చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగు మున్సిపాలిటీలకు, రెండు నగర పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగు మున్సిపాలిటీలకు, రెండు నగర పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. జిల్లాలో సగటున 77.09 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. అత్యధికంగా ప్రజ్ఞాపూర్-గజ్వేల్ నగర పంచాయతీలో 83.39 శాతం పోలింగ్ కాగా, అత్యల్పంగా మెదక్‌లో 76.31 శాతం ఓట్లు పోలయ్యాయి. మెదక్‌లో 8,16 వార్డుల్లో, జోగిపేటలో 1,16 వార్డుల్లో, సంగారెడ్డిలో 20, 22 వార్డుల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
కాంగ్రెస్ అభ్యర్థి బొంగుల విజయలక్ష్మి భర్త రవి, టీఅర్‌ఎస్ అభ్యర్థి మనోరంజని భర్త వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగారు. 10వ వార్డు పోలింగ్ కేం ద్రంలో వీళ్లిద్దరూ బాహాబాహీకి దిగడంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇక్కడ పట్టణ సీఐ శివశంకర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా ఒక వర్గం వ్యక్తిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం, అదే వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జ్యోతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని శివశంకర్ అకారణంగా అడ్డుకొని, ఆమెను అరెస్టు చేసి జీపులో పోలీసుస్టేషన్‌కు తలించడం పట్ల మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆమె టీఅర్‌ఎస్ అభ్యర్థికి బంధువు కావడమే అరెస్టుకు కారణమని ప్రచారం జరిగింది. ఈ గొడవను ‘సాక్షి టీవీ’ ప్రసారం చేయటంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి స్పందించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని సూచించడంతో పోలీసులు బొంగుల రవి, వెంకటేశ్వర్లు మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
టీడీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి గృహనిర్బంధం
గజ్వేల్ నగర పంచాయతీలో పోలింగ్ కేంద్రాలవద్ద పోలీసుల అతి ప్రవర్తన వల్ల వృద్ధులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులను త్వరగా నడవాలంటూ తోసివేయడంతో పలువురు మండిపడ్డారు. కాగా ప్రజ్ఞాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించాడనే కారణంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి కుమారుడు విజయవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ ప్రతాప్‌రెడ్డి గజ్వేల్ పోలీస్‌స్టేషన్ వద్ద డీఎస్పీ శ్రీధర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అతని ఇంటికి తీసుకువెళ్లి గృహ నిర్బంధం చేశారు. మెదక్‌లో 2వ వార్డు అభ్యర్థి అశోక్‌పై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు.
కొత్త ఓటర్ల నిరాశ....
కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలను సకాలంలో ఓటరు జాబితాలో పొందుపరచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. తమ వద్దనున్న జాబితాలో కొత్త ఓటర్ల పేర్లు ఉండగా... పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చిన జాబితాలో వారి పేర్లు లేకపోవడం వివాదంగా మారింది. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 2000 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.