స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలి
స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
పుత్తూరు, న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కోవాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిండ్ర మండలం కొప్పేడు గ్రామం లో షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడనుందని, అందుకే అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. 25 ఎంపీ స్థానాలు దక్కించుకుంటే కేంద్రంలోనూ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలను ప్రభావితం చేయగలరన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రారంభంలోనే జెడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి పార్టీలో చేరినట్టు గుర్తుచేశారు. కొప్పేడుతో ఉన్న అనుబంధాన్ని పెద్దిరెడ్డి గుర్తుచేసుకున్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం శ్రమించే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.
మహానేత మృతిపై ఇప్పటికీ అనుమానాలే: రోజా
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. కాంగ్రెస్ పాలకులు దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. రెడ్డివారి భాస్కర్‌రెడ్డి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భీరేంద్రవర్మ, జిల్లా స్టీరిం గ్‌కమిటీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, లక్ష్మీపతి రాజు, శ్యాంలాల్, పార్టీ మండల కన్వీనర్ మనోహర్‌నాయుడు, పుత్తూరు నాయకులు మహేంద్రన్‌రెడ్డి, మైనారిటీ నాయకుడు మాహిన్ పాల్గొన్నారు.