ఎన్నికల నిధులు విడుదల చేయండి: భన్వర్‌లాల్
సీఎస్ మహంతికి సీఈఓ భన్వర్‌లాల్ వినతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ నిధులు వెంటనే విడుదల చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మహంతిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ కోరారు. ఆయన సోమవారం సీఎస్‌తో సమావేశమై నిధులు విడుదల, బిల్లుల సమర్పణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆర్థిక శాఖ ఇప్పటివరకు రెండు విడతలుగా రూ.400 కోట్లు విడుదల చేసింది.
ఎన్నికల ఏర్పాట్లు, సామగ్రికయ్యే ఖర్చులతోపాటు ఎన్నికల సిబ్బందికిచ్చే రెమ్యునరేషన్, టీఎ, డీఏలను మంజూరు చేయాల్సి ఉన్నందున, మరో రూ. 300 కోట్లు ఇవ్వాలని సీఈవో కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, జూన్ 2న రాష్ట్ర విభజన జరుగుతున్నందున, ఉమ్మడి రాష్ట్రంలో మే 15వ తేదీకల్లా బిల్లులను సమర్పించాలని ఆర్థిక శాఖ తెలిపింది.
ఆలోగా వచ్చిన బిల్లులకు మాత్రమే మే 24 లోగా చెల్లింపులు చేస్తామని, ఆ తరువాత చెల్లింపులు చేయబోమని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఎన్నికల బిల్లులకు ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో సీఈవో భన్వర్‌లాల్ సీఎస్‌ను కలిసి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అంతకుముందు రోజే బిల్లులు సమర్పించడం సాధ్యం కాదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతున్నందున ఉమ్మడి రాష్ట్రంలోనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఎన్నికల బిల్లులు ఎవరు చెల్లించాలనే సమస్య తలెత్తుందని వివరించారు.