
ఏపీ తరహా కుట్రలు బెంగాల్ లో సాగవు:మమతా
గూర్ఖాలాండ్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లకు మమత హెచ్చరిక
ఇటాహర్ (పశ్చిమబెంగాల్): ఆంధ్రప్రదేశ్ తరహాలో పశ్చిమబెంగాల్‌ను ముక్కలు కానిచ్చేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. తాను ప్రాణాలతో ఉన్నంతకాలం రాష్ట్రానికి చెందిన ఒక్క అంగుళం భూభాగాన్నికూడా వదిలిపెట్టే ప్రశ్నేలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో చేసిన కుట్రలను ఇక్కడ సాగనిచ్చేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ సారి ఆ పార్టీలు సఫలంకావని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం తమ భూమిని వదులుకోమని అన్నారు. బుధవారం ఇటాహర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలను ఎండగట్టారు. డార్జిలింగ్ సీటునుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎస్.ఎస్. అహ్లూవాలియా, ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటుకు తమ పార్టీ మద్దతునిస్తుందని విలేకరుల సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో మమత ఈ రెండు పార్టీలపై మండిపడ్డారు. తెలంగాణ బిల్లు విషయంలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు.