మా కుటుంబం రాజకీయాల్లో ఉంటే తప్పేంటి: కేసీఆర్
హైదరాబాద్: తన కుటుంబం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో రాజకీయాల్లో ఉంటే తప్పేంటని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలను సహించేది లేదంటూనే..తన కుటుంబం రాజకీయాల్లో ఉండటానికి అర్హతలున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దొరలపాలన అంటున్న కాంగ్రెస్ దానికి అర్ధం చెప్పాలన్నారు.ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తానన్నారు.
కాంగ్రెస్ పొత్తు అనేది ముగిసిన అధ్యాయమని, ఇక ఆ పార్టీతో పొత్తు ప్రస్తక్తి అంశమే లేదన్నారు. మంత్రి వర్గంలో ఉన్న ప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన పొన్నాల అవినీతిని బయటపెడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ సీఎం అంటున్న చంద్రబాబు నాయుడు..సీమాంధ్రలో బీసీ సీఎం అని ఎందుకు అనడంలేదని కేసీఆర్ ప్రశ్నించారు. పొత్తు పెట్టుకునేందుకు సీపీఐతో చర్చలు జరుపుతున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలకు టికెట్ల అంశంపై మాట్లాడుతూ..1200 మంది అమరవీరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇరిగేషన్ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టులపై అక్రమాలకు పాల్పడ్డ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. సీఎంగా కిరణ్ చివరి రోజుల్లో సంతకాలు పెట్టిన ఫైళ్లపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.