తొలి మహిళా మంత్రి మన హైదరాబాదీ...
ముహ్మద్ మంజూర్ పరదా ధరించే సంప్రదాయం.. మగవాళ్ల మధ్యలోకి రావొద్దంటూ ఆంక్షలు.. ఆపై రజాకార్ల ఆగడాలు .. ఇంతటి ఆంక్షల చట్రంలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసూమా బేగం! దేశంలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి ముస్లిం మహిళ కూడా ఈమెనే! హైదరాబాదీ అయిన మాసూమా బేగం చిన్నప్పట్నుంచే సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజనీనాయుడితో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన అఖిల భారత మహిళా సదస్సులో పాల్గొన్నారు.
హైదరాబాద్ స్టేట్‌లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో పత్తర్‌గట్టి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1960 జనవరిలో రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేరారు.