'అబ్బాయీ అలా మాట్లాడకు....'
అమేథీ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందంటూ తన దాయాది రాహుల్ గాంధీకి బిజెపి యువనేత వరుణ్ గాంధీ ఇచ్చిన ఖితాబు ఇప్పుడు రాజకీయరంగంలో సంచలనం సృష్టిస్తోంది. బిజెపి తనకు సరైన గుర్తింపునివ్వడం లేదన్న ఆవేదనతోనే వరుణ్ ఇలా అన్నాడా అన్న ప్రశ్న కూడా తలెత్తింది.
నిజానికి వరుణ్ , రాహుల్ ల మధ్య అంత పెద్ద సఖ్యతేమీ లేదు. వరుణ్ తన వివాహానికి స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రం ఇచ్చినా రాహుల్, సోనియాలు హాజరుకాలేదు. సోనియా, మేనకల వైరం చాలా పాతది. అయినప్పటికీ రాహుల్ పై వరుణ్ ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో బిజెపిలో కలవరం చెలరేగింది.
ఇప్పుడు కవర్ అప్ చేసేందుకు వరుణ్ తల్లి, బిజెపి సీనియర్ నేత మేనకా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. 'ఏదైనా మాట్లాడేముందు వరుణ్ గాంధీ ముందు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా తాను చూడని విషయాల గురించి ఏమీ మాట్లాడకూడదు' అని ఆమె వ్యాఖ్యానించారు. అంటే రాహుల్ అమేథీ చూడకుండానే అక్కడి అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని ఆమె సున్నితంగా చెప్పారు. ఇలా వివాదానికి మేనక తనదైన శైలిలో తెరదించారు.