
దమ్మిడీకి పనికిరానివాళ్లు నాకు నీతులు చెప్తారా?
న్యూఢిల్లీ: తనకు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి జైరాం రమేష్పై ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్మిడీకి పనికిరానివాళ్లు నాకు నీతులు చెప్తారా అంటూ ధ్వజమెత్తారు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని హైకమాండ్ దగ్గర కుప్పిగంతులు వేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
దమ్ముంటే జైరాం రమేష్ లోక్‌సభకు పోటీచేసి గెలవాలని కావూరి సవాల్ విసిరారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి జైరాం రమేష్ లాంటి నాయకులే కారణమన్నారు. వీరిని హైకమాండ్ ప్రోత్సహించరాదని సూచించారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన కావూరి సాంబశివరావుపై జైరాం రమేష్ అంతకుముందు విమర్శలు గుప్పించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే కావూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ నుంచి కావూరి ఎంతో మేలు పొందారని గుర్తు చేశారు.