సొంత గూటికి వెళ్లిపోతారా?
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ముహుర్తానా పార్టీ పెట్టారోగానీ ఆయన తప్ప అందులో ఎవరూ మిగిలేట్టు కనబడడంలేదు. చివరి బంతి వేసి విభజనకు విష్ణుచక్రం అడ్డువేస్తానని బీరాలు పలికి తుస్సుమనిపించిన నల్లారివారు నిదానంగా సీఎం సీటు దిగిపోయి జై సమైక్యాంధ్ర అంటూ సొంత దుకాణం తెరిచారు. తనతో పాటు అధికారం దర్పం వెలగబట్టిన వారంతా తనవెంట వచ్చేస్తారని ఆశించారు.
ఆరంభంలోనే కథ అడ్డం తిరిగింది. ఆయన పార్టీ పెట్టక ముందే మంత్రులు జారుకున్నారు. మరికొందరు పార్టీ పెట్టాక గోడ దూకేశారు. పార్టీ పదవుల్లో ఉండగానే ఫిరాయించడంతో కిరణ్ అవాక్కయ్యారు. ఇప్పుడు ఆయన వెంట ఉన్న ఎంపీలు కూడా హస్తం గూటికి చేరే అవకాశం కన్పిస్తోంది. పార్టీలోకి తిరిగి రావాలని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆహ్వానం పలికారు. అంతేకాదు ఆయనపై విధించిన బహిష్కరణ కూడా ఎత్తేస్తామని హామీయిచ్చారు. జేడీ శీలం, పనబాక లక్ష్మి, బాలరాజు, రఘువీరారెడ్డితో కూడా హర్షకుమార్తో మాట్లాడించారు.
హర్షకుమార్తో పాటు మిగతా ఎంపీలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. కిరణ్ వెంట ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు సుముఖంగానే ఉన్నట్టు కనబడుతోంది. కిరణ్ కూడా తన పార్టీని కాంగ్రెస్లో కలిపేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు.