్షన్లకు ‘కోత’
ఏటా 50 వేల ఉచిత వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేస్తానని బాబు గొప్పగా ప్రకటించారు. నిజానికి ప్రస్తుతం ఏడాదికి లక్షన్నర ఉచిత వ్యవసాయ కనెక్షన్లను జారీచేస్తున్నారు. ఇది వైఎస్ ప్రవేశపెట్టిన పథకం. 2004 నుంచి ఇది అమలవుతోంది. అయితే, బాబు అధికారంలోకి  వస్తే వీటిని 50 వేలకు తగ్గిస్తారట.  

మాఫీ అయిన రుణాలు మళ్లీ మాఫీ చేస్తారట!
నేత వృత్తి గిట్టుబాటుకాక ఆత్మహత్యల బాట పట్టిన చేనేత కార్మికుల ఉసురు పోసుకున్న బాబు.. ఇప్పుడు మాఫీ అయిన రుణాలను మళ్లీ మాఫీ చేస్తానంటున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు హయాంలో మరణించిన చేనేత కార్మికులకు కూడా నష్టపరిహారం అందించారు. వీరికి వృద్ధాప్య పింఛను పొందేందుకు వయస్సును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకే తగ్గించారు. ఈ రుణాలను మాఫీ చేస్తానని 2009 ఎన్నికల్లోనే వైఎస్ ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.317 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం చేనేత రుణాలు మాఫీ అయ్యాయి. మాఫీ అయిన రుణాలను మళ్లీ ఎలా మాఫీ చేస్తారో బాబుగారే చెప్పాలి.

గిరిజనులకు రూ. 5 లక్షల వరకు రుణాలు
ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వారందరికీ కోటి రూపాయల వరకూ పూచీకత్తు లేని రుణాలను ప్రస్తుతం అందిస్తున్నారు. దీనికి రూ.5 కోట్ల వరకు పూచీకత్తు లేని రుణం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్ ప్రయత్నించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కోటి రూపాయల మేరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తుంటే దీనిని రూ.5 లక్షలకే పరిమితం చేసే కుట్రకు బాబు పన్నాగం పన్నుతున్నారు.

నాడు ఉద్యోగాలు ఊడగొట్టి...
 రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉన్నాయి. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నమాట. అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వరంగాన్ని కలుపుకున్నా ఇది సాధ్యం కాదు. మరోవైపు తన హయాంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడేమో ఇంటికో ఉద్యోగం అంటూ మభ్యపెడుతున్నారు.
 
కలర్ టీవీల పథకం
* టీవీ అంటే కేవలం వినోదానికే పరిమితం అనుకుంటే పొరపాటు అని టీవీల ద్వారా విద్య, వినోదం, ఆరోగ్యం తదితర కార్యక్రమాలు ప్రతీ రోజూ ప్రసారమవుతాయని 2009 మేనిఫెస్టోలో టీడీపీ లెక్చరర్లు దంచింది. అయితే, 2014 వచ్చే సరికి లెక్చరర్లు అన్నీ కట్టిపెట్టింది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో తనకు తానే సాటి అని బాబు మరోసారి నిరూపించుకున్నారు.
    

* ప్రతి పేద కుటుంబానికి 20 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తానని 2009లో అన్నారు. అది కాస్తా తాజా మేనిఫెస్టోలో మరిచారు.
* నిరుపేదలకు కిరోసిన్ కోటాను 10 లీటర్ల నుంచి 15 లీటర్లకు పెంచుతామన్నారు. దీనిని కాస్తా మంటల్లో తగలెట్టేశారు.
పేద కుటుంబాలకు ఒక టీవీ, రెండు బల్బులు, రెండు ఫ్యాన్లకు ఉచిత కరెంటు అన్నారు. ఇప్పుడేమో విస్మరించారు.
* సాగునీటి సెస్సు బకాయిలు రద్దు, సాగు నీటి సెస్సు రద్దు అన్నారు. ఇవి తాజా మేనిఫెస్టోలో లేవు.
* వ్యవసాయ భూములపై రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతం మించకుండా నియంత్రించడం, మహిళల పేరిట జరిగే రిజిస్ట్రేషన్లపై 2 శాతం రాయితీ అన్నారు. దీనినీ అటకెక్కించారు.
* ఈ విధంగా ఇచ్చిన హామీలను వెంటనే మరచిపోయే అలవాటు తనకు ఉందని బాబు మరోసారి నిరూపించుకున్నారు.
 
ఉద్యోగులకు వల
అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను రాచిరంపాన పెట్టిన చరిత్ర బాబుది. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేటు ఉద్యోగులే బెటరని మనసా, వాచా, కర్మణా నమ్మిన వ్యక్తి ఆయన. 2009 ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే అనుమానంతో ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. అటువంటి బాబు... వారికి పదవీ విరమణ వయసు పెంపు, వారంలో ఐదురోజుల పనిదినాలంటూ వలలో వేసుకునేందుకు పన్నాగం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement