
‘అందరూ మీలా దొంగలు కాదు...
‘అందరూ వాళ్లలెక్క దొంగలే అని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నరేమో. ఇవాళ పొద్దున టీవీలో చూసిన. కేసీఆర్ మీద సీబీఐ కేసులు పెడుతరట. మోస్ట్ వెల్‌కం.. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా వేల సంఖ్యలో నా సభలకు జనం వస్తుంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక కుట్రలు చేస్తున్నరు.
నాపై సీబీఐ కేసులు కాంగ్రెస్ కుట్ర
జనాదరణ చూసి ఓర్వలేకపోతున్నరు: కేసీఆర్
కాంగ్రెస్ నేతల పిట్ట బెదిరింపులకు భయపడను
నిప్పులెక్క బతికిన.. విచారణ చేసుకోండి
పొన్నాల భూ ఆక్రమణల సంగతేంది?
దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా
పొన్నాలా.. సిగ్గూశరం ఉంటే రాజీనామా చెయ్
చంద్రబాబు తెలంగాణ ద్రోహి
మన రాష్ట్రంల మన జెండానే ఎగరాలె
మహబూబ్‌నగర్ జిల్లాలో కేసీఆర్ ప్రచారం
మహబూబ్‌నగర్:‘‘అందరూ వాళ్లలెక్క దొంగలే అని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నరేమో. ఇవాళ పొద్దున టీవీలో చూసిన. కేసీఆర్ మీద సీబీఐ కేసులు పెడుతరట. మోస్ట్ వెల్‌కం.. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా వేల సంఖ్యలో నా సభలకు జనం వస్తుంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక కుట్రలు చేస్తున్నరు. భారత రాష్ట్రపతికి ఒక విజ్ఞప్తి. సీబీఐ ఎంక్వైరీ పెట్టుకోండి.. ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరు. నేను నిప్పులెక్క బతికిన మనిషిని. నా జీవితం తెరిచిన పుస్తకం..’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తనపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించడం కాంగ్రెస్ కుట్ర అని మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది చోట్ల నిర్వహించిన టీఆర్‌ఎస్ బహిరంగసభల్లో కేసీఆర్ ప్రసంగించారు.
‘‘కాంగ్రెస్ నేతల పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరు. నా మీద కేసులు ఉంటే ఇప్పటివరకు ఉంచుదురా? ఎప్పుడో బొందపెడుదురు..’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై విచారణకు అభ్యంతరం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఇప్పటికే చెప్పానని పేర్కొన్నారు. ముందు దళితుల వద్ద తీసుకున్న భూమిని తిరిగి వారికి అప్పగించాలని పొన్నాల లక్ష్మయ్యను డిమాండ్ చేశారు. సిగ్గూశరం ఉంటే వెంటనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ మండిపడ్డారు. ‘‘హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీని నేను అడుగుతున్నా. మీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దళితుల భూమిని దొంగిలించిండు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలూ నా దగ్గర ఉన్నయి. తెలియక, పొరపాటున కొనుగోలు చేశానని చెబుతున్న లక్ష్మయ్య.. అప్పటికే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నడు. ఈ నిర్వాకంపై రాహుల్ సమాధానం చెప్పాలి..’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. పొన్నాల భూ ఆక్రమణల వ్యవహారంపై శనివారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి దర్యాప్తు చేయాల్సిందిగా కోరుతానని చెప్పారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలె..
‘‘ఉద్యమకారులపై కేసులు పెట్టించి, లాఠీలతో కొట్టించిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలె. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఎక్కడి ఉద్యోగులు అక్కడ పనిచేయాలంటే.. కాంగ్రెస్ నాయకులు పెడర్థాలు తీస్తూ నానా యాగీ చేస్తూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు..’’ అని విమర్శించారు.
చంద్రబాబు తెలంగాణ ద్రోహి..
చంద్రబాబునాయుడేమీ మహా నాయకుడు కాదని కేసీఆర్ విమర్శించారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు అడుగడుగునా అడ్డుకున్నడు. బాబు తెలంగాణ ద్రోహి.. ఆయనను చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నయి. నరేంద్ర మోడీని మతతత్వవాది అంటూ ఆనాడు విమర్శించిండు. ఇప్పుడు అదే మోడీని పొగుడుకుంట ప్రజలను మభ్యపెడుతున్నడు..’’ అని మండిపడ్డారు.
మన రాత మన చేతుల్లోనే ఉన్నది..
‘‘సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మన రాతలను మనమే మార్చుకోవాలి. అది మన చేతుల్లోనే ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమయితది. తెలంగాణ భవిష్యత్‌కు మీరందరూ నిర్దేశకులు కావాలె. మన రాష్ట్రంలో మన జెండానే ఎగరాలె..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రాంత లోక్‌సభ సభ్యుడిగా తనకు మహబూబ్‌నగర్ జిల్లా బాధలు, కరువు, వలసలు అన్నీ తెలుసని, వాటన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే... పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పారు.
కేసీఆర్‌కు అనారోగ్యం..
మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పర్యటనలో కేసీఆర్ 11 చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించాల్సి ఉంది. కానీ, కేసీఆర్ స్వల్ప అనారోగ్యం కారణంగా నారాయణపేట, మక్తల్, కోస్గి (కొడంగల్) సభలకు ఆయన హాజరుకాలేదు. ఈ సభల్లో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే కేసీఆర్ కల్వకుర్తి సభలో పాల్గొనాల్సి ఉండగా.. రెండు గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. జ్వరంతో పాటు కాళ్ల వాపులు రావడం వల్ల ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నట్లు చెప్పిన కేసీఆర్... కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, శాంతినగర్, గద్వాలలో త్వరగా ప్రసంగాలు ముగిం చారు. నాగర్‌కర్నూలు, కొత్తకోట (దేవరకద్ర), జడ్చర్లలో మాత్రం సుమారు 20 నిమిషాలకు పైగా ప్రసంగించారు.