విజన్ ఉన్న నేత జగన్ | development on the state in ys jagan hands | Sakshi
Sakshi News home page

విజన్ ఉన్న నేత జగన్

Published Fri, Mar 28 2014 2:24 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

విజన్ ఉన్న నేత జగన్ - Sakshi

విజన్ ఉన్న నేత జగన్

తెనాలిరూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రాభివృద్ధిపై ఓ దృక్పథం, ఓ విజన్ ఉన్న నేత ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. చంద్రబాబుకు విజన్ ఉందంటూ ఓ వర్గం మీడియా, కొందరు నాయకులు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు.
 
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన చంద్ర బాబు తెలుగు జాతిని విడదీసిన ఘనతను మూటగట్టుకున్నారని ఆరోపించారు. కొత్తపేటలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలశౌరి మాట్లాడారు. చంద్రబాబుకు విజన్ ఉంటే వందేళ్లకు పైగా కృష్ణాడెల్టా రైతాంగం పోరాడిన పులిచింతల ప్రాజెక్టును తన హయాంలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
 
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టత, విజన్ ఉండబట్టే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. యలమంచిలి శివాజీ వంటి నేతలు పులిచింతల విషయమై మాట్లాడేందుకు వెళితే చంద్రబాబు
వారిని దుర్భాషలాడి పంపేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పులిచింతల పూర్తి కావడం వల్లే డెల్టా రైతాంగానికి కొంత ఊరట లభించిందన్నారు.  
 
2009 సాధారణ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండు పార్లమెంటు, 53 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే, టీడీపీ దాదాపు 35 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని, ఏ ఒక్క స్థానంలోనూ గెలవలేదని గుర్తు చేశారు. అలాంటిది బలం పుంజుకున్నాం, పైకి వెళుతున్నామంటూ చంద్రబాబు సహా టీడీపీ నాయకులు ప్రకటించుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనంగా చెప్పారు. 2009లోనూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేక మహాకూటమిగా ఏర్పడ్డారనీ, అయినా వైఎస్ చేతిలో పరాజయం పాలు కాక తప్పలేదని, తిరిగి ఇప్పుడు బీజేపీ, శివసేన, లోక్‌సత్తా వంటి పార్టీలతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడాన్ని గమనిస్తే టీడీపీ ఏ మేరకు బలం పుంజుకుందో అర్థమవుతుందన్నారు.
 
మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించబోతుందనీ, సీమాంధ్రలోనే 130కుపైగా సీట్లను సాధిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, పట్టణ కన్వీనర్ ఈఎస్‌ఆర్‌కే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆలమూరి విజయలక్ష్మీకుమారి,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement