‘పసుపు’తో పట్టుకు యత్నం | leaders are giving haami to establish yellow board | Sakshi
Sakshi News home page

‘పసుపు’తో పట్టుకు యత్నం

Published Sat, Apr 26 2014 4:12 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

‘పసుపు’తో పట్టుకు యత్నం - Sakshi

‘పసుపు’తో పట్టుకు యత్నం

 

  •      అందరి నోట పసుపు బోర్డు ఏర్పాటు హామీ
  •      ఎన్నికల నినాదంగా మారిన వైనం
  •      జగన్ దీక్షతో ఊపందుకున్న పసుపు ఉద్యమం

 సార్వత్రిక ఎన్నికల్ల్లో  రైతుల ఓట్లను రాబట్టుకునేందుకు పసుపు బోర్డు పేరు చెప్పి పట్టు సంపాదించడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పసుపును పండించే రైతుల కష్టాలను తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి గతంలో ఆర్మూర్‌లో దీక్ష చేపట్టడంతో పసుపు రైతుల ఉద్యమం ఊపందుకుంది. దీంతో పసుపు రైతులకు అండగా మేమున్నాం అంటే మేమున్నాం అంటూ వివిధ పార్టీల అభ్యర్థులు హామీలతో ముంచెత్తుతున్నారు.
 
 మోర్తాడ్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం నినాదంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పండించే పసుపులో 25 శాతం పసుపును బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అత్యధికంగా పసుపు పంట సాగు ఈ ప్రాంతంలోనే సాగు అవుతుండగా పసుపు పంటకు సంబంధించి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా వినిపిస్తోంది. సీమాం ధ్రలో మిర్చి, టుబాకో పంటలకు సంబంధించి ప్రత్యేక బోర్డులు ఉన్నాయి. కేరళలో సుగుంధ ద్రవ్యాల పంటలను సాగు చేసే రైతులను ప్రోత్సహించడానికి స్పైసిస్ బోర్డు ఉంది. వాణిజ్య పంటలకు సంబంధించి బోర్డులు ఏర్పాటు అయితే పంట సాగు విస్తీర్ణం నిర్ణయించడం, మద్దతు ధర ప్రకటించి అమలు చేయడం, రైతులకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది. మిర్చి, టుబాకో, స్పైసిస్ బోర్డుల తరహాలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని పలువురు రైతు నాయకులు ఉద్యమం చేపట్టారు. పసుపు పంటను పండించే రైతులకు అండగా ఉంటానని యువ నేత జగన్ గతంలోనే హామీ ఇవ్వడంతో రైతుల్లో మంచి స్పందన కనిపించింది.

జగన్ బాటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పాలెపు మురళి పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చారు. దీంతో రైతులు తమకు దగ్గర కారని భావించిన ఇతర పార్టీలు రైతులను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పసుపు బోర్డు ఏర్పాటు హామీలు ఇస్తున్నారు. పసుపు బోర్డు ప్రాధాన్యతను అభ్యర్థులు తమ నేతలకు వివరించడంతో ప్రచార సభలకు హాజరవుతున్న వివిధ పార్టీల ముఖ్యనేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గురువారం మోర్తాడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన కేసీఆర్ పసుపు బోర్డు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూడా పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇస్తామని చెబుతున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములకు రైతుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. పసుపు బోర్డు ఎన్నికల నినాదంగా మారడంతో ఎన్నికల తరువాతనైనా పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతాయా అని రైతులు సంశయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement