
'చిరంజీవి ఇమేజ్ అంతగా దిగజారిపోయిందా?'
ఆయనను చూడటానికి ఒప్పుడు జనం క్యూ కట్టేవారు. ఆయన వస్తున్నాడంటే ఎండనకా వాననకా గంటలకొద్ది వేచి చూసేవారు.
శ్రీకాకుళం : ఆయనను చూడటానికి ఒప్పుడు జనం క్యూ కట్టేవారు. ఆయన వస్తున్నాడంటే ఎండనకా వాననకా గంటలకొద్ది వేచి చూసేవారు. ఆయన్ని చూస్తే అభిమానులు ఉప్పొంగిపోయేవారు. కానీ ఆయన రాజకీయ రంగప్రవేశం చేశాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన వస్తున్నారన్నా జనం పట్టించుకోవడం లేదు. కనీసం ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు.
ఒకప్పుడు వేలల్లో వచ్చిన వారు ఇప్పుడు కనీసం వందల్లో కూడా రావటం లేదు. ఆయన ఇమేజ్ అంతగా దిగజారిపోయింది మరి. ఆయన ఇంకెవరో కాదు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్, ప్రస్తుతం కేంద్రమంత్రి చిరంజీవి, ఆయన శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నా పెద్దగా జనం పట్టించుకోవడం లేదు.
చిరంజీవి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం, పలాస, తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించారు. ఎక్కడా ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరు కాలేదు. ఆయన పర్యటనలో ఎక్కడా ఎక్కువసేపు ప్రసంగించకపోవడంతో హాజరైన అతి కొద్దిమంది కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రసంగించిన తీరు కూడా ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.