
'పునీతం కావడానికి చంద్రబాబు ఏమైనా గంగానదా?'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత చిరంజీవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత చిరంజీవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేర చరిత్ర ఉన్న నేతలను పార్టీలో చేర్చుకున్న బాబుకు కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి లేదని చిరు మండిపడ్డారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా విజయవాడలో ప్రసంగించిన ఆయన.. నేర చరిత్ర ఉన్న వారిని బాబు పార్టీలో చేర్చుకుని అవినీతిని అంతమొందిస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నేర చరిత్ర ఉన్న నేతల్ని పునీతం చేయడానికి ఆయనమైనా గంగానదా అంటూ నిలదీశారు. ముస్లింలకు నాలుగు సీట్లిస్తానని ఒక్క సీటుకూడా ఇవ్వలేదన్న సంగతిని చిరంజీవి గుర్తు చేశారు. జిల్లాకో ముస్లింకి సీటు కేటాయిస్తానని చెప్పిన బాబు..హిందూపురం ముస్లిం సీటును బాలకృష్ణకు కట్టబెట్టారన్నారు.
అలాగే బీసీలకు 100సీట్లిస్తాన్న చంద్రబాబు మాటతప్పారని చిరు విమర్శించారు. కార్పొరేట్ ఏజెంట్లు చంద్రబాబు వెనకున్నారన్నారు. సీడబ్యూసీ నిర్ణయానికి ముందే... విభజన విషయం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసన్నారు. వాస్తవాలు వివరించకుండా సమైక్యఉద్యమాన్నికిరణ్ రెచ్చగొట్టారన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వ్యక్తి కేంద్రంగా ఎదగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చిరంజీవి తెలిపారు.