
కేసీఆర్ నీచుడు, నయవంచకుడు
టీయూడబ్ల్యూజే ‘మీట్ ది ప్రెస్’లో టీపీసీసీ చీఫ్ పొన్నాల
కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే సంతాపం తెలపలేదు
{పొఫెసర్ జయశంకర్‌ను అవమానించాడు
ఏ స్థాయికైనా దిగజారే అలాంటి బతుకు నాకు వద్దు
తెలంగాణలో ఆత్మహత్యలన్నింటికీ టీఆర్‌ఎస్సే కారణం
హైదరాబాద్: ‘‘టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నీచుడు.. పిరికిపంద, వెన్నుపోటుదారుడు, మాట తప్పే మనిషి, నమ్మించి మోసం చేసే నయవంచకుడు.. ’’ అంటూ టీపీసీసీ చీఫ్ పొన్నాల విరుచుకుపడ్డారు. మునుపెన్నడూ లేనంతగా కేసీఆర్‌పై విమర్శలు, ఆరోపణల వర్షం కురిపించారు. ఆయనలాంటి బతుకు తనకు వద్దే వద్దని.. అలాంటి వ్యక్తిని మరెక్కడా సృష్టించొద్దని దేవుడిని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి పొన్నాల హాజరయ్యారు. టీయూడబ్ల్యూజే నాయకులు పల్లె రవికుమార్, రమేశ్ హజారే, క్రాంతి, పీవీ శ్రీనివాస్, మారుతీసాగర్ పాల్గొన్న ఈ కార్యక్రమంతో పాటు, అంబేద్కర్ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాల మాట్లాడారు. ‘‘కేసీఆర్ వెన్నుపోటు పొడిచే వ్యక్తి. చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వంలో భాగస్వామి. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం సంతాపం కూడా తెలపని వ్యక్తి.
ఎంపీ పదవి విషయంలో ప్రొఫెసర్ జయశంకర్‌ను అవమానించిన నీచుడు. కేసీఆర్ చేతిలో ఆలె నరేంద్రకు జరిగిన అవమానం అంతా ఇంతా కాదు. తన అవసరం కోసం ఏ స్థాయికైనా దిగజారే నైజం. అలాంటి బతుకు నాకొద్దు. ప్రపంచంలో మరెక్కడా అలాంటి వ్యక్తిని సృష్టించొద్దని దేవుడిని కోరుకుంటున్నా..’’ అని పొన్నాల మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిరస్కరించడం ఖాయమన్నారు. తెలంగాణలో హంగ్ ఏర్పడే ఆస్కారమే లేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాటల్లోనే... కేసీఆర్ ది నిరంకుశత్వం. కరీంనగర్ సభలో దళితులు పాదాభివందనం చేస్తున్నా.. వారించలేదు. టీఆర్‌ఎస్‌కు అభ్యర్థులే కరువయ్యారు. కాంగ్రెస్‌కు, నాకు భయపడి అరువు తెచ్చుకున్న నాయకులకు టికెట్లిచ్చిండు. రైతుల రుణాలు మాఫీ చేయాలంటే రూ. 78 వేల కోట్లు కావాలి. అది తెలంగాణ బడ్జెట్‌తో సాధ్యం కాదు. అయినా గాలి మాటలు చెబుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు.
పోలవరం, బాబ్లీ వద్దంటూ మాటలు చెప్పే కేసీఆర్... ఫాంహౌస్‌లో పోలవరం కాంట్రాక్టర్‌తో మంతనాలు జరుపుతున్నారు. బాబ్లీ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను పార్టీలో చేర్చుకున్నారు.తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలన్నింటికీ టీఆర్‌ఎస్సే కారణం. ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టడం వల్లే బలిదానాలు జరిగాయి. కిరోసిన్ పోసుకుని చస్తానంటూ బెదిరించిన వ్యక్తి (హరీశ్‌రావును ఉద్దేశిస్తూ..) అగ్గిపుల్ల మర్చిపోయి యువతను రెచ్చగొట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని అంబేద్కర్ జయంతి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. వారసులకు టికెట్ ఇవ్వబోమని హైకమాండ్ ఎన్నడూ చెప్పలేదు. గెలుపు, సామాజిక కోణమే ప్రధానాంశంగా టికెట్లు కేటాయించాం. మా కోడలు వైశాలికి టికెట్ అవసరం లేదని భావించామే తప్ప ఇప్పించలేని చేతకానితనం కాదు.