
‘కోడ్’లేని ఫైళ్లే పంపండి
న్నికల ప్రవర్తనా నియమావళి నుంచి మినహాయింపునకు సంబంధించిన అంశాల ఫైళ్లను మాత్రమే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు.
అన్ని ఫైళ్లూ ఈసీకి పంపితే చర్యలు తప్పవు: సీఈఓ భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి నుంచి మినహాయింపునకు సంబంధించిన అంశాల ఫైళ్లను మాత్రమే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలని, అలా కాకుండా ఇప్పటికే ఎన్నికల నియమావళిలో స్పష్టంగా ఉన్న అంశాల ఫైళ్లను కూడా కమిషన్‌కు పంపిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని శాఖలకు గురువారం ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల కోడ్‌లో స్పష్టంగా పేర్కొన్న అంశాలకు చెందిన ఫైళ్లను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు శాఖలు పంపించడంపై ఆయన మండిపడ్డారు. అందరికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందుబాటులో ఉందని.. ఏ పనులకు సంబంధించి ముందస్తుగా కమిషన్ అనుమతి తీసుకోవాలనే విషయాలు స్పష్టంగా ఉన్నందున, వాటిని పాటించాలని స్పష్టం చేశారు.
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
ఎన్నికల ఏర్పాట్లపై భన్వర్‌లాల్ గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఎన్నికల కోడ్ అమలు, ఉల్లంఘనలపై చర్యల గురించి కలెక్టర్లతో మాట్లాడారు. డబ్బు, మద్యం సరఫరాలపై నిఘాను ముమ్మరం చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీలతో సమీక్షించారు. కాగా, కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవార ం అన్ని రాష్ట్రాల సీఈఓలతో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.