పోటెత్తిన ఓటు
* గ్రామీణ ప్రజలు, పట్టణ పేదల భారీ పోలింగ్
* 13 జిల్లాల్లో సగటున 78% పోలింగ్
* తుది లెక్కల్లో ఈ శాతం పెరిగే అవకాశాలు
* అధికార, ప్రతిపక్షాలపై వ్యక్తమైన ఆగ్రహావేశాలు
* జగన్ సంక్షేమ పథకాలపై ప్రజా విశ్వాసం
* కుమ్మక్కు రాజకీయాలపై ఏవగింపు
* సమర్థ నాయకుడు కావాలనే భావన
* ఎన్నికల్లో కసిగా ఓటేసిన సీమాంధ్ర ఓటర్లు
* ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయంటున్న విశ్లేషకులు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో గత ఎన్నికలతో పోల్చితే బుధవారం జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. దీనికి కారణం.. ఒకవైపు సరిగ్గా ఎన్నికలకు రాష్ట్ర విభజన చేపట్టటం, మరోవైపు ఒక్క నాయకుడిని ఎదుర్కోవటానికి మిగతా పార్టీలన్నీ కుమ్మక్కు రాజకీయాలు చేయటం, ఆ ఒక్కడే లక్ష్యంగా ఒక వర్గం మీడియా మొత్తం అడ్డూ అదుపూ లేకుండా విషప్రచారం సాగించటం.. ఆపైన మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మరణానంతరం కొడిగట్టిపోవటం.. ఆ పథకాలను మరింత మెరుగుపరచి, మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఆయన తనయుడు ఇచ్చిన హామీలను విశ్వసించటం.. ఇవన్నీ కలసి జనం.. ముఖ్యంగా గ్రామీణ పల్లెజనం, పట్టణ పేదజనం.. కసిగా ఓటేయటమేనని పోలింగ్ సరళినిబట్టి తేటతెల్లమవుతోంది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. బుధవారం తెల్లవారే సరికే గ్రామాల్లోనూ, బస్తీల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు.
ఆసరా లేనిదే నడవలేని వృద్ధులు, వికలాంగులు సైతం పట్టుదలగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైతులు, మహిళలు, యువకులు కూడా పెద్దఎత్తున తరలిరావడం ప్రధానాంశంగా మారింది. వీరంతా ఒకే ఒక్క లక్ష్యంతో.. అధికారం కోసం అర్రులు చాచే మోసపూరిత రాజకీయాలకు చెల్లుచీటీ రాసేసి.. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే విశ్వసనీయతకు పట్టం కట్టాలన్న పట్టుదలతో కసితో ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తేటతెల్లమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలన్న చైతన్యం ఈ ఓటర్లలో కనిపించింది. జిల్లా కేంద్రాల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలోని 13 జిల్లాల్లో సగటున 78 శాతం పోలింగ్ జరిగింది. 2009తో పోల్చితే ఇది 2 శాతం అధికం. జిల్లాల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ప్రకటించనున్న తుది గణాంకాల ప్రకారం పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది.
పాలక ప్రతిపక్షాలపై పెల్లుబికిన ఆగ్రహం...
పాలక ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు రాష్ట్రంలో భారీ పోలింగ్‌కు కారణమని రాజకీయ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్ ఆరంభానికి ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిపించిన భారీ ఓటర్ల క్యూలు వారి విశ్లేషణలకు బలం చేకూర్చాయి. పోలింగ్ పెరగడానికి విశ్లేషకులు చెప్తున్న కారణాలు కూడా వాస్తవాన్ని ప్రతిబింబింపజేసేలా ఉండటం విశేషం. ‘రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ మహానేత మరణానంతరం గత నాలుగేళ్లలో నీరుగారాయి. సంక్షేమ కార్యక్రమాలను దెబ్బతీసిన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వాన్ని కాపాడారు.
రాష్ట్ర విభజనకూ సహకరించారు. ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహావేశాన్ని మరింత పెంచడం కారణంగా ఓటింగ్ శాతం పెరిగింది’ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందుతున్న రైతులు, వైఎస్ పథకాలను నీరుగార్చారన్న కోపంతో ఉన్న గ్రామీణులు కెరటాల్లా పోలింగ్ కేంద్రాలకు రావడంతో గ్రామాల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఇలా పోలింగ్ శాతం పెరగడమనేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనానికి దోహదం చేసింది’ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
జగన్ సంక్షేమ హామీలపై బలమైన విశ్వాసం...
ఈసారి పోలింగ్ శాతం పెరగటానికి.. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఆశించే బడుగు, బలహీన వర్గాల వారు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనటమూ ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మరణానంతరం నీరుగారిపోయాయి. లబ్ధిదారులైన ఆ వర్గాలు గడచిన నాలుగేళ్లుగా ఆ పథకాలు అందక ఎదురుచూపులతో గడుపుతున్నారు. అదే సమయంలో.. సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో ప్రచారం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా, దానికి తోడు తన తండ్రి అమలు చేసిన సంక్షేమ పథకాలు మరింత మెరుగుపరిచి అమలు చేస్తానన్న హామీలను జగన్ నెరవేరుస్తారన్న నమ్మకం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లలో వ్యక్తమైంది.
టీడీపీ అధినేత చంద్రబాబులా ఆచరణ సాధ్యం కాని హామీల జోలికెళ్లకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేయగలిగిన సంక్షేమ పథకాలను మాత్రమే ప్రకటించడంతో ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. అమ్మ ఒడి, డ్వాక్రా మహిళలకు రుణాల రద్దు, వృద్ధాప్య, వితంతు పింఛను పెంపు, రూ. 100కే 150 యూనిట్ల విద్యుత్తు లాంటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆలోచింపజేశాయి. దీంతో.. కాంగ్రెస్, టీడీపీపై ఉన్న వ్యతిరేక ఓటు.. వైఎస్ తనయునిపై ఏర్పడిన అనుకూల ఓటుతో.. తాజా ఎన్నికలను అస్త్రంగా చేసుకుని ఒక రకమైన ఆగ్రహావేశాలతో ఓటింగ్‌లో పాల్గొన్నట్టు కనబడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో సైతం గతానికన్నా ఎక్కువ పోలింగ్ కావడానికి ఇది కారణమైందని.. దీనివల్ల వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్ హవా పెరిగిందని విశ్లేషకులు, సర్వే చేసిన వారు చెప్తున్నారు.